చిత్తూరు హోమ్

తిరుపతి షిర్డీ మధ్యన వారాంతపు ఎక్స్ ప్రెస్ రైలు

#BCJanardhanReddy

తిరుపతి–సాయినగర్ షిర్డీ ఎక్స్‌ప్రెస్ రైలును మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి మంగళవారం జెండా ఊపి ప్రారంభించారు. ఇందుకోసం తిరుపతి రైల్వే స్టేషన్‌కు విచ్చేసిన మంత్రికి కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ పుష్పగుచ్ఛం అందించి ఘనస్వాగతం పలికారు.

ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి, తిరుపతి నుంచి సాయినగర్ షిర్డీకి వారాంతపు ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రమైన తిరుపతి నుండి సాయిబాబా కొలువై ఉన్న షిర్డీకి రైలు సేవలు అందుబాటులోకి రావడం భక్తులకు ఒక గొప్ప వరమని చెప్పారు.

ఇది అధ్యాత్మిక పర్యాటకానికి, దేవాలయ పర్యాటకానికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం తిరుపతి నుండి షిర్డీకి మంగళవారం నడిచే ఒక వారాంతపు రైలు ఉందని, అది ఎక్కువ రద్దీగా ఉండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు మరో వీక్లీ రైలు కోసం కేంద్ర రైల్వే శాఖను కోరినట్లు మంత్రి వివరించారు.

తమ విన్నపాన్ని అంగీకరించి రైలు ప్రారంభించేందుకు సహకరించిన కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్, సహాయ మంత్రి సోమన్నలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఉత్తరాది యాత్రికుల సౌకర్యార్థం షిర్డీ–తిరుపతి రూట్‌పై రైలు ఏర్పాటు చేయాలని కూడా విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు.

త్వరలో రోజువారీ రైలు నడిపేందుకు ప్రయత్నం

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని త్వరలో రోజువారీ రైలు నడపేందుకు కృషి చేస్తామని, ఈ కార్యక్రమంలో పాల్గొనడం భగవంతుని ఆశీర్వాదమేనని మంత్రి పేర్కొన్నారు. భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రైల్వే కనెక్టివిటీని మరింత బలోపేతం చేయడానికి ఆదివారం మరో కొత్త వారాంతపు ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

తిరుపతి రైల్వే స్టేషన్ అత్యాధునిక వసతులతో అభివృద్ధి చెందుతోందని, దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో తిరుపతిని కేంద్రంగా చేసుకుని సుమారు రూ. 6,700 కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మంత్రి గర్వంగా తెలిపారు. కూటమి ప్రభుత్వంలో రైల్వే రంగం గణనీయమైన పురోగతి సాధిస్తోందని, రైల్వే ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారని చెప్పారు.

సీఎం సూచనల మేరకు భూసేకరణ, అడవి సమస్యలు వంటి అంశాలను పరిష్కరించేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో రూ. 33,630 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని, 1,564 కిలోమీటర్ల కొత్త రైల్వే మార్గాల అభివృద్ధి జరుగుతోందని చెప్పారు.

ఐకానిక్ స్టేషన్లుగా ఎంపిక….

విజయవాడ, విశాఖ, తిరుపతి రైల్వే స్టేషన్లను ఐకానిక్ స్టేషన్లుగా అభివృద్ధి చేయాలనే ప్రణాళికతో పాటు, నూతన అమరావతి రైల్వే స్టేషన్‌ను వినూత్నంగా నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 373 రైల్వే ఓవర్‌ బ్రిడ్జ్‌లు, అండర్ బ్రిడ్జ్‌ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపామని, గోదావరి పుష్కరాల నాటికి రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ అప్‌గ్రేడేషన్ పనులను రూ. 271 కోట్లతో పూర్తి చేయాలని లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు.

Related posts

కడుపు నొప్పితో వెళితే కాటికి పంపిన వైద్యులు

Satyam News

వైభవంగా జరుగుతున్న వైకుంఠఏకాదశి

Satyam News

భారత్ పాక్ యుద్ధాన్ని తానే ఆపినట్లు మళ్లీ చెప్పిన ట్రంప్

Satyam News

Leave a Comment

error: Content is protected !!