విశాఖపట్నంహోమ్

నవ్యాంధ్రలో తొలిసారిగా 41వ ‘ఐఏటీఓ’ జాతీయ సదస్సు

#KandulaDurgesh

ఆంధ్రప్రదేశ్ లో బాధ్యతాయుతమైన, పర్యావరణహిత పర్యాటకరంగాన్ని అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి  కందుల దుర్గేష్ వెల్లడించారు.  ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల నాయకత్వంలో, కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో రాష్ట్రంలో పర్యాటక విప్లవం ఆవిష్కృతమవుతోందని ఆయన స్పష్టం చేశారు.

విశాఖపట్నంలోని నోవాటెల్ హోటల్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో, ఈ నెల 10 నుండి 12 వరకు విశాఖ వేదికగా జరగనున్న 41వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ (IATO) జాతీయ సదస్సు వివరాలను మంత్రి దుర్గేష్ మీడియాకు వెల్లడించారు.సెప్టెంబర్ 13న ఐఏటీఓ సభ్యుల కోసం ఏపీలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో 6 ప్రత్యేక ‘పోస్ట్ కన్వెన్షన్’ టూర్లు ఏర్పాటు చేశామన్నారు.

నవ్యాంధ్రలో తొలిసారిగా ప్రతిష్టాత్మక ‘ఐఏటీఓ’ జాతీయ సదస్సు

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ భారతదేశంలో ఇన్-బౌండ్ టూరిజం అభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ (IATO) ప్రతిష్టాత్మక 41వ జాతీయ సదస్సును ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం వేదికగా ఈ నెల 10 నుండి 12వ తేదీ వరకు ఘనంగా నిర్వహిస్తోందని మంత్రి దుర్గేష్ వెల్లడించారు.

“ఇండియా – ది వరల్డ్స్ నెక్స్ట్ టూరిజం ఆపర్చునిటీ” అనే ముఖ్య థీమ్ తో జరుగుతున్న ఈ సదస్సులో దేశవ్యాప్తంగా 1,000 మందికి పైగా పర్యాటక రంగ ప్రతినిధులు, ప్రముఖ టూర్ ఆపరేటర్లు, విధాన నిర్ణేతలు మరియు పారిశ్రామికవేత్తలు పాల్గొంటున్నారని పేర్కొన్నారు.దేశవ్యాప్తంగా 2,068 కంటే ఎక్కువ మంది ప్రతినిధులతో ఇన్-బౌండ్ టూరిజంలో అగ్రగామిగా ఉన్న ఐఏటీఓ (IATO) జాతీయ సదస్సుకు విశాఖపట్నం ఆతిథ్యం ఇవ్వడం గర్వకారణమని మంత్రి దుర్గేష్ తెలిపారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒకసారి జరిగిన ఈ సదస్సు, నవ్యాంధ్రప్రదేశ్ ఆవిర్భావం తర్వాత జరగడం ఇదే తొలిసారి అని తెలిపారు.ఈ వేదిక ఏపీ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడానికి దోహదపడుతుందన్నారు. రేపు (గురువారం) సాయంత్రం జరిగే ఐఏటీఓ జాతీయ సదస్సు ప్రారంభ కార్యక్రమానికి  కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని తెలిపారు.

అదే విధంగా కేంద్ర పర్యాటక శాఖ కార్యదర్శి  భువనేష్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు మరియు పర్యాటక రంగ ప్రముఖులు హాజరుకానున్నారన్నారు. ఈ సదస్సు ద్వారా ఆంధ్రప్రదేశ్ 1000కి.మీలకు పైబడిన సుదీర్ఘ సముద్ర తీరం, ఆధ్యాత్మిక ప్రాశస్త్యం, అరకు లోయ, గిరిజన సంస్కృతి, బౌద్ధ క్షేత్రాలు మరియు సహజ సౌందర్యాన్ని అంతర్జాతీయ పర్యాటక పటంలో నిలపడానికి వేదిక సుగమమైందన్నారు.

తిరుపతి, శ్రీశైలం నుండి అరకు, అమరావతి వరకు విస్తరించి ఉన్న విశిష్టమైన పర్యాటకాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు ఏపీ ప్రభుత్వం సుముఖంగా ఉందన్నారు. అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించడంలో ఐఏటీఓ ప్రతినిధులు కీలక వారధిగా వ్యవహరిస్తారని, వారితో భాగస్వామ్యం కావడం ద్వారా ఏపీలో ఉపాధి, పెట్టుబడులు మరింత పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

స్థానిక పర్యాటక భాగస్వాములకు భారీ రాయితీలు

రాష్ట్రంలోని టూర్ ఆపరేటర్లు, హోటళ్ళు, పర్యాటక భాగస్వాములను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుందని మంత్రి దుర్గేష్ తెలిపారు.

వన్-టైమ్ అడ్మిషన్ ఫీజు రద్దు-సదస్సు రిజిస్ట్రేషన్ ఫీజు తగ్గింపు:

ఐఏటీఓ సభ్యత్వానికి సాధారణంగా చెల్లించాల్సిన రూ. 10,000 (+GST) ప్రవేశ రుసుమును ఏపీ భాగస్వాములకు పూర్తిగా రద్దు చేశామన్నారు. ఈ వెసులుబాటు 2026 డిసెంబర్ 31 వరకు వర్తిస్తుందని పేర్కొన్నారు. ఇతరులకు రూ. 8,500 వరకు ఉండే రిజిస్ట్రేషన్ ఫీజును ఏపీ ప్రతినిధులకు కేవలం రూ. 3,000 గా నిర్ణయించామన్నారు. అర్హులైన స్థానిక ప్రతినిధులు ఐఏటీఓ అధికారిక పోర్టల్ ([https://iato.in/Register/form](https://iato.in/Register/form)) ద్వారా ఉచితంగా సభ్యత్వం పొంది, అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి దుర్గేష్ పిలుపునిచ్చారు.

రూ. 20,000 కోట్ల పెట్టుబడులు – పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా

గత రెండేళ్ల కాలంలో పర్యాటక రంగంలో రూ. 20,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించామని మంత్రి దుర్గేష్ తెలిపారు. నూతన పర్యాటక పాలసీ 2024-29 ద్వారా ల్యాండ్ అలాట్‌మెంట్, హోమ్‌స్టే, క్యారవాన్ పాలసీ, బెడ్ అండ్ బ్రేక్ ఫాస్ట్ అనుబంధ పాలసీలను మరింత సరళతరం చేశామన్నారు.విశాఖపట్నంలో రూ. 5,529 కోట్ల విలువైన 16 ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేశామని, దీనిద్వారా 950 కొత్త గదులు అందుబాటులోకి రావడమే కాకుండా 10,000 మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తుందన్నారు.

2029 నాటికి 50,000 గదులు:

పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకులు ఎక్కువ రోజులు స్టే చేసేలా 2029 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 50,000 నూతన గదులను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు.

రూ. 94.44 కోట్లతో ‘అఖండ గోదావరి’ ప్రాజెక్ట్ – గోదావరి పుష్కరాలకు భారీ ఏర్పాట్లు

కేంద్ర ప్రభుత్వ ‘శాస్కి’స్కీమ్ కింద రూ. 94.44 కోట్లతో ‘అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు’ను వేగవంతం చేస్తున్నట్లు మంత్రి దుర్గేష్ వెల్లడించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా రాజమహేంద్రవరంలో చారిత్రాత్మక హేవలాక్ వంతెన పునర్నిర్మాణం, పుష్కర్ ఘాట్ అభివృద్ధి, నిత్య గోదావరి హారతి, బ్రిడ్జిలంకలో టెంట్ సిటీలు, కడియం నర్సరీ ఎక్స్‌పీరియన్స్ సెంటర్, నిడదవోలులోని శెట్టిపేట గోదావరి కెనాల్‌లో బోటింగ్ పనులు, వే సైడ్ రెస్టారెంట్, కోటసత్తెమ్మ ఆలయంలో భక్తులకు వసతి సౌకర్యాల కల్పన, చినకాశీరేవులో ఘాట్ల అభివృద్ధి తదితర పనులు  శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు.

కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, కుంభమేళా తరహాలో 6 జిల్లాల్లో ప్లాస్టిక్ రహితంగా, పర్యావరణ హితంగా నిర్వహిస్తామని, భక్తుల కోసం ప్రత్యేక టెంట్ సిటీలు, హోమ్‌స్టేలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

విశాఖ పర్యాటక విస్తరణ & రుషికొండ ప్యాలెస్ పై నిర్ణయం

క్రూయిజ్ & సీప్లేన్ సేవలు: కార్డెలియా సంస్థ ద్వారా విశాఖ-పాండిచ్చేరి-చెన్నై క్రూయిజ్ సర్వీసులను నవంబర్ నుండి రెగ్యులర్ చేస్తున్నామని తెలిపారు. విజయవాడ-శ్రీశైలం మధ్య సీప్లేన్ ఫైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైందని, గోదావరి, కృష్ణా నదుల్లోనూ వీటికి శ్రీకారం చుడతామన్నారు.

రుషికొండ నిర్మాణాలు: గత ప్రభుత్వం ప్రజాధనాన్ని వృథా చేసి నిర్మించిన రుషికొండ భవనాలను ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా, పర్యాటకులకు ఉపయోగపడేలా ప్రతిష్టాత్మక హాస్పిటాలిటీ సంస్థలకు కేటాయించేందుకు కేబినెట్ సబ్ కమిటీ నివేదికను సీఎంకు సమర్పించామని, ఈ నెలాఖరులోగా తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

ప్రత్యేక పర్యాటక సర్క్యూట్లు & గిరిజనాభివృద్ధి

బుద్ధిస్ట్ సర్క్యూట్: ప్రపంచవ్యాప్తంగా ఉన్న 600 మిలియన్ల బౌద్ధులను ఆకర్షించేందుకు అమరావతి, తొట్లకొండ, బొజ్జనకొండ, నాగార్జునకొండలను అనుసంధానిస్తూ బుద్ధిస్ట్ సర్క్యూట్ అభివృద్ధి చేస్తున్నామన్నారు.

ఉత్తరాంధ్ర టెంపుల్ సర్క్యూట్: అరసవిల్లి, శ్రీకూర్మం, శ్రీముఖలింగం, శాలిహుండం, రామతీర్థం ప్రాంతాలను కలిపి ప్రత్యేక ఆధ్యాత్మిక సర్క్యూట్‌గా మారుస్తున్నామన్నారు. అంతేగాక  విశాఖ స్థానిక పర్యాటకం కోసం ప్రత్యేకంగా హాప్‌ ఆన్‌ హాప్‌ ఆఫ్ డబుల్ డెక్కర్ బస్సులు అందుబాటులో ఉన్నాయన్నారు.అరకు, లంబసింగి ప్రాంతాలకు ఏపీటీడీసీ ప్రత్యేక బస్సులు మరియు రైలు సౌకర్యం ఏర్పాటు చేశామన్నారు. సామాన్యుల నుంచి ఉన్నత వర్గాల వరకు అందరికీ అందుబాటులో ఉండేలా 3, 5, 7 స్టార్ హోటళ్లతో పాటు క్లాసిఫైడ్, బడ్జెట్ హోటళ్లు, టెంట్ సిటీలు, హోమ్‌స్టేలను విస్తరిస్తున్నామని పేర్కొన్నారు.

ఏజన్సీ ప్రాంతాల్లో అభివృద్ధి: 1/70 చట్టానికి లోబడి గిరిజన ప్రాంతాల్లోని పర్యాటక అవకాశాలను అక్కడి గిరిజనులకే కేటాయిస్తూ వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పడతామన్నారు.

సీఎం చంద్రబాబునాయుడు ఆలోచనలకు అనుగుణంగా జలవనరులతో పాటు ‘టూరిజం కారిడార్‌’గా వెలిగొండ రూపాంతరం చెందుతుందని వెల్లడించారు..శ్రీశైలం, త్రిపురాంతకం, కంభం, భైరవకోన, నల్లమలను కలుపుతూ ప్రత్యేక పర్యాటక సర్క్యూట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

హోమ్‌స్టే పాలసీ ప్రాధాన్యత:

రాష్ట్రంలో హోమ్‌స్టేల ఏర్పాటుకు ఇప్పటివరకు 850 మందికి పైగా ముందుకు వచ్చారని మంత్రి వివరించారు. ఈ విధానాన్ని మరింత సరళతరం చేస్తూ, స్థానిక సంస్కృతి-సంప్రదాయాలు పర్యాటకులకు ప్రత్యక్షంగా అనుభవంలోకి వచ్చేలా ప్రత్యేక గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు, రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తున్నామన్నారు.

పర్యాటకుల భద్రత ప్రభుత్వ బాధ్యత:

పిలిగ్రిమ్ (ఆధ్యాత్మిక) టూరిజంలో యాత్రికుల, పర్యాటకుల భద్రతకే అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం కఠినమైన భద్రతా నిర్ణయాలు అమలు చేస్తున్నామని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. విదేశీ పర్యటనల అనుభవాలతో రాష్ట్రంలో వెల్ నెస్ టూరిజం (యోగా, ఆయుర్వేద) రంగాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టామన్నారు.ఇప్పటికే బాబా రామ్‌దేవ్, ఐఏటీఓ వంటి సంస్థల భాగస్వామ్యంతో ఏపీకి ప్రాచుర్యం కల్పిస్తున్నామన్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం “బెస్ట్ టూరిజం ప్రమోషన్ స్టేట్” జాతీయ అవార్డును కూడా కైవసం చేసుకుందని గుర్తుచేశారు.

శాఖల మధ్య సమన్వయానికి ‘కేబినెట్ సబ్ కమిటీ’:

పర్యాటక రంగ అభివృద్ధిలో దేవాదాయ, అటవీ, ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ శాఖల మధ్య ఉండే భూ కేటాయింపులు, అనుమతుల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు ప్రత్యేక కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి పలు సమస్యలను ఇప్పటికే పరిష్కరించామని తెలిపారు.

“ఆంధ్రప్రదేశ్ అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించే సరికొత్త ప్రదేశం. ఆధ్యాత్మికత, బీచ్‌లు, సంస్కృతి, ప్రకృతి సౌందర్యం సమృద్ధిగా ఉన్న ఏపీని ప్రపంచ వేదికపై ప్రచారం చేసేందుకు మా సభ్యులు సిద్ధంగా ఉన్నారని ఐఏటీవో ప్రెసిడెంట్ రవి గోసేన్ తెలిపారు.. ప్రభుత్వం, పర్యాటక రంగాన్ని ఒకే వేదికపైకి తెచ్చి కార్యాచరణ రూపొందించేందుకు ఈ సదస్సు దోహదపడుతుంది” అని పేర్కొన్నారు.

టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), వినియోగదారుల ప్రాధాన్యతలలో వస్తున్న మార్పులపై సదస్సులో కీలక చర్చలు జరుగుతాయన్నారు. సదస్సు అనంతరం ప్రతినిధుల కోసం ప్రత్యేకంగా 6 రకాల పోస్ట్-కన్వెన్షన్ పర్యటనలను ఏర్పాటు చేశామని, ఇది ఏపీని నేరుగా సందర్శించి అంతర్జాతీయ ప్యాకేజీలు రూపొందించడానికి సహాయపడుతుందని చెప్పారు.

‘స్వచ్ఛ పర్యాటన్ అభియాన్’ కింద పర్యావరణహిత పర్యాటకాన్ని ప్రోత్సహిస్తున్నామని ఐఏటీవో ప్రతినిధులు తెలిపారు. దేశ పర్యాటక చరిత్రలోనే తొలిసారిగా ఒక అసోసియేషన్ తమ సదస్సు వల్ల విడుదలయ్యే కార్బన్ ఫుట్‌ప్రింట్‌ను లెక్కించడానికి ‘కార్బన్ ఆడిట్’ నిర్వహిస్తోందని, భవిష్యత్తులో దీనిని తగ్గించేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు.భారత్ గ్లోబల్ టూరిజంలో ముందంజలో ఉండేందుకు నూతన పర్యాటక ప్రాంతాలను ప్రోత్సహిస్తున్నామని, అందులో ఏపీ ముందంజలో ఉందన్నారు. సదస్సులో భాగమైన ‘IATO అవార్డులు’, మరియు ప్రతిష్టాత్మక ‘ఐఏటీఓ గాట్ టాలెంట్ – కారోకే మ్యూజిక్ పోటీలు (సీజన్ 6)’ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని తెలిపారు.

ఈ సమావేశంలో ఐఏటీఓ జాతీయ అధ్యక్షుడు రవి గోసేన్, ఛైర్మన్ సునీల్ మిశ్రా, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజ్ నిష్ కైస్తా, సంజయ్ రాజ్దాన్, ఏపీటీఏ డిప్యూటీ సీఈవో శ్రీనివాస్, చీఫ్ మార్కెటింగ్ కమ్యూనికేషన్ అధికారిణి పద్మారాణి సీలా తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఫోన్‌ నెంబర్‌ పై జగన్ మోసం..షాకిచ్చే యోచనలో CBI..??

Satyam News

రెండు పెట్రోల్ బ్యాంకులను సీజ్ చేసిన కలెక్టర్

Satyam News

బార్ పెట్టాలంటే భయపడక్కరలేదు!

Satyam News

స్విట్జర్లాండ్‌లో అమెరికా ఇరాన్ మధ్య చర్చలు

Satyam News

నటి ట్విషా శర్మ కేసును స్వీకరించిన సుప్రీంకోర్టు

Satyam News

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మేనకా గాంధీ

Satyam News

Leave a Comment