ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో న్యూఢిల్లీలోని ‘యశోభూమి’ (IICC)లో ఫిబ్రవరి 25 నుండి 27 వరకు జరుగుతున్న దక్షిణాసియాలోనే అతిపెద్ద ట్రావెల్ అండ్ టూరిజం ఎగ్జిబిషన్ ‘SATTE’ (సౌత్ ఏషియా లీడింగ్ ట్రావెల్ అండ్ టూరిజం ఎగ్జిబిషన్)లో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ప్రతినిధుల బృందం చురుగ్గా పాల్గొన్నది.
రాష్ట్ర పర్యాటక శాఖ తరపున డిప్యూటీ సీఈవో శ్రీనివాస్, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ పద్మారాణి, మార్కెటింగ్ మేనేజర్ రఫీక్ అహ్మద్ తదితర ఉన్నతాధికారులు ఈ సదస్సులో పాల్గొని ఏపీ పర్యాటక రంగానికి సంబంధించిన విశేషాలను ప్రపంచ దేశాల ప్రతినిధులకు వివరించారు.ఏపీ పర్యాటక శాఖ స్టాళ్లలో రాష్ట్రంలోని ప్రముఖ ట్రావెల్ మరియు హాస్పిటాలిటీ సంస్థలు తమ సేవలను ప్రదర్శించాయి. ఇందులో విశాఖపట్నం నుండి ప్రవాసిన్, ట్రెక్ సమ్, హాలిడే వరల్డ్, రాడిసన్ బ్లు రిసార్ట్ లు, తిరుపతి నుండి బృందావన్ హాలిడేస్, స్టార్ లెట్ స్యూట్, న్యూఢిల్లీ నుండి ఈజ్ మై ట్రిప్ తదితర ప్రముఖ సంస్థలు భాగస్వాములయ్యాయి.
ప్రధానంగా రాష్ట్రంలోని టూర్ ఆపరేటర్లను నేషనల్, ఇంటర్నేషనల్ లెవల్ టూర్ ఆపరేటర్లతో అనుసంధానం చేయడం ద్వారా పర్యాటక నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడం లక్ష్యంగా ఏపీ బృందం తమదైన ప్రదర్శన చేసింది. ఏపీలోని సుదీర్ఘ తీరప్రాంతం, అరకు లోయ, గండికోట, ఆధ్యాత్మిక క్షేత్రాలైన తిరుపతి, విజయవాడ, శ్రీశైలం వంటి పర్యాటక ప్రాంతాలకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకువచ్చేందుకు కృషి చేస్తోంది. వివిధ దేశాల పర్యాటకులను ఆకర్షించేలా తక్కువ ఖర్చుతో కూడిన వినూత్న ప్యాకేజీలను టూర్ ఆపరేటర్ల ద్వారా రూపొందించడం వంటి అంశాలను ఈ బృందం చర్చించింది.
సీఎం చంద్రబాబునాయుడు నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగానికి ‘పారిశ్రామిక హోదా’ కల్పించిన నేపథ్యంలో ఈ సదస్సు ఇన్వెస్టర్లను ఆకర్షించడానికి వేదికగా నిలిచింది. పర్యాటక శాఖ రూపొందించిన ‘2024-29 నూతన పర్యాటక పాలసీ’ గురించి ఇక్కడి ప్రతినిధులకు వివరించారు. దీనివల్ల రాబోయే రోజుల్లో ఏపీకి మరిన్ని విదేశీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీ బ్రాండ్‌ను అంతర్జాతీయ వేదికపై పెంపొందించడమే తమ లక్ష్యమని, SATTE వంటి వేదికల ద్వారా ఏపీ రాష్ట్ర పర్యాటక సంపదను ప్రపంచానికి చూపిస్తున్నామన్నారు. దీనివల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరగడమే కాకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు చేదోడుగా నిలుస్తుందని ఏపీ పర్యాటక శాఖ అధికారులు పేర్కొన్నారు. పర్యాటక మంత్రి కందుల దుర్గేష్, ఉన్నతాధికారులు అజయ్ జైన్, ఆమ్రపాలి కాటల నేతృత్వంలో రాబోయే రోజుల్లో మరిన్ని అంతర్జాతీయ పర్యాటక సదస్సుల్లో పాల్గొని ఏపీ టూరిజాన్ని నంబర్ వన్ స్థానంలో నిలబెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు అధికారులు వెల్లడించారు.
ఏపీటీఏ పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న టూర్ ఆపరేటర్స్ కి న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న ఈ సదస్సులో ఏపీ పెవీలియన్ తరపున పాల్గొనే అవకాశం లభించడమే గాక జాతీయ, అంతర్జాతీయ ఏజెన్సీస్ ను కలిసే అవకాశం దొరకడం విశేషం.. తద్వారా వారి సేవలు మరింత విస్తరించేందుకు వీలు కలుగుతుంది.. ఈ నేపథ్యంలో ఏపీటీఏ పోర్టల్ లో టూర్ ఆపరేటర్లు త్వరితగతిన రిజిస్ట్రేషన్ చేసుకుంటే వారికి ఈ అవకాశం కలుగుతుందని అధికారులు వెల్లడించారు.
