ముఖ్యంశాలుహోమ్

కాకతీయ జూలాజికల్ పార్క్ అభివృద్ధికి CAMPA నిధులివ్వాలి

#KadiyamKavya

కాకతీయ జూలాజికల్‌ పార్కు అభివృద్ధికి కాంపెన్సేటరీ అఫారెస్టేషన్‌ ఫండ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ప్లానింగ్‌ అథారిటీ (CAMPA) నిధులు మంజూరు చేయాలని వరంగల్‌ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య కోరారు. ఈ మేరకు మంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర జూ అథారిటీ సభ్య కార్యదర్శి డా. వి. క్లెమెంట్‌ బెన్‌ను కలిసి వినతిపత్రం అందజేసి వివరించారు.

హనుమకొండలోని కాకతీయ జూలాజికల్‌ పార్కులో సింహాల ఎన్‌క్లోజర్‌, నైట్‌ షెల్టర్‌, హైనా, జాకల్‌, వైల్డ్‌డాగ్‌ ఎన్‌క్లోజర్లు, నైట్‌ షెల్టర్లు, సరీసృపాల ఎన్‌క్లోజర్ల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలను తెలంగాణ అటవీ శాఖ ఇప్పటికే కేంద్ర జూ అథారిటీకి సమర్పించిందని ఎంపీ తెలిపారు. సాంకేతిక కమిటీ సూచనల మేరకు సవరణలు చేసి డిజైన్లు, డ్రాయింగ్‌లు సమర్పించినందున వాటికి త్వరగా ఆమోదం ఇవ్వాలని కోరారు.

సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న జూలాజికల్‌ పార్కులో జంతువుల సంరక్షణతో పాటు మొక్కల పెంపకం, పచ్చదనం అభివృద్ధి, పార్కు విస్తరణకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని ఎంపీ డా.కడియం కావ్య విజ్ఞప్తి చేశారు. కాంపా నిధులను విడుదల చేసి ఈ పనులకు వినియోగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

జంతువుల కదలికలు, ప్రవర్తనను నిరంతరం గమనిస్తూ వాటి సంరక్షణ, భద్రతను పర్యవేక్షించేందుకు వీడియో, ఆడియో రికార్డింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఎంపీ సూచించారు. ఆధునిక పర్యవేక్షణ సదుపాయాలతో జంతువుల సంరక్షణ మరింత సమర్థంగా చేపట్టవచ్చని తెలిపారు.

కాకతీయ జూలాజికల్‌ పార్కును వన్యప్రాణి సంరక్షణ, పర్యావరణ విద్య, ఎకో టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేస్తే వరంగల్‌కు వచ్చే పర్యాటకుల సంఖ్య పెరగడంతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు, ఆర్థిక కార్యకలాపాలు మెరుగుపడతాయని ఎంపీ పేర్కొన్నారు.

ఎంపీ డా. కడియం కావ్య చేసిన విజ్ఞప్తులపై కేంద్ర జూ అథారిటీ సభ్య కార్యదర్శి డా. వి. క్లెమెంట్‌ బెన్‌ సానుకూలంగా స్పందించారు. కాకతీయ జూలాజికల్‌ పార్కు అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలను పరిశీలించి, నిబంధనల మేరకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Related posts

హైదరాబాద్‌కు 915 ఎలక్ట్రిక్ బస్సులు

Satyam News

అమరావతి ఖర్చుపై వైసీపీ ఫేక్ ప్రచారం… అసలు లెక్కలు ఇవే…!!

Satyam News

ఆసియా క్రీడల్లో పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం

Satyam News

ఇరాన్ తో యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన

Satyam News

శాఖమూరులో పొట్టి శ్రీరాముల విగ్రహావిష్కరణ

Satyam News

మహిళల ఆభివృద్ధి దేశానికి పునాది

Satyam News

Leave a Comment