తిరుమల కల్తీ నెయ్యి కుంభకోణంలో కోట్లాది రూపాయల హవాలా వ్యవహారం కూడా జరిగింది. కల్తీ నెయ్యిలో జంతు కొవ్వు ఉందా లేదా అనే వరకే చర్చలు ఆగిపోతున్నాయి కానీ అంతకు మించిన కుంభకోణం ఇది అని వేరే చెప్పాల్సిన అవసరం లేదు.
పాలే లేకుండా నెయ్యి తయారుచేసి దాదాపు రూ.250 కోట్ల విలువైన 60 లక్షల కిలోలు సరఫరా చేసిన ఈ కుట్రలో విస్తుపోయే నిజాలు వెల్లడవుతున్నాయి. తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలో కల్తీ నెయ్యి కుట్రలో హవాలా రాకెట్ బట్టబయలైంది. కల్తీ చేసిన నెయ్యిని టీటీడీకి అంటగట్టడంలో జరిగిన అక్రమాలను సీబీఐ సిట్ నిగ్గు తేల్చింది.
కల్తీ నెయ్యిని సరఫరా చేయాలన్న ముందస్తు కుట్రను అమలు చేసి తద్వారా వచ్చిన సొమ్మును హవాలా మార్గంలో పంచుకున్నారు. ఢిల్లీ, విజయవాడ మీదుగా తిరుపతికి సాగిన హవాలా మార్గంలో తిరుపతిలోని మంగళం వద్ద ఉన్న ఓ ఇంటికి 20 కోట్ల సొమ్ము చేరింది.
అతి స్వల్ప మొత్తం టీటీడీ డెయిరీ నిపుణుడు విజయభాస్కర్‌రెడ్డికి, మరికొంత కమిషన్ ఏజెంటు శ్రీనివాసన్‌కు వెళ్లింది. నికరంగా 19.86 కోట్ల రూపాయలు వైష్ణవి డెయిరీ సీఈఓ అపూర్వ చావ్డాకు చేరినట్లు నిర్ధారణ అయింది. ఆ తర్వాత అక్కడి నుంచి డబ్బు ఎక్కడికి వెళ్లిందన్నది మాత్రం మిస్టరీ గానే మిగిలిపోయింది. అంతిమ లబ్ధిదారుడు ఎవరన్నది సిట్ కనిపెట్టలేకపోయింది.
భోలే బాబా డెయిరీకి కాంట్రాక్టు రావడమే పెద్ద కుట్ర
భోలే బాబా డెయిరీ తిరుమలకు స్వచ్ఛమైన ఆవుపాల నెయ్యి సరఫరా చేస్తామని టెండర్ దక్కించుకోవడమే ఓ పెద్ద కుట్ర. ఈ కుట్రను అమలు చేయడంలో, హవాలా రాకెట్‌లో భోలేబాబా నిర్వాహకులు పొమిల్ జైన్(ఏ3), విపిన్ జైన్ (ఏ4)లు ఎవరెవరిని భాగస్వాములు చేశారు?
కల్తీకి అవసరమైన రసాయనాలు, ఇతర నూనెలను ఎక్కడెక్కడ కొన్నారు? ఎక్కడెక్కడ దొంగ బిల్లులు సృష్టించారు? నెయ్యి సరఫరా కాంట్రాక్టులో డబ్బులు ఏయే మార్గాల్లో తిరుపతిలోని అపూర్వ చావ్డాకు చేరాయి? అన్నదే హవాలా రాకెట్‌లోని అసలు గుట్టు.
హవాలా రాకెట్‌ను భోలే బాబా నిర్వాహకులైన పొమిల్‌జైన్, విపిన్‌జైన్‌లు ముందుండి నడిపారు. ఇందులో ఆశీష్ అగర్వాల్ అనే వ్యక్తి (ఏ15) కీలకం. ఆయన ఓ హవాలా ఏజెంటు. పాత ఢిల్లీలో చాందినీ చౌక్‌లోని కుచా గచీరామ్‌లో ఆయనకు ఓ హవాలా దుకాణం(షాప్ నంబరు 304) ఉంది. భోలే బాబా నిర్వాహకులు నెయ్యిని ఆశీష్ అగర్వాల్ నుంచి కొన్నట్లుగా తప్పుడు పత్రాలు సృష్టించారు.
భోలా బాబా బ్యాంకు ఖాతాల నుంచి ఆశీష్ అగర్వాల్‌కు నగదు చె ల్లింపులు జరిగాయి. తనకొచ్చిన డబ్బును ఆయన బ్యాంకుల నుంచి విత్‌డ్రా చేసి హవాలా మార్గంలో వ్యవహారం నడిపించారు. ఆ డబ్బును తొలుత రాధేశ్యామ్ ఓజా నడిపిస్తున్న హవాలా దుకాణం (నంబరు 287)కు చేర్చారు. ఆ తర్వాత డబ్బును అదే ప్రాంతంలో ఉన్న మరో హవాలా దుకాణం (షాప్ నంబరు 18బీ)కి చేర్చారు.
ఇది రిషబ్‌జైన్ అనే వ్యాపారిది. ఇక్కడి నుంచి డబ్బును గ్వాలియర్‌కు చెందిన దీపక్‌జైన్‌కు చేర్చారు. ఆయనకు డబ్బు చేర్చడం వెనుక ఓ కారణం ఉంది. భోలే బాబా డెయిరీ కల్తీ నెయ్యి తయారీకి ముందు రిఫైన్డ్ ఫామ్‌కెర్నెల్ ఆయిల్, పామోలిన్‌లు సమకూర్చుకున్నది. వీటిని దీపక్ జైన్‌కు డైవర్ట్ చేశారు.
అయితే భోలే బాబాకే చెందిన కంపెనీలు హార్ష్ ట్రేడింగ్ కో, హార్ష్ ఫ్రెష్ డెయిరీ ఫుడ్జ్ నుంచి దీపక్‌జైన్ వాటిని కొనుగోలు చేసినట్లుగా తప్పుడు బిల్లులు సృష్టించారు. అందుకే దీపక్‌జైన్ తనకు హవాలా మార్గంలో చేరిన డబ్బును తిరిగి వైట్‌గా మార్చి భోలే బాబాకు బిల్లుల చెల్లింపు పేరిట అధికారికంగా బ్యాంకు ఖాతాల ద్వారా పంపించారు.
2024 జనవరి, ఫిబ్రవరి, మార్చి, జూన్, జూలై నెలల్లో కలిపి మొత్తం 12.55 కోట్ల రూపాయలను అపూర్వ చావ్డా తీసుకున్నారు. పటేల్ లాలా భాయ్‌కు చెందిన మరో ఏజెంటు మదరమ్ దేవాసి (చెన్నై) నుంచి 2023- 24 సంవత్సరాల్లో చావ్డా 7.31 కోట్ల రూపాయలను హవాలా మార్గంలో తీసుకున్నారు.
హవాలా ఏజెంట్లదే ఇందులో కీలక పాత్ర
చావ్డాకు మొత్తం 19.86 కోట్ల రూపాయలు చేరింది. కొన్ని సందర్భాల్లో ఆయనే నేరుగా హవాలా ఏజెంట్ల వద్దకు వెళ్లి డబ్బు తీసుకోగా, మరికొన్ని సార్లు హవాలా ఏజెంట్లు తిరుపతిలోని ఆయన ఇంటి కి డబ్బు చేర్చారు. హవాలా డబ్బు అందుకున్న వారిలో నాటి టీటీడీ డెయిరీ నిపుణుడు మద్ది విజయభాస్కర్‌రెడ్డి కూడా ఉన్నారు. ఈయన వై వీ సుబ్బారెడ్డికి బంధువు అని చెబుతున్నారు.
హైదరాబాద్‌లోని హవాలా ఏజెంటు అర్జున్ గోస్వామి ద్వారా భోలే బాబా నిర్వాహకులు విజయభాస్కర్‌రెడ్డికి 75 లక్షల రూపాయలు పంపించారు. మూడు దఫాలుగా ఈ నగదు చేరింది. వైష్ణవీ డెయిరీ ద్వారా టీటీడీకి కల్తీనెయ్యి సరఫరా అయ్యేలా సహకరించినందుకు ఇచ్చారు.
సిట్ విచారణ మొదలయ్యాక ఈ విషయం గుర్తించి, తనిఖీల సందర్భంగా 34 లక్షల నగదును సిట్ సీజ్ చేసింది. కమిషన్ ఏజెంట్ ద్వారా మేనేజ్‌మెంట్ శ్రీనివాసన్ అనే కమిషన్ ఏజెంటుకు కూడా భోలే బాబా డెయిరీ నుంచి 31.40 లక్షల నగదు అందింది. చె న్నైలో ఉండే మదరమ్ దేవాసి అనే హవాలా ఏజెంటు ద్వారా ఆయనకు ఈ డబ్బు చేరింది.
ఈ డబ్బును శ్రీనివాసన్‌తో పాటు కల్తీనెయ్యికి అన్ని విధాలుగా సహకరించిన టీటీడీలోని అధికారులు, ఉద్యోగులకు ఇవ్వాలని భోలే బాబా నిర్వాహకులు పంపించారు. ఈ విషయాలన్నీ సుప్రీంకోర్టు నియమించిన సీబీఐ సిట్ తన చార్జిషీట్ లో పేర్కొన్నది.
