కృష్ణహోమ్

ప్ర‌జారోగ్యానికి స‌వాలుగా మారిన ఊబ‌కాయం

#SatyakumarYadav

తీవ్ర స్థాయిలో ఉన్న ఊబకాయ సమస్య రాష్ట్ర ప్రజారోగ్యానికి సవాల్ విసురుతోoదని  వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. తీవ్ర రూపం దాలుస్తోన్న ఊబకాయ సమస్యను ఎదుర్కొనేందుకు జాయింట్‌ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తామని తెలిపారు.

ఆరోగ్య శాఖతోపాటు విద్య, క్రీడలు, మహిళా శిశు సంక్షేమం తదితర శాఖలను ఇందులో భాగస్వామ్యం చేస్తామని చెప్పారు. విజయవాడలో గురువారం కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ (సీఐఐ) ఆధ్వర్యంలో ఊబకాయం, జీవక్రియ ఆరోగ్యంపై నిర్వహించిన రాష్ట్రస్థాయి బహుళరంగ భాగస్వామ్యుల సదస్సులో మంత్రి మాట్లాడారు.

జీవనశైలిలో వస్తోన్న మార్పుల కారణంగా ఊబకాయం ప్రధాన ప్రజారోగ్య సవాల్‌గా మారుతోందని మంత్రి సత్యకుమార్‌ పేర్కొన్నారు. సంపద పెరుగుతున్న వేగం కంటే ఊబకాయం విస్తరిస్తున్న వేగం ఎక్కువగా ఉందన్నారు. పరిశ్రమల అభివృద్ధి, ఆర్థిక ప్రగతితో జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నప్పటికీ.. మారుతున్న ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ తగ్గడం వంటి కారణాలతో ఊబకాయం సమస్య తీవ్రతరమవుతోందని చెప్పారు. దీనిని నిర్లక్ష్యం చేస్తే ప్రజల ఆరోగ్యంతోపాటు ఉత్పాదకత, ఆర్థిక ప్రగతిపైనా ప్రభావం పడుతుందని వివరించారు.

పెరుగుతున్న స్థూలకాయులు

ప్ర‌పంచ వ్యాప్తంగా అధిక బ‌రువు ఉన్న వారి సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంద‌ని, 2010 నుంచి 2030 మ‌ధ్య వీరి సంఖ్య 115 శాతం పెరిగి సుమారు 200 కోట్ల‌కు చేరుతుంద‌న్న అంచ‌నాలున్నాయ‌న్నారు. ఊబ‌కాయంతో బాధ‌ప‌డే చిన్నారుల సంఖ్య నాలుగు రెట్లు పెరిగే అవ‌కాశం ఆందోళ‌న క‌లిగిస్తోంద‌న్నారు. జాతీయ ఆరోగ్య కుటుంబ స‌ర్వే-5 ప్ర‌కారం దేశంలో 24 శాతం మ‌హిళ‌లు, 23 శాతం పురుషులు అధిక బ‌రువుతో ఉన్నార‌ని చెప్పారు. స‌ర్వే-6 ప్ర‌కారం మ‌హిళ‌ల్లో 30.70 శాతం, పురుషుల్లో 27.30 శాతం న‌మోదైంద‌ని వివ‌రించారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఊబకాయ పరిస్థితి   మ‌రింత ఆందోళనకరంగా ఉందని మంత్రి తెలిపారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-6 ప్రకారం రాష్ట్రంలో 47.90 శాతం మహిళలు, 44.40 శాతం పురుషులు అధిక బరువుతో ఉన్నారని చెప్పారు. అంటే రాష్ట్రంలో దాదాపు ప్రతి ఇద్దరిలో ఒకరు అధిక బరువుతో ఉన్నట్లేనని వివరించారు.

అధిక బరువు, ఊబకాయానికి జీవనశైలిలో మార్పులు, శారీరక కదలికలు తగ్గడం, అధిక ఆహారం, అల్ట్రా ప్రాసెస్డ్‌ ఆహార పదార్థాల వినియోగం, చక్కెర పానీయాలు, పని ఒత్తిడి, ఎక్కువ సమయం మొబైల్ బైల్ స్క్రీన్‌ల‌ ముందు గడపడం వంటి అంశాలు కారణమవుతున్నాయని పేర్కొన్నారు. పిల్లల్లో బహిరంగ క్రీడలు, శారీరక కార్యకలాపాలు తగ్గడం కూడా సమస్యను పెంచుతోందన్నారు.

శాఖల మధ్య సమన్వయంతో కార్యాచరణ

సీఐఐ సదస్సులో జరిగిన చర్చలు, వచ్చిన సూచనల ఆధారంగా ఊబకాయ నియంత్రణకు అవసరమైన చర్యలపై కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని మంత్రి తెలిపారు. ఇందుకోసం జాయింట్ టాస్క్ ఫోర్స్‌ ఏర్పాటు చేస్తామన్నారు. ఆరోగ్య శాఖతోపాటు విద్య, క్రీడలు, మహిళా శిశు సంక్షేమం తదితర శాఖలను భాగస్వామ్యం చేయడం ద్వారా సమస్యను సమగ్రంగా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఊబకాయాన్ని ఒక్క ఆరోగ్య శాఖకు మాత్రమే సంబంధించిన సమస్యగా చూడకూడదన్నారు

నాణ్యమైన ఆహారంపై దృష్టి

వైద్య, ఆరోగ్య శాఖలో అంతర్భాగంగా ఉన్న ఫుడ్‌ సేఫ్టీ శాఖ‌ను  బలోపేతం చేస్తున్నామని మంత్రి సత్యకుమార్‌ తెలిపారు. ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాలు అందేలా ఈ శాఖ‌ ద్వారా చర్యలు తీసుకుంటామన్నారు. ఆహార నాణ్యత, ప్రజల ఆరోగ్యం మధ్య ఉన్న సంబంధాన్ని దృష్టిలో ఉంచుకుని అవసరమైన చర్యలు కొనసాగిస్తామని మంత్రి పేర్కొన్నారు.

సీఎంకు ప్రతిపాదనలు

సీఐఐ సదస్సులో ఊబకాయ సమస్య తీవ్రత, నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై వచ్చిన ప్రతిపాదనలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అందజేస్తామని మంత్రి వెల్లడించారు. వాటిపై ముఖ్యమంత్రి ఇచ్చే కీలక సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. వ్యాధులు వచ్చిన తర్వాత చికిత్స చేయడం కంటే ముందుగానే గుర్తించి నివారించడంపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు.

పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం (ఆర్‌బీఎస్‌కే) ద్వారా పిల్లల ఎత్తు, బరువును నమోదు చేస్తున్నామని మంత్రి చెప్పారు. పిల్లల్లో జీవక్రియ సంబంధిత సమస్యలను కూడా ముందుగానే గుర్తించేలా ఈ కార్యక్రమం ద్వారా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నామన్నారు. చిన్న వయసులోనే ఆరోగ్య సమస్యలను గుర్తిస్తే అవసరమైన జాగ్రత్తలు, చికిత్సా చర్యలు చేపట్టేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.

59 లక్షల మందికి బీపీ

రాష్ట్రంలో అసాంక్రమిక వ్యాధుల (ఎన్‌సిడి) పరిస్థితిపై ఇప్పటికే జిల్లాల వారీగా మ్యాపింగ్‌ చేపట్టామని మంత్రి సత్యకుమార్‌ తెలిపారు. ఇప్పటివరకు నిర్వహించిన ఎన్‌సీడీ సర్వేలో రాష్ట్ర జనాభాలో 59 లక్షల మందికి రక్తపోటు, 48 లక్షల మందికి మధుమేహం ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. ఊబకాయం, జీవక్రియ సమస్యలు, అసాంక్రమిక వ్యాధుల మధ్య సంబంధాన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తు గుర్తింపు, నివారణ చర్యలకు ప్రాధాన్యత‌నిస్తున్నామని తెలిపారు.

41 రకాల పరీక్షలు ఉచితం

యూనివర్సల్‌ హెల్త్‌ స్క్రీనింగ్‌ కార్యక్రమం కింద మొబైల్‌ మెడికల్‌ యూనిట్ల ద్వారా 41 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నామని మంత్రి సత్యకుమార్‌ తెలిపారు. కుప్పంలో ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నట్లు చెప్పారు. సంజీవని పథకం ద్వారా ఆరోగ్య సమస్యలున్నవారిని గుర్తించి ఆసుపత్రులకు వెళ్లి చికిత్స పొందేలా అపాయింట్‌మెంట్లు ఇప్పిస్తున్నామని, వారి ఆరోగ్య వివరాలను డిజిటలైజ్‌ చేస్తున్నామని వివరించారు.

రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ చక్రధర్ బాబు మాట్లాడుతూ “సాంకేతికత పెరగడం, జీవన విధానంలో మార్పులు ఊబకాయం పెరగడానికి ప్రధాన కారణాలుగా మారాయి. ఆటలు, క్రీడలకు బదులుగా వినోదం స్క్రీన్‌ల వైపు మళ్లింది. పని విధానాలు కూడా ఎక్కువగా డెస్క్‌ ఆధారితంగా మారడంతో అన్ని వయసుల వారిలో శారీరక శ్రమ గణనీయంగా తగ్గింది. మన పూర్వీకుల జీవన విధానంలోని మంచి అలవాట్లకు తిరిగి వెళ్లాల్సిన అవసరం ఉంది. పరిమితంగా ఆహారం తీసుకోవడం, ఇంటి పనులు సహా సాధ్యమైనంత ఎక్కువ శారీరక శ్రమ చేయడం,  సహజ ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వడం, నూనె, ఉప్పు, చక్కెర వినియోగాన్ని తగ్గించడం అవసరం.

ఈ సవాలును ఎదుర్కొనేందుకు వైద్య ఆరోగ్యశాఖ పూర్తిగా కట్టుబడి ఉంది. సమగ్ర పరీక్షలు, ముందస్తు గుర్తింపుపై దృష్టి సారిస్తూ చికిత్స నుంచి నివారణ వైపు, అనారోగ్యం నుంచి సంపూర్ణ ఆరోగ్యం వైపు దృష్టిని మళ్లిస్తున్నాం. CII నుంచి వచ్చే సమగ్ర సిఫార్సుల కోసం ఎదురుచూస్తున్నాం. వాటిని పరిశీలించి, అమలుకు అవసరమైన చర్యలు చేపడతాం” అని చక్రధర్ బాబు పేర్కొన్నారు

సీఐఐ రాష్ట్ర ఛైర్మన్‌ నరేంద్రకుమార్‌, మాజీ ఛైర్మన్‌ డాక్టర్‌ వి.మురళీకృష్ణ, ప్రిన్సిపల్‌ అడ్వైజర్‌ (హెల్త్‌కేర్‌) డాక్టర్‌ షుబ్నుమ్‌ సింగ్‌ మాట్లాడుతూ.. సీఐఐ ఆర్థిక వ్యవహారాలకే పరిమితం కాకుండా సామాజిక, ఆరోగ్య రంగాల అభివృద్ధికి కూడా కృషి చేస్తోందన్నారు. ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న ఊబకాయ సమస్య తీవ్రతను గుర్తించి రాష్ట్రాల వారీగా అభిప్రాయాలు సేకరిస్తున్నామని తెలిపారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాల్సిన చర్యలపై సీఐఐ తరఫున ప్రతిపాదనలు అందిస్తామని చెప్పారు.

ఈ స‌ద‌స్సులో వైద్య‌, ఆరోగ్య శాఖ జాతీయ ఆరోగ్య మిష‌న్ అధికారులు, బోధానాసుప‌త్రుల వైద్యులు, వివిధ రంగాల‌కు చెందిన నిపుణులు పాల్గొని ఊబ‌కాయం ప‌రిష్కార చ‌ర్య‌ల‌పై అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేశారు

Related posts

హవాలా మార్గంలో ‘కల్తీ నెయ్యి’ సొమ్ము

Satyam News

తెలంగాణలో 40 డిగ్రీలు దాటిన ఎండ

Satyam News

లైంగిక దాడి చేసిన ఆటో డ్రైవర్ కు 20 ఏళ్ల జైలు

Satyam News

జగన్ ఒక్కరోజు ఫ్లయిట్ ఖర్చుతో.. మనం ఎన్నేళ్లు బతకొచ్చో తెలుసా…!!

Satyam News

నారా లోకేష్ ప్రత్యేకత…. పాజిటివ్ పాలిటిక్స్!

Satyam News

తెహల్కా తరుణ్ తేజ్‌పాల్‌కు బాంబే హైకోర్టు షాక్

Satyam News

Leave a Comment