ప్రపంచంహోమ్

జైలు నుంచి కంటి ఆసుపత్రికి ఇమ్రాన్ ఖాన్ తరలింపు

#ImaranKhan

జైల్ లో ఉన్న పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పీటీఐ) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్‌ను కంటి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. నవంబర్ 10, 11 తేదీల మధ్య రాత్రి ఆయనను రావల్పిండిలోని అడియాలా జైలు నుంచి ఇస్లామాబాద్‌లోని పాకిస్థాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (పిమ్స్) ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు డాన్ పత్రిక వెల్లడించింది. ఆసుపత్రి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, కంటి వైద్య నిపుణుడి సూచన మేరకు వైద్య పరీక్షలు, తదుపరి చికిత్స కోసం ఆయనను ఆసుపత్రికి తీసుకువచ్చారు.

ఇమ్రాన్ ఖాన్ 2023 నుంచి జైలులో ఉంటున్నారు. ఆయనపై అవినీతి ఆరోపణలతో పాటు హింసను ప్రేరేపించారనే ఆరోపణలకు సంబంధించిన కేసులు సహా వందకు పైగా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆయన రావల్పిండిలోని అడియాలా జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఆయన కుడి కంటికి సంబంధించిన సమస్యతో బాధపడుతున్నారు. చూపు తగ్గుతోందని ఫిర్యాదు చేయడంతో అప్పటి నుంచి వైద్య చికిత్స కొనసాగుతోంది.

ఆసుపత్రికి తీసుకువచ్చిన అనంతరం వైద్యులు తొలుత ఆయనకు సాధారణ ఆరోగ్య పరీక్షలతో పాటు కంటి పరీక్షలు నిర్వహించారు. ఆయన రక్తపోటు, ఇతర కీలక ఆరోగ్య ప్రమాణాలు సాధారణంగానే ఉన్నాయని, వైద్యపరంగా స్థిరంగా ఉన్నారని ఆసుపత్రి అధికారి వెల్లడించారు. అనంతరం అవసరమైన అనుమతి తీసుకుని, వైద్య ప్రమాణాలు, ముందస్తు జాగ్రత్తలు పాటిస్తూ కంటి వైద్య బృందం ప్రత్యేక చికిత్స అందించింది. ఇందులో భాగంగా కంటిలోకి యాంటీ-వీఈజీఎఫ్ ఇంజెక్షన్ ఇచ్చారు. కంటిలో అసాధారణ రక్తనాళాల పెరుగుదలను నియంత్రించేందుకు, చూపు సంబంధిత సమస్యలకు చికిత్సలో ఈ తరహా ఇంజెక్షన్లను ఉపయోగిస్తారు.

ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి స్థిరంగానే ఉందని ఆసుపత్రి అధికారులు తెలిపారు. నవంబర్ 11వ తేదీ తెల్లవారుజామున సుమారు 2.30 గంటలకు అవసరమైన వైద్య సూచనలు, తదుపరి చికిత్సకు సంబంధించిన మార్గదర్శకాలు ఇచ్చి ఆయనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు. అనంతరం తిరిగి అడియాలా జైలుకు తరలించారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించడంపై ఆయన కుటుంబ సభ్యులు, పీటీఐ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆయనను మెరుగైన వైద్య సదుపాయాలున్న ప్రైవేటు ఆసుపత్రికి తరలించాలని వారు పట్టుబడుతున్నారు. మరోవైపు ప్రభుత్వ వర్గాలు మాత్రం పిమ్స్ ఆసుపత్రిలో అందించిన చికిత్స అనంతరం ఆయన కంటి చూపు మెరుగుపడిందని చెబుతున్నాయి.

ఇమ్రాన్ ఖాన్‌ను ప్రైవేటు ఆసుపత్రికి తరలించాలని పాకిస్థాన్ సుప్రీంకోర్టు గత ఆగస్టు 18న ఆదేశించింది. అయినప్పటికీ ఆయనను ప్రభుత్వ ఆధ్వర్యంలోని పిమ్స్ ఆసుపత్రికే తీసుకెళ్లారు. అక్కడ వివిధ వైద్య పరీక్షలు, చికిత్స నిర్వహించిన అనంతరం తిరిగి జైలుకు పంపించారు. ఇమ్రాన్ ఖాన్‌కు అందిస్తున్న వైద్య సదుపాయాలు, ఆయనను ప్రైవేటు ఆసుపత్రికి తరలించాలన్న కుటుంబ సభ్యుల డిమాండ్ నేపథ్యంలో ఈ వ్యవహారం పాకిస్థాన్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Related posts

వార్ రూమ్ నుంచి మరువలేని సాయం

Satyam News

యూట్యూబర్ పై దుండగుల కాల్పులు

Satyam News

అంగరంగ వైభవంగా శ్రీ భూలక్ష్మి చెన్నకేశవ స్వామి కళ్యాణం

Satyam News

కేరళలో భారీ విజయం సాధించిన బీజేపీ

Satyam News

గూగుల్ పై వైసీపీ కుట్ర… హైకోర్ట్ సంచలన నిర్ణయం

Satyam News

వైష్ణోదేవి యాత్రకు తాత్కాలిక బ్రేక్

Satyam News

Leave a Comment