పాకిస్తాన్ మళ్లీ పైశాచికంగా ప్రవర్తించింది. అరేబియా సముద్రంలో భారత నౌకాదళ నౌకను పాకిస్థాన్ నౌక ఢీకొన్నది. ఉత్తర అరేబియా సముద్రంలో సాధారణ నిఘా విధుల్లో ఉన్న భారత నౌకాదళ యుద్ధనౌక వైపు పాకిస్థాన్ నౌకాదళానికి చెందిన ఓ నౌక అధిక వేగంతో దూసుకొచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
అంతర్జాతీయ జలాల్లో ఈ ఘటన చోటుచేసుకుందని విదేశాంగ శాఖ తెలిపింది. అయితే పాకిస్థాన్ నౌకాదళ నౌక వ్యవహరించిన తీరు 1991 ఏప్రిల్‌లో భారత్, పాకిస్థాన్ మధ్య కుదిరిన సైనిక విన్యాసాలు, కదలికలు, దళాల తరలింపుపై ముందస్తు సమాచారం అందించే ఒప్పందంలోని 10వ అధికరణకు నేరుగా విరుద్ధమని పేర్కొంది.
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని సైనిక విభాగాలు సముద్రంలో తగిన జాగ్రత్తలు పాటించాలని, భారత్-పాకిస్థాన్ మధ్య అమల్లో ఉన్న సంబంధిత ఒప్పందాలను గౌరవించాలని పాకిస్థాన్ అధికారులకు తెలియజేయాలని ఢిల్లీలోని పాకిస్థాన్ చార్జ్ డి అఫైర్స్‌కు భారత విదేశాంగ శాఖ సూచించింది.
ఇస్లామాబాద్‌లోని భారత దౌత్య ప్రతినిధిని కూడా పాకిస్థాన్ విదేశాంగ శాఖకు ఇదే అంశంపై అధికారికంగా నిరసన తెలియజేయాలని ఆదేశించినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. ఘటనలో ఎలాంటి పెద్ద నష్టం జరగలేదని మరోసారి స్పష్టం చేసింది.
