హైదరాబాద్హోమ్

వేధింపులను ప్రశ్నించండి.. వివక్షను ఎదిరించండి

#CharuSinha

మహిళల భద్రత కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని మహిళా భద్రతా విభాగం డిజి చారు సిన్హా పేర్కొన్నారు. వేధింపులు, వివక్ష వంటి అనుచిత ప్రవర్తనను గుర్తించి ప్రశ్నించే ధైర్యాన్ని యువత అలవరచుకోవాలని సూచించారు. తెలంగాణ పోలీసు మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో గురువారం ‘స్టాండ్‌ విత్‌ హర్‌’ ప్రచార కార్యక్రమంలో భాగంగా రెండు రోజుల శిక్షకుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి ఉస్మానియా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డాక్టర్‌ కుమార్‌ మొలుగారం, డిజి చారు సిన్హా, మహిళా భద్రతా విభాగం శిక్షణ, కంటెంట్‌ అభివృద్ధి విభాగం అధిపతి ఆసియా షెర్వాణి హాజరయ్యారు. రాష్ట్రంలోని వివిధ డిగ్రీ కళాశాలలకు చెందిన అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సమాజంలో మార్పు రావాలి

మహిళల భద్రతకు చట్టాల అమలు ఒక్కటే సరిపోదని, ప్రజల ఆలోచనా విధానం, సామాజిక దృక్పథం, రోజువారీ ప్రవర్తనలోనూ మార్పు రావాలని డిజి పేర్కొన్నారు. ముఖ్యంగా యువకులు మహిళల పట్ల గౌరవభావంతో మెలగాలని, లింగ వివక్ష, వేధింపులను ప్రోత్సహించే ధోరణులను వ్యతిరేకించాలని సూచించారు. పరస్పర గౌరవం, సమ్మతి, వ్యక్తిగత హద్దులు, సమానత్వంపై అవగాహన పెంపొందించుకోవాలని చెప్పారు.

విశ్వవిద్యాలయాల్లో అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ సురక్షితమైన విద్యా వాతావరణాన్ని ఏర్పరచాల్సిన అవసరం ఉందని ఉపకులపతి కుమార్‌ మొలుగారం అన్నారు. విశ్వవిద్యాలయంలో సుమారు 40 శాతం మంది అధ్యాపకులు మహిళలేనని తెలిపారు. 1,500 మంది మహిళలు నివసించేలా ప్రత్యేక బహుళ అంతస్తుల వసతి గృహాల నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.

ఆరు నెలల్లో 2,000 మందికి అవగాహన

ఈ నెల 30వ తేదీ వరకు జరిగే శిక్షణ కార్యక్రమంలో నాలుగు బ్యాచ్‌లుగా 250 మందికి పైగా విద్యార్థులు, అధ్యాపకులకు శిక్షణ ఇస్తారు. వీరు తమ కళాశాలల్లో ఇతరులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. తద్వారా వచ్చే ఆరు నెలల్లో 2,000 మందికి పైగా ఈ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

శిక్షణలో చురుగ్గా వినడం, ఇతరుల భావాలను అర్థం చేసుకోవడం, సమర్థంగా మాట్లాడటం, క్లిష్టమైన అంశాలపై చర్చలను నిర్వహించడం వంటి నైపుణ్యాలను నేర్పిస్తారు. వీటి ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బృందంగా పనిచేసే సామర్థ్యం, సమస్యలను విశ్లేషించే నైపుణ్యాలు పెంపొందుతాయి. మహిళల భద్రత, గౌరవం, సమానత్వం, పరస్పర సమ్మతిపై అవగాహనను కార్యాచరణగా మార్చి, సురక్షితమైన సమాజ నిర్మాణానికి కృషి చేయడమే ‘స్టాండ్‌ విత్‌ హర్‌’ కార్యక్రమం లక్ష్యంగా డిజి పేర్కొన్నారు.

Related posts

ముస్లీం మైనార్టీల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం

Satyam News

తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని రాజకీయాలు చేసిన వ్యక్తి జగన్

Satyam News

మేడారం జాతర పనుల పురోగతిపై ఆకస్మిక తనిఖీ

Satyam News

చార్మినార్ వద్ద భారీ భద్రత ఏర్పాటు

Satyam News

విమానయానంపై తీవ్ర ప్రభావం: తగ్గుతున్న విమాన సర్వీసులు

Satyam News

ఆపరేషన్ సిందూర్ కు ఏడాది పూర్తి

Satyam News

Leave a Comment