డొమినోస్ పిజ్జా అవుట్‌లెట్లపై మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) చర్యలు చేపట్టింది. ఆహార భద్రత, పరిశుభ్రత నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు రావడంతో రాష్ట్రంలోని డొమినోస్ పిజ్జాకు చెందిన నాలుగు అవుట్‌లెట్ల ఫుడ్ బిజినెస్ లైసెన్సులను సస్పెండ్ చేసినట్లు FDA అధికారులు బుధవారం వెల్లడించారు. వీటిలో మూడు ముంబైలో ఉండగా, మరో అవుట్‌లెట్ సతారా జిల్లాలో ఉంది. FDA కమిషనర్ టుకారామ్ ముండే ఆధ్వర్యంలో చైన్ రెస్టారెంట్లపై చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో ఈ చర్యలు తీసుకున్నారు.
ముంబైలో విలే పార్లే వెస్ట్, బోరివలి వెస్ట్, ఘట్‌కోపర్ వెస్ట్‌లోని ఆర్-సిటీ మాల్‌లో ఉన్న జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ నిర్వహిస్తున్న డొమినోస్ అవుట్‌లెట్లను అధికారులు తనిఖీ చేశారు. విలే పార్లే అవుట్‌లెట్‌లో FSSAI లైసెన్స్ ప్రదర్శన, తాగునీరు, ఆహార నిల్వ, పురుగుల నియంత్రణ, పరిశుభ్రతకు సంబంధించిన పలు లోపాలను గుర్తించారు. ఫ్రోజన్ ఫుడ్‌కు సరైన ఉష్ణోగ్రత పర్యవేక్షణ, ఆహార మరియు ఇతర వస్తువులను వేర్వేరుగా నిల్వ చేయడం, ఎలుకలు, ఇతర పురుగుల నివారణ, చేతులు కడుక్కునేందుకు తగిన సౌకర్యాలు కల్పించాలని అధికారులు ఆదేశించారు.
బోరివలి వెస్ట్‌లోని డొమినోస్ అవుట్‌లెట్‌లో సుమారు 15 శాతం నిబంధనల ఉల్లంఘనలు గుర్తించినట్లు FDA తెలిపింది. ఆహార నిల్వ, ఉష్ణోగ్రత నియంత్రణ, ఆహార పరీక్షలు, పరిశుభ్రత, పెస్ట్ కంట్రోల్‌కు సంబంధించి తక్షణమే సరిదిద్దే చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ముడి, వండిన ఆహార పదార్థాలను, అలాగే శాకాహార, మాంసాహార ఆహారాలను వేర్వేరుగా ఉంచాలని సూచించింది. పరికరాలు, పాత్రలను క్రమం తప్పకుండా శానిటైజ్ చేయాలని స్పష్టం చేసింది.
ఘట్‌కోపర్ వెస్ట్‌లోని ఆర్-సిటీ మాల్ డొమినోస్ అవుట్‌లెట్‌లోనూ పరిశుభ్రత, శానిటేషన్ షెడ్యూల్, పెస్ట్ కంట్రోల్‌లో లోపాలను అధికారులు గుర్తించారు. ఆహార పదార్థాల నిల్వలో FIFO అంటే ముందుగా వచ్చిన వస్తువును ముందుగా వినియోగించే విధానం, FEFO అంటే ముందుగా గడువు ముగిసే వస్తువును ముందుగా వినియోగించే విధానాన్ని పాటించలేదని FDA పేర్కొంది. ఆహార నిల్వలో సరైన ఉష్ణోగ్రత నియంత్రణ కూడా లేదని తెలిపింది. ఫుడ్ గ్రేడ్ సర్టిఫికెట్లు, పరికరాల క్యాలిబ్రేషన్, ప్రివెంటివ్ మెయింటెనెన్స్, ఆహారం, నీటి పరీక్షలకు సంబంధించిన రికార్డులు కూడా అందుబాటులో లేవని అధికారులు గుర్తించారు.
సతారా జిల్లాలోని మల్కాపూర్‌లో జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ నిర్వహిస్తున్న మరో డొమినోస్ అవుట్‌లెట్ లైసెన్స్‌ను కూడా FDA సస్పెండ్ చేసింది. అక్కడ సుమారు 40 శాతం నిబంధనల ఉల్లంఘనలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రాథమిక సౌకర్యాలు, పరికరాలు, పరిశుభ్రత, పెస్ట్ కంట్రోల్‌కు సంబంధించిన లోపాలను గుర్తించారు. ఇదే జిల్లాలో కరాడ్ ప్రాంతంలో సఫైర్ ఫుడ్స్ ఇండియా నిర్వహిస్తున్న మరో రెండు ఫాస్ట్‌ఫుడ్ కేంద్రాలపైనా చర్యలు తీసుకున్నారు. పిజ్జా తయారీ సమయంలో శాకాహార, మాంసాహార పిజ్జాలకు వేర్వేరు ఓవెన్లు, ప్యాన్లు ఉపయోగించాలని, సాస్‌లు, పిజ్జా టాపింగ్స్‌పై ప్యాకింగ్, గడువు తేదీలను సక్రమంగా లేబుల్ చేయాలని ఆదేశించారు.
విదర్భ ప్రాంతంలోని అకోలా జిల్లాలో సఫైర్ ఫుడ్స్ ఇండియా నిర్వహిస్తున్న మరో అవుట్‌లెట్‌పైనా FDA చర్యలు తీసుకుంది. అక్కడ ఫ్రోజన్ పనీర్, నాణ్యత లేని ఆహార పదార్థాలను ఉపయోగించినట్లు అధికారులు ఆరోపించారు.
మహారాష్ట్రవ్యాప్తంగా ఫాస్ట్‌ఫుడ్ చైన్ రెస్టారెంట్లపై నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో మొత్తం 104 సంస్థలను FDA పరిశీలించింది. వాటిలో రెండు సంస్థలు వెంటనే వ్యాపార కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశించగా, 95 సంస్థలకు మెరుగుదల నోటీసులు జారీ చేశారు. ఐదు సంస్థల ఫుడ్ బిజినెస్ లైసెన్సులను సస్పెండ్ చేసినట్లు FDA తెలిపింది. డొమినోస్ పిజ్జాతో పాటు KFC, పిజ్జా హట్, మెక్‌డొనాల్డ్స్, సబ్‌వే, బర్గర్ కింగ్, స్టార్‌బక్స్, మోంగినిస్ వంటి ప్రముఖ బ్రాండ్ల అవుట్‌లెట్లను కూడా ఈ తనిఖీల పరిధిలోకి తీసుకొచ్చారు.
నాసిక్ జిల్లాలోనూ ఐదు ఆహార సంస్థల లైసెన్సులను FDA సస్పెండ్ చేసింది. సత్పూర్‌లోని హోటల్ సయాలి రెస్టారెంట్ అండ్ బార్, కాలేజ్ రోడ్‌లోని హోటల్ ఛోటే మియా, పంచవటిలోని పేత్ రోడ్‌లోని మణి మార్క్, సిడ్కోలోని అభిషేక్ బేకరీ అండ్ స్వీట్స్, దిండోరిలోని మోహన్‌లాల్ నమ్కీన్‌లపై చర్యలు తీసుకున్నారు. పరిశుభ్రత, ఆహార నిల్వ, నీరు, పరికరాలు, పెస్ట్ కంట్రోల్ వంటి అంశాల్లో లోపాలను గుర్తించినట్లు FDA పేర్కొంది.
ముంబైలో ములుండ్‌లోని ముంబై మెట్రో ధాబా, భాండుప్‌లోని గుల్షన్-ద-పంజాబీ ధాబా లైసెన్సులను కూడా FDA సస్పెండ్ చేసింది. తనిఖీల్లో ప్రాథమిక సౌకర్యాలు, పరిశుభ్రత, నీరు, వెంటిలేషన్, పెస్ట్ కంట్రోల్, ఆహార నిల్వకు సంబంధించిన లోపాలు బయటపడినట్లు అధికారులు తెలిపారు.
మొత్తంగా మహారాష్ట్రలోని 104 ఫాస్ట్‌ఫుడ్ చైన్ అవుట్‌లెట్లను తనిఖీ చేసిన FDA రెండు సంస్థలను తక్షణమే మూసివేయాలని ఆదేశించింది, ఐదు సంస్థల లైసెన్సులను సస్పెండ్ చేసింది. మరో 95 సంస్థలకు మెరుగుదల నోటీసులు జారీ చేసింది. దీనికి అదనంగా గత కొన్ని రోజులుగా మరో 120 హోటలింగ్ సంస్థలను తనిఖీ చేసి 54 మెరుగుదల నోటీసులు జారీ చేయడంతో పాటు 11 ఫుడ్ బిజినెస్ లైసెన్సులను సస్పెండ్ చేసినట్లు తెలిపింది.
