26.3 C
Hyderabad
September 19, 2026
ప్రత్యేకంహోమ్

పేదలకు పట్టాభిషేకం: 28,445 కుటుంబాలకు పట్టాలు

#ChandrababuNaidu

పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొందరు లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. విశాఖ జిల్లాలోని 11 మండలాలకు చెందిన 28,445 కుటుంబాలకు ఇళ్ల స్థలాలపై హక్కులు కల్పిస్తూ పట్టాలు అందించారు. 11 మండలాల్లో 399 ఎకరాల భూమిని క్రమబద్ధీకరించడంతో పాటు మొత్తం 19,33,853 చదరపు గజాల స్థలాన్ని క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి తెలిపారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, తాను ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ, ఈ రోజు లబ్ధిదారుల ముఖాల్లో కనిపిస్తున్న ఆనందాన్ని చూస్తుంటే తన జీవితం ధన్యమైన భావన కలుగుతోందని అన్నారు. 11 మండలాలకు చెందిన 28,445 కుటుంబాలకు నిన్నటి వరకు భూమి ఉన్నప్పటికీ దానిపై హక్కు ఉండేది కాదని, నేటి నుంచి వారు నివసించే ఇళ్లపై సర్వహక్కులు వారికే ఉంటాయని తెలిపారు. పట్టాల పంపిణీ కేవలం ఆస్తి హక్కు కల్పించడం మాత్రమే కాదని, పేదల ఆత్మగౌరవానికి, వారి హక్కులకు, పిల్లల భవిష్యత్తుకు పట్టాభిషేకం చేయడమేనని పేర్కొన్నారు.

చంద్రబాబు మాట్లాడుతున్న సమయంలో సభికులు పెద్ద ఎత్తున ‘జై బాబు’ అంటూ నినాదాలు చేశారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖపట్నం ఒకటని ముఖ్యమంత్రి అన్నారు. అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ద్వారా ఉత్తరాంధ్ర అభివృద్ధి ఆకాంక్షలకు మరింత బలం చేకూర్చామని తెలిపారు. విశాఖను భవిష్యత్తులో విశ్వనగరంగా అభివృద్ధి చేయాలని, ఆ అభివృద్ధి ఫలాల్లో పేదలకు కూడా భాగస్వామ్యం ఉండాలని అన్నారు. అభివృద్ధి ఫలాలను పేదలకు అందించే బాధ్యత తమ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.

ఎల్ నినో ప్రభావంతో విశాఖలో తాగునీటి ఇబ్బందులు

ఎల్‌నినో ప్రభావంతో విశాఖలో కొంతమేర తాగునీటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని చంద్రబాబు తెలిపారు. దేశంలో, రాష్ట్రంలో, ప్రపంచవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని, ప్రస్తుతం 50 శాతం వరకు లోటు వర్షపాతం నమోదవుతోందని చెప్పారు. విశాఖకు వచ్చిన వెంటనే తాగునీటి సమస్యపై సమీక్షించానని, సమస్యను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ద్వారా విశాఖకు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని పేర్కొన్నారు. కొందరు ఈ అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారని, అయితే పోలవరం ద్వారా గోదావరి జలాలను విశాఖకు తీసుకువస్తామని చెప్పారు.

నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా నీటి కొరత లేకుండా చర్యలు చేపడుతున్నామని చంద్రబాబు తెలిపారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా అనకాపల్లికి గోదావరి జలాలను తీసుకువచ్చామని, వాటిని వంశధారకు అనుసంధానిస్తామని చెప్పారు. వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి మార్కాపురానికి నీరు అందిస్తున్నామని తెలిపారు.

గత పాలకులు చెత్త నింపి వెళ్లారు

విశాఖ సుందరమైన నగరమని, దానిని స్వచ్ఛంగా, పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చంద్రబాబు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 145 లక్షల మెట్రిక్ టన్నుల పాత వ్యర్థాలను తొలగించామని తెలిపారు. తిరుమలలో 89.4 శాతం పచ్చదనం ఉందని, విశాఖలో కూడా అదే స్థాయిలో పచ్చదనాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంలో విశాఖ రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.

రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంటే కొందరు విమర్శలు చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. 2019 నుంచి 2024 మధ్య అరాచక పాలన సాగిందని ఆరోపించారు. గత పాలకులు మద్యం వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారని, తిరుమల లడ్డూ విషయంలోనూ అపచారం జరిగిందని విమర్శించారు. భూ వివాదాలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని, విశాఖలో ఇళ్లను జేసీబీలతో కూల్చివేసిన ఘటనలు జరిగాయని ఆరోపించారు.

విశాఖను రాజధానిగా చేస్తామని చెప్పిన గత పాలకులు ఇక్కడే నేరాలు, భూకబ్జాలకు పాల్పడ్డారని చంద్రబాబు ఆరోపించారు. తమకు నచ్చిన భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారని, ఇవ్వడానికి నిరాకరించిన భూములను 22-ఏ జాబితాలో చేర్చారని విమర్శించారు. గత పాలకుల చర్యలతో విశాఖ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు.

విలాసవంతమైన భవనం మాత్రం నిర్మించారు

రుషికొండలో గత ప్రభుత్వం నిర్మించిన భవనాలపై కూడా చంద్రబాబు విమర్శలు చేశారు. రాజుల కాలం పోయినా రుషికొండలో విలాసవంతమైన ప్యాలెస్ నిర్మించారని, ప్రజాధనంతో నిర్మించిన ఆ భవనాలను ఏ విధంగా వినియోగించాలనే అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. వాటి నిర్వహణ కూడా ప్రభుత్వానికి భారంగా మారుతుందని, ప్రజలకు ప్రయోజనం కలిగేలా తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

గత పాలకుల చర్యలను అడ్డుకోవాలనే సంకల్పంతో తాను, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కలిసి పనిచేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. గతంలో భూకబ్జాలకు పాల్పడితే, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పేదలకు పట్టాలు పంపిణీ చేస్తోందన్నారు. నాడు ప్రజలను భయపెట్టారని, నేడు తమ ప్రభుత్వం వారికి భరోసా కల్పిస్తోందని చెప్పారు.

ప్రతి కుటుంబానికి కూటమి ప్రభుత్వం మేలు చేస్తుంటే దాన్ని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. మెగా డీఎస్సీపై తొలి సంతకం చేసి నియామకాలు చేపట్టామని, పారదర్శకంగా నిర్వహించిన ఈ ప్రక్రియలో అవినీతికి ఆస్కారం లేదని అన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకువస్తుంటే కొందరు కోర్టులను ఆశ్రయించి అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. డేటా సెంటర్ల ఏర్పాటును కూడా నీటి కొరత పేరుతో అడ్డుకునేందుకు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు.

విశాఖ అభివృద్ధికి అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నామని చంద్రబాబు తెలిపారు. నగర ప్రజలకు తాగునీరు అందించడంతో పాటు పరిశ్రమలు, కంపెనీలకు అవసరమైన నీటిని అందించే బాధ్యత ప్రభుత్వానిదేనని చెప్పారు. 2024 ఎన్నికల్లో ప్రజలు వేసిన ఓటు ఇప్పుడు వేల కుటుంబాలకు ఆస్తి హక్కును కల్పించిందని అన్నారు. కూటమికి ప్రజలు ఇచ్చిన అధికారం విధ్వంస పాలన నుంచి రాష్ట్రాన్ని రక్షించడంతో పాటు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువస్తోందని పేర్కొన్నారు.

ప్రజలు ఇచ్చిన అధికారంతో రాష్ట్రాభివృద్ధికి ఒక్కో ఇటుక పేర్చుకుంటూ ముందుకు సాగుతున్నామని చంద్రబాబు అన్నారు. పునర్నిర్మాణంలో ఒక్కో అడుగు వేస్తున్నామని, విధ్వంసం నుంచి వికాసం వైపు, భయం నుంచి భరోసా వైపు, నిరాశ నుంచి కొత్త ఆశల వైపు రాష్ట్రాన్ని నడిపిస్తున్నామని తెలిపారు.

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చంద్రబాబు పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరించిందని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న విశాఖ రైల్వే జోన్ కార్యకలాపాలు కూడా ప్రారంభమయ్యాయని చెప్పారు. విశాఖ అభివృద్ధి ఆగకుండా కొనసాగుతుందని స్పష్టం చేశారు. పేదలకు పట్టాల పంపిణీ కార్యక్రమం ద్వారా వారికి ఆస్తి హక్కుతో పాటు ఆత్మగౌరవం, భవిష్యత్తుపై భరోసా కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.

Related posts

సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని చనిపోయిన డీజీపీ

Satyam News

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి!

Satyam News

ద్విచక్రవాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి

Satyam News

భారతీయులకు బ్రిటన్ కొత్త ఇమ్మిగ్రేషన్ నిబంధనలు

Satyam News

ఏపీకి మరో భారీ పరిశ్రమ….. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌

Satyam News

భారత్ నుంచి గల్ఫ్ వెళ్లే విమానాలు రద్దు

Satyam News

Leave a Comment