సంపాదకీయంహోమ్

ప్రశ్నించే హక్కా? హద్దులు లేని ప్రవర్తనా?

పత్రికా రంగంలో విమర్శ అనేది ఒక వజ్రాయుధం. దాన్ని ప్రజా ప్రయోజనాల కోసం వాడినంత కాలం ఆ రంగానికి గౌరవం ఉంటుంది. కానీ, ఇటీవలి కాలంలో డిజిటల్ మీడియా మరియు యూట్యూబ్ వేదికల సాక్షిగా కొందరు జర్నలిజం ముసుగు వేసుకుని సాగిస్తున్న ప్రవర్తనా శైలి, వాడుతున్న భాషా ప్రమాణాలు పాత్రికేయ విలువలను పాతాళానికి తొక్కుతున్నాయి. ప్రభుత్వాల లోపాలను నిలదీయడం వేరు, వ్యవస్థలపై ఉద్దేశపూర్వకంగా బురదజల్లుతూ సమాజంలో అశాంతిని రేకెత్తించడం వేరు. ఈ రెండింటి మధ్య ఉన్న లక్ష్మణ రేఖను చెరిపేస్తూ సాగుతున్న కొన్ని ప్రసారాలు నేడు చట్టపరమైన చర్యల ఉచ్చులో చిక్కుకుంటున్నాయి.

నిజానికి, ఒక జర్నలిస్టుకు ఉండవలసిన ప్రాథమిక లక్షణం నిష్పాక్షికత మరియు భాషా సంయమనం. గతంలో సదరు డిజిటల్ ప్లాట్‌ఫారమ్ వేదికగా అధికారిక వ్యవస్థలను ఉద్దేశించి చేసిన సవాల్‌ పూరిత వ్యాఖ్యలు, ప్రత్యర్థులపై వాడిన అభ్యంతరకరమైన బూతు పదజాలం స్పష్టమైన గీతను దాటాయి. మైకు దొరికింది కదా అని నోటికొచ్చినట్లు మాట్లాడటం, ప్రతిపక్ష అజెండాలను భుజానికెత్తుకుని వ్యక్తిగత దూషణలకు దిగడం ఏ రకమైన జర్నలిజం కిందకు వస్తుంది?

జర్నలిస్ట్ ముసుగులో కుల ద్వేషం

జర్నలిస్టు ముసుగులో పొరుగు రాష్ట్రం తెలంగాణా నుండి యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అక్కడి రాజకీయ నాయకులను బూతులు తిట్టిన కేవీ రెడ్డి అనే ఒక జర్నలిస్టు అరెస్ట్ ఈ కోవకు వస్తుంది. ఎన్ని సార్లు హెచ్చరికలు చేసినా పోలీసుల మాట పట్టించుకోకుండా కేవలం కుల పక్షపాతం తో ఇతను ఆరోపణలు చేస్తుంటాడు.

విమర్శల్లో కనీస ప్రమాణాలు లోపించి, అవి కేవలం క్లిక్‌లు, వ్యూస్ కోసం వ్యవస్థలను బ్లాక్‌మెయిల్ చేసే స్థాయికి దిగజారినప్పుడు, కులగజ్జితో పెట్టినప్పుడు చట్టం తన పని తాను చేయడం ప్రజాస్వామ్యానికి అవసరమే.

అయితే, ఇటీవల ఏపీ పోలీసులు కేసులను తీవ్రతరం చేసి, అరెస్ట్ చేసే తరుణంలో సదరు జర్నలిస్ట్ వర్గం నుండి సరికొత్త వాదనలు తెరపైకి వస్తున్నాయి. చట్టపరమైన విచారణను ఎదుర్కోవడానికి బదులుగా, దీనిని కేవలం “రాజకీయ కక్షసాధింపు” అని, “వ్యక్తుల, తెలంగాణా జర్నలిస్టుల భావప్రకటన స్వేచ్ఛపై దాడి” అని చిత్రించే ప్రయత్నం జరుగుతోంది. గతంలో అపరిమితమైన అహంకారంతో మాట్లాడిన ధోరణిని పక్కన పెట్టి, ఇప్పుడు పోలీస్ విచారణలు తీవ్రమవగానే ప్రాంతీయ సెంటిమెంట్లను రచ్చకెక్కించడం చూస్తుంటే బాధ్యతారాహిత్యం స్పష్టంగా కనిపిస్తోంది. తప్పు చేసినప్పుడు జర్నలిజం కార్డును రక్షణ కవచంగా వాడుకోవడం ఎంతవరకు సమంజసం?

ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే, తీవ్రమైన దేశద్రోహ చట్టాల పరిధిలోకి వచ్చేలా సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్లే ఈ విధమైన అరెస్టులు, పోలీస్ విచారణలు ఎదుర్కోవాల్సి వస్తోంది. దీన్ని కూడా ప్రాంతీయ భావోద్వేగాలతో ముడిపెట్టి, రాజకీయ లబ్ధి కోసం వాడటం సరికాదు. వాక్ స్వాతంత్ర్యం అంటే సమాజాన్ని తప్పుదోవ పట్టించే స్వేచ్ఛ కాదు. సమాజ హితం కోరే ప్రతి ఒక్కరూ ఇటువంటి బాధ్యతారహిత, ఉద్రేకపూరిత ప్రవర్తనను ఖండించాల్సిందే. ఇప్పటికైనా సోషల్ మీడియా జర్నలిజం పేరిట బూతుల సామ్రాజ్యాన్ని నడుపుతున్న వారు ఆత్మపరిశీలన చేసుకోకపోతే, వ్యవస్థలు మరింత కఠినంగా మారక తప్పదు.

Related posts

కల్తీ నెయ్యిపై మరో కమిటీ..నిర్ణయం సరైనదేనా?

Satyam News

జైలు నుంచి ఇమ్రాన్ ఖాన్ సందేశం ఇదీ….

Satyam News

ప్రకాశ్ రాజ్ కు నాన్ బెయిలబుల్ వారంట్

Satyam News

అమెరికా ఆయిల్ దాహం: ఇరాన్‌లో మృతుల సంఖ్య 1145

Satyam News

పంటకోత ప్రయోగ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ గణాంకాధికారి

Satyam News

‘టీమ్ ఇండియాగా ముందుకు సాగాలి’

Satyam News

Leave a Comment