వేద వ్యాస మహర్షితో ప్రతిష్టతమైన ముగ్గురు అమ్మల ఆలయం బాసర శ్రీ సరస్వతీ దేవాలయం కొత్త శోభను సంతరించుకోబోతోంది. దక్షిణ గంగగా గుర్తింపు పొందిన పవిత్ర గోదావరి నదీ తీరంలోని బాసర క్షేత్రంలో జ్ఞాన సరస్వతి దేవి కొలువై ఉన్నారు. కురుక్షేత్ర యుద్ధానంతరం ప్రశాంతత కోసం వేద వ్యాస మహర్షి గోదావరి తీరానికి వచ్చి బాసరలో నివసించారట.
ఆ సమయంలో స్వయంగా ఆయనే గోదావరి ఇసుకతో జ్ఞాన సరస్వతితో పాటు మహా లక్ష్మి, మహా కాళి అమ్మ వార్ల మూర్తులను ప్రతిష్టించారనేది స్థల పురాణం.. అలా ముగ్గురమ్మల కొలువైన క్షేత్రంగా బాసర ప్రసిద్ధి చెందింది. జ్ఞాన సరస్వతి కొలువైన క్షేత్రం కావడంతో ప్రతి ఏటా పెద్ద సంఖ్యలో పిల్లలకు ఇక్కడ అక్షరాభ్యాసాలు చేయిస్తుంటారు.
వసంత పంచమి, ఇతర పర్వ దినాల్లో అక్షరాభ్యాసాలకు వచ్చే పిల్లలు, తల్లిదండ్రులు, వారి బంధువులు, భక్తులతో ఆలయం కిటకిటలాడుతుంది. ప్రాచీన ఆలయం కావడం, ఏటేటా పెరుగుతున్న భక్తుల సంఖ్యకు తగినట్లు అభివృద్ధి పనులు చేపట్టపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.. ఈ నేపథ్యంలో బాసర ఆలయ అభివృద్ధి చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పించారు.
సంప్రదాయాలు, ఆచారాలకు అనుగుణంగా ఆలయ అభివృద్ధి పనులు చేపట్టేందుకు మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. బాసర ఆలయ పునఃనిర్మాణ పనులకు మాస్టర్ ప్లాన్ రూపొందించే ముందు అధికారులు శృంగేరి పీఠాధిపతులతో సంప్రదించారు.
గర్భాలయం, అర్ధ మండపం, రాజ గోపురం, ఇతర గోపురాలు, మాడ వీధులు, కోనేరు, ఉత్తర ద్వారాల నిర్మాణాలకు సంబంధించి పీఠాధిపతుల అనుమతులు తీసుకున్నారు. వారి సూచనలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్‌ను రూపొందించారు.
భక్తుల సంఖ్య, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం 2 వేల చదరపు అడుగుల్లో ఉన్న గర్భాలయం, అర్ధ మండపాన్ని 5 వేల చదరపు అడుగులకు పెంచుతున్నారు. ఉత్తరం వైపున 9 అంతస్తుల రాజగోపురం, మిగిలిన మూడు దిక్కుల్లో 7 అతంస్తుల గోపురాలు, 33 అడుగుల వెడల్పుతో నాలుగు దిక్కుల మాడ వీధులు, ఉత్తర ద్వారం నిర్మించనున్నారు.
మొత్తంగా ఆలయ విస్తీర్ణాన్ని 20 వేల చదరపు అడుగుల నుంచి 62 వేల చదరపు అడుగులకు పెంచుతున్నారు. ఆలయ పునః నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.225 కోట్లను కేటాయించింది. గోదావరి నది పుష్కరాలు వచ్చే ఏడాది జూన్ లో ప్రారంభంకానున్నాయి.
పుష్కరాల సమయంలో లక్షలాది మంది భక్తులు పుణ్య స్నానాలకు బాసర గోదావరి తీరానికి చేరకుంటారు. వారికి అవసరమైన అన్ని వసతులు ప్రస్తుత మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా చేపట్టనున్నారు. ఏ ఒక్క భక్తుడు ఇబ్బంది పడకుండా అదే సమయంలో ఆలయ సంప్రదాయాలు, భక్తుల విశ్వాసాలకు అనుగుణంగా పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
