తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారి హుండీ ఆదాయం ఏటికేడు పెరుగుతూ పోతోంది. వడ్డీ కాసుల వాడికి భక్తులు సమర్పించే కానుకలు పెరుగుతూనే ఉన్నాయి. 2025లో శ్రీవారి హుండీ ఆదాయం 1383 కోట్లకు చేరింది. గత సంవత్సరంతో పోల్చితే ఇది 18 కోట్లు ఎక్కువ. ఏడాది పొడవునా మొత్తం రెండు కోట్ల 61 లక్షల మంది భక్తులు స్వామి వారి దర్శనం చేసుకున్నారు. 2024లో వచ్చిన రెండు కోట్ల 55 లక్షల మంది కంటే.. ఆరు లక్షలు ఎక్కువ. సరాసరిన ప్రతిరోజు 60 వేల నుంచి 80 వేల మంది భక్తులు ఏడుకొండలవాడి దర్శనం చేసుకొంటున్నారు.
2025లో 13 కోట్ల 52 లక్షల లడ్డూలను విక్రయించారు. అంతకు ముందు సంవత్సరం 12 కోట్ల 15 లక్షల లడ్డూల కంటే.. కోటీ 37 లక్షల లడ్డూలను అదనంగా విక్రయించారు. డిసెంబర్ 27న రికార్డు స్థాయిలో ఒక్కరోజే 5 లక్షల 13 వేల లడ్డూలను భక్తులకు అందించారు. శ్రీనివాసుని దర్శనం చేసుకున్న వారికి ఒక లడ్డూని ఉచితంగా ఇస్తారు. లడ్డూ కౌంటర్ల ద్వారా అదనంగా ఎన్ని లడ్డూలైనా కొనుగోలు చేయొచ్చు. నెయ్యి, జీడిపప్పు, ఎండుద్రాక్ష.. ఇతర ముడిసరుకుల నాణ్యత పెంచడంతో లడ్డూల నాణ్యత, రుచి బాగుందని భక్తుల నుంచి స్పందన వస్తోంది. అందుకే భక్తుల సంఖ్య ఆరు లక్షలు పెరిగితే.. అదనంగా కోటీ 37 లక్షల లడ్డూల విక్రయం జరిగింది.
తిరుమల శీవారికి హుండీ ఆదాయంతో పాటు.. టికెట్ల విక్రయం, తలనీలాల వేలం, బ్యాంకుల్లో ఉన్న నగదు నిల్వల ద్వారా వడ్డీ రూపంలో ప్రతి ఏటా వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. 2025 – 26 ఆర్ధిక సంవ్సతరంలో తిరుమల తిరుపతి దేవస్థానం బడ్జెట్ 5 వేల 258 కోట్లు. ఇందులో ఉద్యోగులు.. ఇతర మానవ వనరుల వేతనాలకు 1774 కోట్లు కేటాయించారు. అన్నప్రసాదం, లడ్డూ ప్రసాదం, స్వామి వారి సేవలు, కైంకర్యాలకు అవసరమైన వస్తువుల కొనుగోలుకు 768 కోట్లు వెచ్చిస్తున్నారు. కొండపై రోడ్లు, భవనాలు, తాగు నీరు, మురుగునీటి పారుదల.. ఇతర ఇంజనీరింగ్ పనుల కోసం 350 కోట్లు కేటాయించారు. మరో 800 కోట్లను వివిధ రూపాల్లో పెట్టుబడిగా పెట్టనున్నారు. భక్తుల నుంచి వచ్చిన కానుకల ద్వారా ఆద్యాత్మికతను పెంపొందించడానికి రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాలను నిర్మిస్తున్నారు. వీటికి తోడు దేశంలోని ప్రధాన నగరాలతో పాటు విదేశాల్లోనూ స్వామి వారి ఆలయాలు నిర్మిస్తారు.
