నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రామాయణం: పార్ట్ వన్’పై అంతర్జాతీయ స్థాయిలో తొలి సమీక్షలు వెలువడ్డాయి. భారతీయ ఇతిహాసం రామాయణాన్ని అత్యంత భారీ స్థాయిలో వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేసిన ఈ చిత్రంపై విదేశీ సినీ విశ్లేషకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
సినిమా నిర్మాణ విలువలు, భారీ యుద్ధ సన్నివేశాలు, అద్భుతమైన దృశ్యాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే సామర్థ్యం ఉందని ప్రశంసిస్తూనే, కథనంలో భావోద్వేగాలకు తగినంత ప్రాధాన్యం లేకపోవడం, కొన్ని దృశ్యాల్లో కంప్యూటర్ గ్రాఫిక్స్ నాణ్యత ఆశించిన స్థాయిలో లేకపోవడంపై విమర్శలు చేస్తున్నారు.
భారతీయ జీవన వైవిధ్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు
ఇండియావైర్ సమీక్ష ప్రకారం, భారతదేశంలోని ప్రకృతి వైవిధ్యాన్ని ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు. జింకలు సంచరించే పచ్చని మైదానాలు, పులులు, భయంకరమైన శక్తులు దాగి ఉండే దట్టమైన అడవులు ఇలా భారతీయ భౌగోళిక స్వరూపంలోని అనేక కోణాలను తెరపై ఆవిష్కరించారు. యుద్ధాలు, సంగీత సన్నివేశాలు, భారీ పోరాటాలు, మాట్లాడే గరుడ పక్షులు, వైభవంగా జరిగే భారతీయ వివాహాలు, కుటుంబ కలహాలు, ఎగిరే యంత్రాలు, రూపాలు మార్చుకునే పాత్రలు ఇలా అనేక అంశాలతో సినిమాను అత్యంత భారీగా తీర్చిదిద్దారని పేర్కొంది. కొన్ని సందర్భాల్లో క్రిస్టోఫర్ నోలన్ రూపొందిస్తున్న ‘ది ఒడిస్సీ’ చిత్రం కూడా ఈ సినిమా ముందు చిన్నదిగా కనిపించేంత వైభవం ఉందని వ్యాఖ్యానించింది.
నిర్మాత నమిత్ మల్హోత్రా గర్వపడే స్థాయిలో సినిమా నిర్మాణం ఉందని ప్రశంసించింది. సినిమాలో ప్రతి సన్నివేశం ఒక క్లైమాక్స్‌లా అనిపిస్తుందని పేర్కొంది. అయితే ఇదే సినిమాకు ఒక సమస్యగా మారిందని విశ్లేషించింది. ప్రతి కీలక సన్నివేశం ఎందుకు ముఖ్యమైనదో, పాత్రల మధ్య భావోద్వేగ సంబంధాలు ఏమిటో ప్రేక్షకులు అర్థం చేసుకునేంత సమయం లభించడం లేదని అభిప్రాయపడింది. మూడు గంటల నిడివి ఉన్న సినిమా, అందులోనూ మొదటి భాగం కావడంతో మరింత నిడివి అవసరమని అనిపించడం ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ, పాత్రలతో ప్రేక్షకులు మమేకం కావడానికి ప్రశాంతమైన సన్నివేశాలు కూడా ఉండాల్సిందని పేర్కొంది. నిరంతరం ఉత్కంఠభరితమైన సంఘటనలు చోటుచేసుకోవడం వల్ల కీలక ఘట్టాల ప్రభావం కొంత తగ్గిందని సమీక్షలో అభిప్రాయపడింది.
కీలక అంశాల్లో కథనం బలహీనం
స్క్రీన్‌రాంట్ సమీక్ష కూడా సినిమాను గొప్ప దృశ్యకావ్యంగా అభివర్ణించింది. ప్రేమ, యాక్షన్, సంగీతం, మంచి చెడుల మధ్య సంఘర్షణ వంటి అంశాలు ఆసక్తికరంగా ఉన్నాయని పేర్కొంది. కొన్ని కీలక అంశాల్లో కథనం బలహీనంగా ఉన్నప్పటికీ, సాంకేతిక నైపుణ్యం, ఆకట్టుకునే సన్నివేశాలు ఈ చిత్రాన్ని పెద్ద తెరపై చూడదగిన సినిమాగా నిలబెడతాయని తెలిపింది.
అయితే కథానాయకులైన రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవిల పాత్రల చిత్రణపై ఈ సమీక్ష కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసింది. యాక్షన్ సన్నివేశాల్లో ఇద్దరూ అద్భుతంగా నటించారని, తమ పాత్రలకు సంబంధించిన కొన్ని సన్నివేశాల్లో ఆకట్టుకున్నారని ప్రశంసించింది. అయితే పౌరాణిక పాత్రల స్వరూపానికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంతో వారి పాత్రల్లో సహజమైన మానవీయ భావోద్వేగాలు కొంత లోపించాయని పేర్కొంది. ఈ విషయంలో రావణుడిగా నటించిన యశ్ ప్రత్యేకంగా ఆకట్టుకున్నారని, సినిమా తొలి భాగంలో ఆయన పాత్రకు ఆసక్తికరమైన ప్రాధాన్యం లభించిందని విశ్లేషించింది.
నెక్స్ట్ బిగ్ పిక్చర్ సమీక్ష మాత్రం సినిమాలోని యుద్ధ సన్నివేశాలు, దృశ్య ప్రభావాలపై విమర్శలు చేసింది. రామాయణం వంటి ఇతిహాస చిత్రాన్ని ప్రేక్షకులు చూడాలనుకోవడానికి ప్రధాన కారణం భారీ యుద్ధాలు, అద్భుతమైన దృశ్యాలేనని పేర్కొంది. దర్శకుడు నితేశ్ తివారీ కొన్ని చోట్ల వ్యక్తిగత పోరాట సన్నివేశాల ద్వారా గొప్ప అనుభూతిని కలిగించగలిగారని, అయితే అనేక యుద్ధ సన్నివేశాల్లో కంప్యూటర్ గ్రాఫిక్స్ సహజత్వాన్ని కోల్పోయాయని అభిప్రాయపడింది.
వీడియో గేమ్ లాగా ఉంది
ప్రపంచ స్థాయి చిత్రాలైన ‘డ్యూన్’, ‘ఇంటర్స్టెల్లార్’ వంటి సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ అందించిన డీఎన్ఈజీ సంస్థ ఈ చిత్రానికి కూడా పనిచేసినప్పటికీ, కొన్ని సన్నివేశాలు పాతకాలపు వీడియో గేమ్ దృశ్యాలను తలపిస్తున్నాయని విమర్శించింది. కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో దృశ్యాల వేగం అకస్మాత్తుగా తగ్గిపోతున్నట్లు అనిపిస్తోందని, ప్లేస్టేషన్‌లో వీడియో గేమ్ చూస్తున్న అనుభూతి కలుగుతోందని వ్యాఖ్యానించింది.
మొత్తంగా ‘రామాయణం: పార్ట్ వన్’ అంతర్జాతీయ సమీక్షల్లో భారీ నిర్మాణం, దృశ్య వైభవం, యుద్ధ సన్నివేశాలు ప్రశంసలు అందుకుంటుండగా, కథనంలోని భావోద్వేగ లోతు, పాత్రల సహజత్వం, విజువల్ ఎఫెక్ట్స్ నాణ్యతపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. భారతీయ ఇతిహాసాన్ని ప్రపంచ స్థాయి సినిమాగా ఆవిష్కరించాలన్న నిర్మాత నమిత్ మల్హోత్రా ప్రయత్నంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
