ఇండిగో ఎయిర్‌లైన్స్ తప్పులు.. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మెడకు చుట్టుకొంటున్నాయి. ఇంకా కరెక్ట్‌గా చెప్పాలంటే.. ఈ సంక్షోభాన్ని ఆయన మెడకు తగిలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పైలట్ల పనిగంటల విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలు అమలు చేయడంలో ఇండిగో నిర్లక్ష్యం చేసింది. తీరా గడువు ముగిశాక.. పైలెట్లు అందుబాటులో లేరని చేతులెత్తేసింది. లక్షల మంది ప్రయాణికుల కష్టాలకు ఇండిగో యాజమాన్యం లెక్కలేనితనమే ప్రధాన కారణం. మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా పార్లమెంటులో ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.
ప్రైవేటు కంపెనీ తప్పు చేస్తే.. దాన్ని రామ్మోహన్ నాయుడు అసమర్ధతగా చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇండిగో సమస్యను అడ్డం పెట్టుకొని కొన్ని మీడియా సంస్థలు రామ్మోహన్ నాయుడిని టార్గెట్ చేస్తున్నాయి. ఈ ఒక్క అంశంతోనే రామ్మోహన్ నాయుడు క్రేజ్ మొత్తం పోయిందని హెడ్‌లైన్స్ పెడుతున్నారు. చిన్న వయసులోనే కేంద్ర కేబినెట్ మంత్రి పదవిని చేపట్టిన రామ్మోహన్‌నాయుడుకి.. తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఢిల్లీ స్థాయిలో మనవాడు ఎదుగుతున్నాడంటే ప్రోత్సహించాలి. కానీ పౌర విమానయాన శాఖ మంత్రి పదవి ఇస్తే.. ఆయనకు ప్రాధాన్యత లేని శాఖ ఇచ్చారని అప్పట్లో ప్రచారం చేశారు. ఇప్పుడేమో ఇంత విలువైన, ముఖ్యమైన శాఖను సమర్ధంగా నిర్వహించలేక పోతున్నారని వాళ్లే విమర్శిస్తున్నారు.
రామ్మోహన్‌నాయుడు ఇమేజ్ డ్యామేజ్ అయిందని.. ఆయన ఇప్పటి వరకు సంపాదించుకున్న పేరంతా మట్టిలో కలిసిపోయిందనీ అంటున్నారు. ముఖ్యంగా వైసీపీ అనుకూల మీడియాలో ఇలాంటి కథనాలు వస్తున్నాయి. రామ్మోహన్‌ని వీక్ చేయడం వల్ల రాష్ట్రానికే నష్టం జరుగుతుంది. కానీ వైసీపీకి, ఆ పార్టీని సపోర్ట్ చేసే మీడియాకు.. రాష్ట్ర ప్రయోజనాల కంటే.. రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
150 కోట్ల జనాభా ఉన్న దేశంలో సమస్యలే లేకుండా, రాకుండా చేయడం సాధ్యం కాదు.. సమస్యలు వచ్చినప్పుడు.. వాటిని పరిష్కరించడానికి ఎంత సమర్ధంగా పని చేశారు అనేదే చూడాలి. ఇండిగో సమస్య పరిష్కారంలో రామ్మోహన్‌నాయుడు ఏమాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించ లేదు. రెండో రోజే.. రూల్స్‌ని మార్చి.. ఇండిగోకు వెసులుబాటు కల్పించారు. ఇప్పుడు పరిస్థితులు మెరుగయ్యాయి. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై దృష్టి పెట్టారు. సమస్యను మాత్రమే చూసే వాళ్లకు… పరిష్కారాలు.. అందుకోసం పడే కష్టాలు కనిపించవు.
