26.2 C
Hyderabad
September 25, 2026
తూర్పుగోదావరిహోమ్

రాజమండ్రి గోదావరి కాలుష్యంలో సగం ఆంధ్రా పేపర్ మిల్లుదే

#PavanKalyan

రాజమహేంద్రవరం ఆంధ్రా పేపర్ లిమిటెడ్ పన్ను ఎగవేతకు దాదాపు పుష్కర కాలం పూర్తి కావస్తోంది. యథేచ్ఛగా కాలుష్యాన్ని వెదజల్లుతున్నారు. పన్నులు మాత్రం ఉద్దేశపూర్వకంగా ఎగ్గొడుతున్నారు. 2016 తర్వాత కాతేరు గ్రామ పంచాయతీకిగానీ, రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్‌కు గానీ ఒక్క రూపాయి పన్ను కూడా చెల్లించలేదన్న విషయం మీకు గుర్తుందా?

ప్రభుత్వంతో సంబంధం లేకుండా మీకు మీరే పన్ను మినహాయింపు ఇచ్చేసుకున్నారా? ఇది ఎలా సాధ్యం? రూ. 21.34 కోట్ల వరకు మీరు స్థానిక సంస్థలకు పన్నులు చెల్లించాల్సి ఉంది. పన్ను చెల్లించమని నోటీసులు ఇచ్చిన ప్రతిసారీ కోర్టులను ఆశ్రయించి కాలయాపన చేస్తూ.. మీ బాధ్యత నుంచి తప్పించుకు తిరుగుతున్నారు…. అంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు.

ఇంకా ఆయన ఏమన్నారంటే…. రాజమహేంద్రవరం నగర కాలుష్యంలో సగం ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్ నుంచే వస్తుందని అధికారిక గణాంకాలు సైతం చెబుతున్నాయి. రాజమహేంద్రవరం నగరం మొత్తం దాదాపు 70 మిలియన్ లీటర్ల ద్రవ వ్యర్థాలు ఉత్పత్తి అవుతుంటే, అందులో సుమారు 35 మిలియన్ లీటర్లు మీరు ఉత్పత్తి చేస్తున్నారు. మీరు విడుదల చేస్తున్న వ్యర్థాల్లో పరిమితికి మించి కాలుష్య కారకాలు ఉన్నట్టు నిర్ధారణ కూడా అయ్యింది.

జలచరాలకు కూడా ఇబ్బంది కలిగిస్తున్నారు…

మీరు వ్యర్థాలు విడుదల చేసే లగూన్స్ దగ్గర సేకరించిన నమూనాలను పరీక్షించగా, లీటర్ నీటికి 36 మిల్లీగ్రాముల బయో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (బీఓడీ) ఉంది. ఇది నిర్ణీత ప్రమాణాల కంటే 20 శాతం అధికం. ఫాస్ఫేట్ 5.3 మిల్లీగ్రాములు 6 శాతం అధికంగా ఉంది. సల్ఫైడ్స్ 3.4 మిల్లీగ్రాములు ఉన్నాయి. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాలతో పోలిస్తే.. ఇది 70 శాతం అధికం. మీరు విడుదల చేసే కాలుష్యం కారణంగా నీటిలో ఆక్సిజన్ శాతం తగ్గి జలచరాల మనుగడకు ఇబ్బంది కలుగుతుంది.

గోదావరి నది సహజ పర్యావరణ వ్యవస్థ దెబ్బ తింటోంది. దుర్గంధాలు వెదజల్లుతూ, నీటి నాణ్యత తగ్గి ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ, భవిష్యత్ మానవాళి మనుగడను ప్రశ్నార్థకంగా మారుస్తోంది. భూగర్భ జలాలు కలుషితం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని క్షేత్ర స్థాయి పర్యటనలో నేను సూచనలు చేశాను. వాటిని కూడా మీరు పాటించలేదు.

మీ ఉల్లంఘనలకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలకు లోబడి కఠిన చర్యలు తీసుకోవచ్చు. పరిశ్రమలో కార్యకలాపాలు నిలుపుదల చేయొచ్చు. పెనాల్టీలు విధించవచ్చు. కంపెనీని సీజ్ చేయొచ్చు. ఏకంగా లైసెన్స్ రద్దు చేయొచ్చు. అయినప్పటికీ పరిశ్రమలను ఇబ్బంది పెట్టకూడదన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ముందస్తు హెచ్చరికగా షోకాజ్ నోటీసులు ఇచ్చి.. తప్పుని సరిదిద్దుకునే అవకాశం ఇచ్చింది. గడచిన మూడు నెలల కాలంలో  కాలుష్య నియంత్రణ మండలి అధికారులు మీ ప్రతినిధులతో పలుమార్లు చర్చించి, పరిష్కార మార్గాలు సూచించారు.  అయితే మీ నుంచి స్పందన పూర్తిగా కొరవడింది.

దీంతో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తక్షణం ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్ కి సమన్స్ జారీ చేసి నిబంధనల మేరకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తున్నాను.

ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్, అదనపు అడ్వకేట్ జనరల్‌తో పాటు ప్రభుత్వ న్యాయవాదులు, స్టాండింగ్ కౌన్సిళ్లు ఇటువంటి ఉల్లంఘనలకు సంబంధించిన కేసుల విచారణను త్వరితగతిన పూర్తి చేసేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నాను. స్వచ్ఛ గోదావరి-పవిత్ర పుష్కరాలు థీమ్ తో మన గోదావరి నదిని కాలుష్యం నుంచి కాపాడేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు పర్యావరణ వేత్తలు, పౌర సమాజం నుంచి మద్దతు కోరుతున్నాము. ప్రజా ప్రయోజనాలు, పర్యావరణ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతాంశంగా ముందుకు తీసుకువెళ్తుందని తెలియజేస్తున్నాను అని పవన్ కళ్యాణ్ అన్నారు.

Related posts

చార్మినార్ వద్ద భారీ భద్రత ఏర్పాటు

Satyam News

అద్భుతమైన నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీ

Satyam News

గొర్రెల పెంపకం వృత్తిదారులకు ప్రోత్సాహం

Satyam News

శ్రీ మదనగోపాలస్వామి ఆలయ పునఃప్రతిష్ట మహోత్సవం

Satyam News

‘పోలీస్ కంప్లైంట్’ చిత్ర యూనిట్‌ను అభినందించిన ఘట్టమనేని ఆదిశేషగిరిరావు

Satyam News

హైదరాబాద్ లో దోమల బెడద పై తక్షణ చర్యలు

Satyam News

Leave a Comment