తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకుని శుక్రవారం శ్రావణ ఉపకర్మ వేడుకలు భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్లవారుజామున 4 గంటలకు స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి, తోమాల సేవ, సహస్రనామార్చన నిర్వహించారు.
అనంతరం ఉదయం 6.30 గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ కృష్ణస్వామివారిని మంగళ వాయిద్యాల నడుమ కపిలతీర్థంలోని ఆళ్వార్ తీర్థానికి ఊరేగింపుగా తీసుకువచ్చారు. అక్కడ స్నపన తిరుమంజనం, ఆస్థానం శాస్త్రోక్తంగా నిర్వహించిన అనంతరం స్వామివారిని ఆలయానికి వైభవంగా తీసుకువచ్చారు.
సాయంత్రం 4.30 నుంచి 6.30 గంటల వరకు శ్రీ భూసమేత శ్రీ గోవిందరాజస్వామివారిని ఆర్.ఎస్. మాడ వీధిలోని శ్రీ వైఖానసాచార్యుల ఆలయానికి ఊరేగింపుగా తీసుకువెళ్లి ఆస్థానం నిర్వహించారు. అనంతరం స్వామివారు తిరిగి ఆలయానికి చేరుకున్నారు.
శ్రావణ పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన ఈ పవిత్ర ఉపకర్మలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి దివ్యదర్శనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో వి.ఆర్. శాంతి, ఏఈవో ఏ.బి. నారాయణ చౌదరి, సూపరింటెండెంట్ చిరంజీవి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ ధనుంజయ, ఆలయ అర్చకులు, సిబ్బంది, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
