మరోసారి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అసలు నైజం బట్టబయలైంది. ఒకవైపు సామాజిక మాధ్యమాలలో, పబ్లిక్ మీటింగ్‌లలో రాప్తాడు సంఘటనపై మొసలి కన్నీరు కారుస్తూ మరోవైపు తెరవెనుక తన లాయర్ల ద్వారా అరాచక శక్తులకు రక్షణ కవచం ఏర్పాటు చేయడం ఆయన నేరమయ వైఖరికి నిదర్శనంగా పలువురు భావిస్తున్నారు.
రాప్తాడు ప్రభుత్వ పాఠశాలలో హేమంత్ అనే మానవ మృగం ఎలక్ట్రిక్ రంపంతో పదేళ్ల పసిపిల్లలపై రక్తపుటేరులు పారించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఈ దారుణాన్ని ఖండిస్తూ, బాధితులకు 50 లక్షల పరిహారం ఇవ్వాలని, కూటమి ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలని జగన్మోహన్ రెడ్డి మీడియా ముందు పెద్ద పెద్ద స్టేట్‌మెంట్లు ఇచ్చారు.
కానీ, అదే హేమంత్‌పై పోలీసులు జరిపిన కాల్పులను, చికిత్స అందిస్తున్నా కూడా తప్పుపడుతూ హైకోర్టులో ఏకంగా పిల్ దాఖలు చేయించింది ఎవరు? 2021లో వైఎస్ జగన్ ప్రభుత్వం ఏపీఎస్‌ఆర్టీసీ స్టాండింగ్ కౌన్సిల్‌గా నియమించిన ప్రముఖ న్యాయవాది మంచాల సాల్మన్ రాజు! జగన్ కనుసన్నల్లోనే నడిచే ఈ పార్టీ శక్తులు, హేమంత్ వంటి రాక్షసుడికి చట్టపరమైన రక్షణ కల్పించడానికి కోర్టు మెట్లు ఎక్కాయి. సమాజంలో ఒకవైపు శాంతిభద్రతల గురించి నీతులు మాట్లాడటం, మరోవైపు నేరస్థులను కాపాడటానికి లాయర్లను రంగంలోకి దించడం ఏ రకమైన నాయకత్వం? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.
ప్రజలను మభ్యపెట్టడానికి ఒక మాట, నేరస్థులను రక్షించడానికి మరొక మార్గం ఎంచుకోవడం వైఎస్ జగన్ నైజం అనే విమర్శ వినిపిస్తున్నది. రాప్తాడు ఘటనలో పసిపిల్లల ప్రాణాలతో చెలగాటమాడిన హేమంత్‌కు అండగా నిలుస్తున్న ఈ వైఖరిని రాష్ట్ర ప్రజలు తీవ్రంగా అసహ్యించుకున్నారు. ఇప్పటికైనా ఈ నేర రాజకీయ నాటకాలను మాని,మానవత్వంతో బాధితులకు అండగా ఉండాల్సిందిపోయి నేరస్థుల కోసం అమానుషంగా కోర్టులకెక్కడం సిగ్గుచేటు అంటూ మహిళా సంఘాలు కూడా విమర్శిస్తున్నాయి.
