దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ కు సుప్రీంకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహనా ధర్మాసనం, ఎన్నికల సంఘం 2025 అక్టోబర్ నుంచి 2026 ఆగస్టు మధ్యకాలంలో ఇతర ఇద్దరు ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషీల అనుమతి లేదా సమ్మతి లేకుండా 14 నిర్ణయాలు తీసుకుందని ఆరోపిస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై ఈ నోటీసులు జారీ చేసింది.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌తో పాటు ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి, ఎన్నికల సంఘం డైరెక్టర్ జనరల్ (ఐటీ) సీమా ఖన్నా, సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ మనీష్ గార్గ్ తమ సమాధానాలను దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. ఎన్నికల సంఘంలో 14 కీలక నిర్ణయాలపై ఇద్దరు కమిషనర్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారన్న వార్తల నేపథ్యంలో ఈ పిటిషన్లు దాఖలయ్యాయి.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను విధుల నుంచి తప్పించాలి
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను విధుల నుంచి తాత్కాలికంగా తప్పించాలని పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ పలుమార్లు కోరారు. అయితే వార్తా కథనాల ఆధారంగా ఎన్నికల సంఘం వాదనను వినకుండా ఈ దశలో ఏకపక్షంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడానికి ధర్మాసనం నిరాకరించింది. ముందుగా ఎన్నికల సంఘం, సంబంధిత కమిషనర్ల నుంచి అధికారికంగా సమాధానాలు తీసుకోవాల్సి ఉందని స్పష్టం చేసింది.
పిటిషనర్లు రాకేశ్ కుమార్ సింగ్, న్యాయవాది శైలేంద్ర మణి త్రిపాఠి సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఇతర ఎన్నికల కమిషనర్ల సమ్మతి లేకుండానే నిర్ణయాలు, మార్గదర్శకాలు, సాఫ్ట్‌వేర్ మార్పులు చేశారని ఆరోపించారు. ఎన్నికల సంఘం బహుసభ్య సంస్థగా ఉన్నందున నిర్ణయాలు ఏకపక్షంగా తీసుకోవడానికి వీల్లేదని వారు వాదించారు. 2025 అక్టోబర్ నుంచి 2026 ఆగస్టు మధ్య కనీసం 14 సందర్భాల్లో సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి తమ అభ్యంతరాలను నమోదు చేశారని పిటిషన్లలో పేర్కొన్నారు.
సీఈసీ ఒక్కరే నిర్ణయాలు తీసుకోరాదు
ఎన్నికల సంఘం విశ్వసనీయతపై ప్రజల్లో ఆందోళన ఏర్పడిందని వికాస్ సింగ్ వాదించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికల సంఘానికి అప్పగించిన సమష్టి నిర్ణయాధికారాన్ని ఒక్క సీఈసీ స్వయంగా వినియోగించలేరని ప్రకటించాలని ఆయన కోరారు. ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ప్రాథమిక ఆధారమని పేర్కొంటూ, ఎన్నికల సంఘం చట్టపరమైన విధానాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన వాదించారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్లకు కొత్త చట్టం కింద కల్పించిన ప్రత్యేక రక్షణ అంశాన్ని కూడా విచారణ సందర్భంగా ప్రస్తావించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ఆ రక్షణ ప్రధానంగా రాష్ట్రపతికి సంబంధించినదని, న్యాయమూర్తులకు కూడా అలాంటి రక్షణ వర్తించదని పేర్కొంది.
చట్టాలను ఉల్లంఘించారు…
న్యాయవాది శైలేంద్ర మణి త్రిపాఠి దాఖలు చేసిన మరో ప్రజాప్రయోజన వ్యాజ్యంపైనా సుప్రీంకోర్టు ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ సందర్భంగా చట్టబద్ధ విధులను ఉల్లంఘించారనే ఆరోపణలపై సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఈ పిటిషన్‌లో కోరారు. సీఐఆర్ ప్రక్రియలో కోట్లాది మంది ఓటర్ల పేర్లు తొలగించారనే ఆరోపణలపై న్యాయ విచారణ లేదా ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని కూడా పిటిషనర్ కోరారు.
సమష్టి నిర్ణయం లేకపోతే చెల్లుబాటు కాకూడదు
ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో తీసుకున్న నిర్ణయాలు, మార్గదర్శకాలు, సాఫ్ట్‌వేర్ మార్పులు ఇతర ఇద్దరు ఎన్నికల కమిషనర్ల సమ్మతి లేకుండా జరిగితే అవి రాజ్యాంగ విరుద్ధమైనవిగా, చెల్లుబాటు కానివిగా ప్రకటించాలని పిటిషనర్లు కోరుతున్నారు. అలాగే సీఈసీ ఏ అధికారంతో వ్యక్తిగతంగా ఎన్నికల సంఘం సమష్టి నిర్ణయాధికారాన్ని వినియోగిస్తున్నారో వివరించాలని కోర్టు ఆదేశించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సంఘం అసలు రికార్డులను కోర్టు ముందుంచాలని, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో స్వతంత్ర న్యాయ విచారణ కమిషన్ లేదా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని కూడా కోరారు.
ఎన్నికల సంఘం గతంలో ఈ వివాదంపై స్పందిస్తూ, సంస్థలో నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో భిన్నాభిప్రాయాలు, పరిశీలనలు సహజమేనని తెలిపింది. గత ఏడాది తీసుకున్న నిర్ణయాలన్నీ ఏకగ్రీవంగానే ఉన్నాయని పేర్కొంది. మరోవైపు, ఇద్దరు ఎన్నికల కమిషనర్లు ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన అంశాలపై కనీసం 14 సందర్భాల్లో అభ్యంతరాలు నమోదు చేశారంటూ వచ్చిన నివేదికలతో ఈ వివాదం కొనసాగుతోంది.
