మలయాళం సూపర్ స్టార్ ముమ్ముట్టి లేనిపోని వివాదంలో చిక్కుకుని సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యాడు. బీజేపీ కేరళ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, న్యాయవాది బి. గోపాలకృష్ణన్ కుమార్తె వివాహం ఇటీవల తిరుచూరులో ఘనంగా జరిగింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ వివాహ వేడుకకు మమ్ముట్టి హాజరు కాలేకపోయారు. దీంతో తాజాగా గోపాలకృష్ణన్ నివాసానికి వెళ్లిన ఆయన నూతన దంపతులను కలిసి అభినందించారు. ఈ సందర్భంగా మమ్ముట్టి అక్కడికి వెళ్లిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో వివాదం మొదలైంది.
గోపాలకృష్ణన్ కుమార్తె వివాహానికి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ప్రతిపక్ష నేత వీడీ సతీశన్తో పాటు పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖ నాయకులు హాజరయ్యారు. భిన్న రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు ఒకే వివాహ వేడుకలో పాల్గొన్నప్పటికీ ఎలాంటి వివాదం చోటుచేసుకోలేదు. కానీ మమ్ముట్టి బీజేపీ నాయకుడి ఇంటికి వెళ్లడంపై మాత్రం కొందరు సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఒక కళాకారుడు వ్యక్తిగత పరిచయాలు, స్నేహ సంబంధాల కారణంగా మరో వ్యక్తి ఇంటికి వెళ్లడాన్ని రాజకీయ కోణంలో చూడటం సరికాదన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మమ్ముట్టి పర్యటనతో ప్రారంభమైన ఈ వివాదం కేరళ రాజకీయ, సినీ వర్గాల్లో చర్చకు దారితీసింది.
ఈ విమర్శలపై బి. గోపాలకృష్ణన్ స్పందిస్తూ, మమ్ముట్టిపై జరుగుతున్న సామాజిక మాధ్యమాల దాడులను నిజమైన సీపీఎం కార్యకర్తలు చేస్తున్నారని తాను భావించడం లేదన్నారు. సీపీఎం మద్దతుదారులుగా చెప్పుకుంటూ సామాజిక మాధ్యమాల్లో గుర్తింపు లేని కొందరు వ్యక్తులే ఇటువంటి విమర్శలకు పాల్పడుతున్నారని వ్యాఖ్యానించారు.
తనకు అన్ని రాజకీయ పార్టీల నాయకులతోనూ వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయని ఆయన తెలిపారు. తన కుమార్తె వివాహానికి ముఖ్యమంత్రి పినరయి విజయన్, ప్రతిపక్ష నేత వీడీ సతీశన్తో పాటు కాంగ్రెస్ నాయకులు కూడా హాజరయ్యారని గుర్తుచేశారు. అప్పట్లో ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయని వారు ఇప్పుడు మమ్ముట్టి తన ఇంటికి రావడంపై విమర్శలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. సామాజిక మాధ్యమాల్లో దాడులకు పాల్పడుతున్నవారు ఎలాంటి గుర్తింపు లేని వ్యక్తులని విమర్శించారు.
