33.2 C
Hyderabad
September 30, 2026
జాతీయంహోమ్

లష్కరే ఉగ్రవాదిని కాల్చి చంపిన భద్రతాదళాలు

#Encounter

పహల్గామ్‌ ఉగ్రదాడిలో పాల్గొన్న ఒక ఉగ్రవాదిని భారత భద్రతాదళాలు కాల్చి చంపాయి. జమ్మూకశ్మీర్‌లోని సెంట్రల్‌ కశ్మీర్‌ ఎగువ ప్రాంతాల్లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఈ లష్కరే తోయిబా ఉగ్రవాది హతమయ్యాడు.

ఈ ఎన్ కౌంటర్ లో పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాది మహ్మద్‌ ఆసిఫ్‌ అలియాస్‌ హషీమ్‌ మూసా మృతి చెందినట్లు భారత సైన్యం బుధవారం వెల్లడించింది. ఘటనాస్థలం నుంచి మృతదేహంతో పాటు భారీగా యుద్ధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది.

సెంట్రల్‌ కశ్మీర్‌లోని యూస్‌మార్గ్‌ సమీపంలోని కొరాగ్‌ ప్రాంతంలో మంగళవారం రాత్రి భద్రతా బలగాలు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి. గాలింపు కొనసాగుతున్న సమయంలో అనుమానాస్పద కదలికలను సైనికులు గుర్తించారు. ఉగ్రవాదులను అప్రమత్తం చేసి లొంగిపోవాలని సూచించగా, వారు భద్రతా బలగాలపై కాల్పులు జరిపినట్లు సైన్యం తెలిపింది.

దీంతో ఇరువర్గాల మధ్య తీవ్రంగా ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమైనట్లు తొలుత ప్రకటించిన సైన్యం, బుధవారం ఉదయం గాలింపు చర్యల్లో అతడి మృతదేహాన్ని గుర్తించింది. హతమైన ఉగ్రవాదిని మహ్మద్‌ ఆసిఫ్‌ అలియాస్‌ హషీమ్‌ మూసాగా గుర్తించారు. అతడు పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందినవాడని అధికారులు తెలిపారు.

వీడు యాసిన్ కు అత్యంత సన్నిహితుడు?

ఘటనాస్థలం నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి, ఇతర యుద్ధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మూసా గతంలో ఇదే అటవీ ప్రాంతంలో జరిగిన మరో ఆపరేషన్‌లో హతమైన యాసిర్‌కు సన్నిహిత సహచరుడిగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఈ ఇద్దరూ కలిసి పనిచేసిన ఉగ్రవాద బృందం జమ్మూ ప్రాంతంలో పలు దాడులకు పాల్పడినట్లు భద్రతా వర్గాలు పేర్కొన్నాయి. పూంఛ్‌లోని డేరా కి గలీ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిలో నలుగురు సైనికులు మృతి చెందిన ఘటనతో పాటు, వైమానిక దళ కాన్వాయ్‌పై జరిగిన దాడితోనూ ఈ బృందానికి సంబంధం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

లష్కరే తోయిబా సీనియర్‌ కమాండర్‌ సులేమాన్‌ షాతోనూ యాసిర్‌, మూసాలకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు భద్రతా వర్గాలు వెల్లడించాయి. 2025 జూలైలో శ్రీనగర్‌ శివార్లలోని అటవీ ప్రాంతాల్లో జరిగిన ఆపరేషన్‌లో సులేమాన్‌ షాతో పాటు మరో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఆ ముగ్గురికి పహల్గామ్‌ ఉగ్రదాడితో సంబంధం ఉన్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అనంతరం లోక్‌సభలో వెల్లడించారు. పహల్గామ్‌ దాడిలో 25 మంది పర్యాటకులు, ఒక స్థానికుడు మృతి చెందిన విషయం తెలిసిందే.

తాజాగా మూసా హతమవడంతో ఈ ఉగ్రవాద బృందంలోని మొత్తం నలుగురు సభ్యులు భద్రతా బలగాల ఆపరేషన్లలో మృతి చెందినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ బృందానికి మూసా కమాండర్‌గా వ్యవహరించినట్లు పేర్కొన్నాయి. గతంలో ఈ నలుగురు ఉగ్రవాదుల ఫొటో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది.

ఉగ్రవాద ముఠాలతో అనుబంధం

మూసా, యాసిర్‌లతో పాటు ఈ బృందంలో ఉన్న మరో ఇద్దరు ఉగ్రవాదులు సులేమాన్‌ షా, జునైద్‌ అహ్మద్‌ భట్‌ ఇప్పటికే భద్రతా బలగాల చేతిలో హతమయ్యారు. 2024 అక్టోబర్‌లో గందర్‌బల్‌ సొరంగం వద్ద జరిగిన ఉగ్రదాడిలో సులేమాన్‌ షా, జునైద్‌ అహ్మద్‌ భట్‌ ప్రమేయం ఉన్నట్లు అధికారులు తెలిపారు. అదే ఏడాది గుల్మార్గ్‌ సమీపంలోని బుటాపథ్రీ ప్రాంతంలో జరిగిన దాడిలో యాసిర్‌, మూసాల ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఆ ఘటనలో ఇద్దరు సైనికులు, ఇద్దరు పౌర పోర్టర్లు మృతి చెందారు.

జునైద్‌ అహ్మద్‌ భట్‌ 2024 డిసెంబర్‌లో శ్రీనగర్‌ శివార్లలోని హర్వాన్‌ ప్రాంతంలో భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్‌లో హతమయ్యాడు. తాజా ఎన్‌కౌంటర్‌తో సెంట్రల్‌ కశ్మీర్‌లో ఉగ్రవాదుల కదలికలపై భద్రతా బలగాలు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. కొరాగ్‌–యూస్‌మార్గ్‌ అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు సైన్యం తెలిపింది.

Related posts

గుడివాడలో వేడెక్కిన రాజకీయం

Satyam News

కాంగ్రెస్ ఎన్నికల హామీలన్నీ మోసపూరితమే

Satyam News

అమెరికా రాజీ యత్నాన్ని బూటకం అన్న ఇరాన్

Satyam News

తెలంగాణ జాతిపిత రావి నారాయణ రెడ్డి

Satyam News

సురభి నాటక రంగాన్ని ప్రభుత్వం ప్రోత్సహించాలి

Satyam News

మంత్రి శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం

Satyam News

Leave a Comment