రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది, పెన్షనర్లకు అందిస్తున్న రూ.కోటి బీమా పథకం దేశంలోనే తొలిసారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ప్రకటించారు. ఉద్యోగి దురదృష్టవశాత్తూ మరణించినా అతడి కుటుంబం ఆర్థికంగా రోడ్డున పడకుండా భద్రత కల్పించాలనే మానవీయ ఉద్దేశంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
ప్రభుత్వంపై, ఉద్యోగులపై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా బ్యాంకుల సహకారంతో పథకాన్ని అమలు చేస్తున్నట్లు ఆయన సభకు చెప్పారు. గురువారం నాడు శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమాద బీమా, హెల్త్ కార్డుల గురించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వివరణాత్మకంగా చెప్పారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం 16 బ్యాంకులతో ఒప్పందం చేసుకుని రెగ్యులర్ ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి బీమా కవరేజీ కల్పిస్తోందన్నారు. ఈ మేరకు 2024 జూన్ 26న ఆర్థిక శాఖ 77వ జీవో సర్క్యులర్ జారీ చేసింది. పథకం అమలు విధానం, అర్హతలు, బీమా కవరేజీ, నిబంధనలు, షరతులను అందులో పేర్కొంది.
12.91 లక్షల మందికి కవరేజీ:
రాష్ట్రంలో మొత్తం 12,91,056 మంది ఈ పథకం పరిధిలో ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. వీరిలో 5,18,293 మంది రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నట్లు చెప్పారు. ఇంకా 5,00,158 మంది తాత్కాలిక, ఔట్‌సోర్సింగ్, మల్టీపర్పస్ వర్కర్లు, కాంట్రాక్ట్, డైలీవేజ్, ఎన్‌ఆర్‌ఈజీఎస్, ఎంటీఎస్, సెర్ప్ తదితర సిబ్బంది ఉన్నారు. 2,72,600 మంది పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్లు ఉన్నారని అన్నారు.
సింగరేణితో శ్రీకారం:
ఉద్యోగుల కోసం రూ.కోటి బీమా పథకానికి తొలుత సింగరేణి కాలరీస్‌లో శ్రీకారం చుట్టినట్లు ఆయన తెలిపారు. అనంతరం విద్యుత్ శాఖ పరిధిలోని డిస్కమ్‌లు, ఇతర సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు పథకాన్ని విస్తరించినట్లు చెప్పారు. చివరగా రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులందరికీ వర్తించేలా విస్తరించినట్లు పేర్కొన్నారు. సింగరేణి ఉద్యోగులకు 2024 ఫిబ్రవరిలో, ఇంధన శాఖ ఉద్యోగులకు 2025లో, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ 2026 జూన్ 25 నుంచి పథకం వర్తించేలా చర్యలు తీసుకున్నట్లు వివరించారు.
ప్రభుత్వానికి రూపాయి భారం లేదు:
ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్న బ్యాంకులతో ప్రభుత్వం చర్చలు జరిపి ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఉద్యోగుల జీతాలు తమ బ్యాంకుల ద్వారా జమ అవుతున్నందున, బ్యాంకులకు వ్యాపార పరంగా ప్రయోజనం కలుగుతున్న నేపథ్యంలో బీమా పథకానికి బ్యాంకులే సహకరించేలా ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించారు. దీంతో ప్రభుత్వంపై, ఉద్యోగులపై ఎలాంటి ప్రీమియం భారం లేకుండా పథకం అమలవుతోందన్నారు.
ఇప్పటికే క్లెయిమ్‌ల పరిష్కారం:
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఇప్పటివరకు 33 క్లెయిమ్‌లు వచ్చాయన్నారు. అందులో 24 క్లెయిమ్‌లను పరిష్కరించినట్లు ప్రకటించారు. విద్యుత్ శాఖకు చెందిన ఎస్పీడీసీఎల్, ఎన్‌పీడీసీఎల్, టీజీ జెన్‌కో, ట్రాన్స్‌కో పరిధిలో 15 క్లెయిమ్‌లు రాగా, అన్నింటినీ పరిష్కరించినట్లు చెప్పారు. ఈ విభాగంలో రూ.15 కోట్లకు పైగా చెల్లింపులు జరిగినట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా సింగరేణి కాలరీస్‌లో 50 క్లెయిమ్‌లు రాగా అన్నింటిని పరిష్కరించినట్లు తెలిపారు.
ఉద్యోగులకు రూ.1.20 కోట్లు :
ప్రమాదవశాత్తు మరణించిన ఉద్యోగి కుటుంబానికి రూ.కోటి బీమాతో పాటు ఇతర ప్రయోజనాలు కలిపి రూ.1.20 కోట్ల వరకు ప్రయోజనం అందేలా చర్యలు తీసుకున్నట్లు డిప్యూటీ సీఎం చెప్పారు. విమాన ప్రయాణ సమయంలో ప్రమాదం జరిగితే రూ.2 కోట్ల వరకు బీమా ప్రయోజనం కల్పిస్తున్నట్లు వెల్లడించించారు. సహజ మరణానికి రూ.10 లక్షల వరకు ప్రయోజనం కల్పించే వెసులుబాటు కూడా ఉన్నట్లు చెప్పారు.
కేంద్రం, ఇతర రాష్ట్రాలు అధ్యయనం:
తెలంగాణలో ప్రారంభించిన ప్రమాద బీమా పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అధ్యయనం చేసిందని ఉప ముఖ్యమంత్రి సభకు చెప్పారు. ఇతర రాష్ట్రాలు సైతం తెలంగాణలో అమలు చేస్తున్న ఈ బీమా విధానాన్ని పరిశీలించేందుకు ఆసక్తి చూపుతున్నాయని చెప్పారు. తమిళనాడు కూడా ఈ తరహా పథకాన్ని అమలు చేసినట్లు ఆయన వెల్లడించారు.
ఉద్యోగులకు హెల్త్‌కార్డు:
బీమా పథకంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం హెల్త్‌కార్డు పథకాన్ని కూడా తీసుకొచ్చినట్లు డిప్యూటీ సీఎం చెప్పారు. దశాబ్దాలుగా ఉద్యోగ సంఘాలు కోరుతున్న క్యాష్‌లెస్ వైద్య సేవల కలను ప్రభుత్వం సాకారం చేసిందని ఆయన చెప్పారు. ఉద్యోగులు, వారి సంఘాల ప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సంబంధిత ముఖ్య కార్యదర్శులతో కమిటీ ఏర్పాటు చేసి చర్చల అనంతరం హెల్త్‌కార్డుల విధానాన్ని ఖరారు చేసినట్లు వివరించారు. క్యాష్‌లెస్ వైద్యం, సీజీహెచ్‌ఎస్ ప్యాకేజీ వంటి సదుపాయాలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆయన చెప్పారు. హెల్త్‌కార్డు పథకం కోసం ఇప్పటికే సుమారు రూ.240 కోట్ల నిధులు కేటాయించినట్లు ఉప ముఖ్యమంత్రి చెప్పారు. ఉద్యోగుల సంక్షేమానికి బీమా, ఆరోగ్య భద్రతకు హెల్త్‌కార్డు, రెండు పథకాలూ ఉద్యోగ కుటుంబాలకు ఆర్థిక, వైద్య భరోసా కల్పించేలా రూపొందించామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసనసభకు చెప్పారు.
