ప్రత్యేకంహోమ్

కొత్త ప్రయోగం: సోనియా గాంధీ సోషల్ మీడియా ఎంట్రీ

#SoniaGandhi

కాంగ్రెస్ పార్టీ మరో కొత్త ప్రయోగం మొదలు పెట్టింది. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు, పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్‌ (ట్విట్టర్‌) వేదికల్లోకి ప్రవేశించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉన్న ఆమె ఇప్పుడు ఒక్కసారిగా డిజిటల్ వేదికలపైకి రావడం వెనుక కారణాలేమిటన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

యువతను ఆకట్టుకోవడానికే ఈ ప్రయోగమని రాజకీయ విశ్లేషణలు పేర్కొంటున్నాయి. దేశ రాజకీయాల్లో యువత అభిప్రాయాలు, వారి ఆలోచనా విధానం, సామాజిక మాధ్యమాల ప్రభావం రోజురోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా రాజకీయ అంశాలపై యువత స్పందించే తీరు, సంప్రదాయ ప్రచార పద్ధతులకు భిన్నంగా మారుతోంది. సుదీర్ఘ ప్రసంగాలు, పత్రికా ప్రకటనల కంటే చిన్న వీడియోలు, వ్యంగ్య చిత్రాలు, చమత్కార వ్యాఖ్యలు యువతను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి.

సోషల్ మీడియాలో చురుకుగా ఉన్న మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇన్‌స్టాగ్రామ్‌లో స్వయంగా రూపొందించిన వీడియోలు, యువతతో నేరుగా సంభాషించే ప్రయత్నాల ద్వారా ఆయన సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. పరీక్షల సంస్కరణలు, యువత ఎదుర్కొంటున్న సమస్యలు తదితర అంశాలపై వీడియోల ద్వారా స్పందిస్తున్నారు. నీట్‌-యూజీ ప్రశ్నపత్రం లీకేజీ వివాదం సమయంలోనూ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలతో సంబంధాలు కొనసాగించే ప్రయత్నం చేశారు.

అమెరికాలో ఉంటున్న అభిజీత్ దీప్కే ప్రారంభించిన ఆన్‌లైన్ ఉద్యమం ‘కాక్రోచ్ జనతా పార్టీ’ అనూహ్యంగా ప్రజాదరణ పొందడం మార్పుకు ఒక ఉదాహరణగా నిలిచింది. నీట్‌ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ వివాదం, నిరుద్యోగం, విద్యార్థుల సమస్యలపై రూపొందించిన వ్యంగ్య చిత్రాలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం పొందాయి. ఈ ఉద్యమానికి ఇన్‌స్టాగ్రామ్‌లో భారీ సంఖ్యలో అనుచరులు చేరడంతో సంప్రదాయ రాజకీయ పార్టీల సామాజిక మాధ్యమాల ప్రభావంపై చర్చ మొదలైంది. ఒక దశలో ఈ ఖాతాకు రెండు కోట్లకు పైగా అనుచరులు ఉన్నట్లు వార్తా కథనాలు పేర్కొన్నాయి.

యువతను చేరుకోవడానికి ఇదొక్కటే మార్గం

ఈ పరిణామం రాజకీయ నాయకులకు ఒక విషయాన్ని స్పష్టం చేసింది. యువతను చేరుకోవాలంటే వారి భాషలోనే మాట్లాడాలి, వారు ఉపయోగించే వేదికలపైనే తమ అభిప్రాయాలను వ్యక్తం చేయాలి. రాజకీయ నాయకుల ప్రసంగాలకంటే సామాజిక మాధ్యమాల్లో వ్యంగ్యం, చమత్కారం, చిన్న వీడియోలు ఎక్కువ ప్రభావం చూపుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రధాని మోదీ ఇటీవల కాంగ్రెస్ పార్టీపై చేసిన ఒక వ్యాఖ్య కూడా సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం పొందింది. ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, బీహార్‌, కర్ణాటక రాష్ట్రాల్లో జరిగిన 28 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన ఫలితాలపై ఆయన చమత్కార ధోరణిలో ప్రశ్నించారు. బ్యాలెట్ పత్రాలతో ఎన్నికలు జరిగాయని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ఎన్ని స్థానాలు గెలుచుకుందో ఊహించాలని మోనోకిల్‌ ఎమోజీని కూడా ఉపయోగించారు. ఈ పోస్టుకు భారీగా వీక్షణలు రావడం డిజిటల్ రాజకీయ ప్రచారంలో మారుతున్న ధోరణికి నిదర్శనంగా నిలిచింది.

ఇప్పుడు సోనియా గాంధీ కూడా ఇదే తరహాలో యువతకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. తొలుత ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టిన ఆమె, ఆ తర్వాత ఎక్స్‌ వేదికపై తన సందేశాలను పంచుకున్నారు. తన జీవిత అనుభవాలు, ప్రేమ, కుటుంబ జ్ఞాపకాలతో రూపొందించిన ‘బిలాంగింగ్‌: ఎ జర్నీ ఆఫ్‌ లవ్‌’ అనే ఆత్మకథను పరిచయం చేస్తూ వీడియో, వచన రూపాల్లో సందేశాలు విడుదల చేశారు.

సోనియా గాంధీ సామాజిక మాధ్యమాల్లోకి రావడం వెనుక తన ఆత్మకథ ప్రచురణ కూడా ఒక ముఖ్యమైన కారణమని కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలు భావిస్తున్నారు. పుస్తక ప్రచురణకు ముందు ప్రచారం కల్పించేందుకు ఇది ఉపయోగపడుతుందని వారి అభిప్రాయం. అయితే మరికొందరు నాయకులు మాత్రం ఆమె సామాజిక మాధ్యమాల్లోకి రావాల్సిన అవసరం చాలాకాలంగా ఉందని, ఇప్పుడు ఆ నిర్ణయం తీసుకోవడం పార్టీకి ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు.

Related posts

7సీస్ ఎంటర్‌టైన్‌మెంట్ కు ఫిక్కీ బీఏఎఫ్ అవార్డ్

Satyam News

వైసీపీ సెల్ఫ్‌ గోల్:  సైలెంట్‌గా సైడ్ అవుతున్న క్యాడర్!

Satyam News

యుద్ధ పరిస్థితి పై ప్రధాని మోడీ తో ట్రంప్ చర్చలు

Satyam News

పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి

Satyam News

సంస్కరణలపై తిరగబడ్డ విద్యార్ధులు: 3 లక్షల మంది వీధుల్లోకి

Satyam News

రంగా, వైఎస్.. వివేకానందరెడ్డి మరణాలతో లాభపడింది ఎవరు..??

Satyam News

Leave a Comment