ఒక డాక్టర్ ఆపరేషన్ చేయాలన్నా, ఒక పైలట్ విమానం నడపాలన్నా, చివరికి ఒక చిన్న ఉద్యోగం చేయాలన్నా ఎన్నో ఏళ్ల చదువు, కఠిన శిక్షణ అవసరం. కానీ, దురదృష్టవశాత్తూ కోట్లాది ప్రజల భవిష్యత్తును నిర్ణయించే, దేశాన్ని నడిపించే రాజకీయ నాయకులకు మాత్రం ఎటువంటి అర్హతా ప్రమాణాలు గానీ, అధికారిక శిక్షణ గానీ లేకపోవడం మన వ్యవస్థలోని ఒక పెద్ద వైరుధ్యం.
నేటి తరుణంలో రాజకీయ పార్టీలకు, నాయకులకు, కార్యకర్తలకు వ్యవస్థాగతమైన శిక్షణ అత్యంత ఆవశ్యకం. గతంలో రాజకీయం అంటే కేవలం ప్రజాసేవ అనే భావన ఉండేది. కానీ నేడు అది సంక్లిష్టమైన పాలనా ప్రక్రియగా మారింది, చట్టసభల్లో జరుగుతున్న అర్థం లేని గొడవలు, వ్యక్తిగత దూషణలు, సోషల్ మీడియాలో కార్యకర్తల మధ్య జరుగుతున్న అసభ్యకరమైన యుద్ధాలు చూస్తుంటే… రాజకీయ వ్యవస్థలో ‘పరిణతి’ లోపించిందని స్పష్టమవుతోంది. ఈ లోపాన్ని సరిదిద్దడానికి ‘శిక్షణ’ ఒక్కటే మార్గం.
కార్యకర్తలకు దిశానిర్దేశం
ఏ పార్టీకైనా కార్యకర్తలే వెన్నెముక. కానీ చాలా సందర్భాల్లో వారికి పార్టీ జెండా మోయడం తప్ప, పార్టీ ఎజెండా (సిద్ధాంతం) ఏంటో తెలియడం లేదు. కేవలం భావోద్వేగాలను రెచ్చగొట్టి వారిని వాడుకోవడం కాకుండా, వారికి రాజకీయ విజ్ఞానాన్ని అందించాలి. ప్రజలతో ఎలా మమేకం కావాలి? సోషల్ మీడియాను బాధ్యతాయుతమైన ప్రచార అస్త్రంగా ఎలా వాడాలి? ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు ఎలా తీసుకెళ్లాలి? అనే అంశాలపై కార్యకర్తలకు శిక్షణ ఇస్తే, వారు రాజకీయ రౌడీలుగా కాకుండా, సామాజిక సేవకులుగా తయారవుతారు.
కేవలం ధనబలం, వారసత్వం ఉంటే నాయకులు కాలేరు. చట్టసభల్లో (అసెంబ్లీ/పార్లమెంట్) అడుగుపెట్టే నాయకులకు రాజ్యాంగం, బడ్జెట్ కేటాయింపులు, చట్టాల రూపకల్పనపై కనీస అవగాహన ఉండాలి. అధికారుల నుండి పని రాబట్టుకోవడం, ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపడం ఒక కళ. ఈ నైపుణ్యాలు అబ్బాలంటే నాయకులకు నాయకత్వ శిక్షణ తప్పనిసరి. సమస్యను వినడం, సహనంతో సమాధానం చెప్పడం వంటివి శిక్షణ ద్వారానే అలవడతాయి.
సంస్కరణ దిశగా అడుగులు
పాశ్చాత్య దేశాల్లో రాజకీయాల్లోకి రావాలనుకునే వారికి ప్రత్యేక కోర్సులు, స్కూల్స్ ఉంటాయి. మన దేశంలో కూడా ప్రతి రాజకీయ పార్టీ తమ నిధుల్లో కొంత శాతాన్ని ‘శిక్షణ, పరిశోధన’ కోసం తప్పనిసరిగా కేటాయించాలి, ఎన్నికల సమయంలో మాత్రమే కాకుండా, ఇది ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనైనా, విభజన తర్వాతైనా…. రాజకీయ కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడంలో తెలుగుదేశం పార్టీ ఒక ప్రత్యేకమైన ఒరవడిని సృష్టించింది. ఒక కార్పొరేట్ సంస్థ తమ ఉద్యోగులకు ఎలాగైతే శిక్షణ ఇస్తుందో, పార్టీ క్యాదర్కు కూడా అదే స్థాయిలో శిక్షణ ఇవ్వడం ఆ పార్టీ ప్రత్యేకత.
మన తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ శిక్షణ గురించి మాట్లాడితే ముందుగా గుర్తుకు వచ్చేది తెలుగుదేశం పార్టీ. 1982లో ఎన్టీఆర్ పార్టీ స్థాపించినప్పుడు చైతన్యం తీసుకువస్తే, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఆ చైతన్యానికి ‘శిక్షణ’ను జోడించారు. పార్టీ కార్యాలయాన్ని (ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్) కేవలం రాజకీయ చర్చలకే కాకుండా, నాయకత్వ శిక్షణా కేంద్రంగా మార్చారు. ప్రతి ఏటా జరిగే ‘మహానాడు’ కేవలం సభలా కాకుండా, తీర్మానాలపై కార్యకర్తలకు అవగాహన కల్పించే ఒక పెద్ద వర్క్ షాప్ లాగా జరుగుతుంది.
టెక్నాలజీలో శిక్షణ
పార్టీ సభ్యత్వ నమోదు దగ్గరి నుంచి, ట్యాబ్ల వాడకం, జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహణ, డేటా విశ్లేషణ వంటి సాంకేతిక అంతాల్లో బూత్ స్థాయి కార్యకర్తకు కూడా శిక్షణ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదే. నియోజకవర్గ స్థాయి నుంచి
రాష్ట్ర స్థాయి వరకు నాయకులకు కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రజా సమస్యల విశ్లేషణపై తరచూ క్లాసులు నిర్వహించడం వల్ల… తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో విషయ పరిజ్ఞానం ఎక్కువగా కనిపిస్తుంది.
కేస్ స్టడీగా లోకేష్ పంథా
గతంలో పార్టీ శిక్షణ అంటే మైకుల ముందు ఉపన్యాసాలు దంచడమే అనుకునేవారు. కానీ, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆ పంథాను పూర్తిగా మార్చేశారు తన కార్పొరేట్, విదేశీ విద్యా అనుభవాన్ని జోడించి రాజకీయ శిక్షణను “హైటెక్’గా తీర్చిదిద్దారు. డేటా ఆధారిత రాజకీయం: కార్యకర్తలకు కేవలం ఉద్వేగం ఉంటే సరిపోదు, చేతిలో సమాచారం (డేటా) ఉండాలని యువనేత లోకేష్ బలంగా నమ్ముతారు. అందుకే కార్యకర్తలకు ట్యాబ్లు ఇచ్చి, ఓటర్ల డేటాను ఎలా విశ్లేషించుకోవాలో, పోలింగ్ సరళిని ఎలా గమనించాలో సాంకేతిక శిక్షణ ఇప్పించారు.
డిజిటల్ సైన్యం (ఐటీడీపీ); సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను తిప్పికొట్టడానికి యువ కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణా శిబిరాలు నిర్వహించారు. కంటెంట్ క్రియేషన్, డిజిటల్ క్యాంపెయినింగ్ వంటి అంశాల్లో వారికి మెళకువలు నేర్పించారు.
కోవిడ్ సమయంలో గానీ, ఇతర క్లిష్ట సమయాల్లో గానీ… ‘జూమ్’ వంటి ప్లాట్ఫామ్స్ ద్వారా వేల మంది కార్యకర్తలతో ఒకేసారి సమావేశమై, వారికి దిశానిర్దేశం చేయడం లోకేష్ తీసుకొచ్చిన కొత్త సంప్రదాయం. కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగుల పనితీరును సమీక్షించినట్లుగానే… టెక్నాలజీ సాయంతో నాయకుల, కార్యకర్తల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించి (ఐవీఆర్ఎస్, సర్వేల ద్వారా), వెనుకబడిన వారికి మెరుగైన శిక్షణ ఇచ్చే పద్ధతిని ఆయన అమలు చేస్తున్నారు. ຜີ MIT School of Government’ భారతీయ చాత్ర సంసద్ (Student Parliament) శిక్షణ ఇస్తోంది. ఇలాంటివి ప్రతి రాష్ట్రంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో జరగాలి.
శిక్షణ లేకపోతే జరిగే అనర్థాలు..
గ్రామీణస్థాయిలో మహిళా సర్పంచ్లు గెలిచినా, వారికి శిక్షణ లేకపోవడం వల్ల వారి భర్తలే పెత్తనం చెలాయిస్తున్నారు. సరైన శిక్షణ ఇస్తే, ఆ మహిళా నాయకురాలు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగలదు. ఒక మంత్రికి తనశాఖపై, చట్టాలపై పట్టులేకపోతే, ఐఏఎస్ అధికారులు రాసిచ్చిన స్క్రిప్టును మాత్రమే చదువుతారు. శిక్షణ పొందిన నాయకుడు అయితే, అధికారులను ప్రశ్నించి, ప్రజలకు మేలు జరిగేలా విధానాలను మార్చగలడు.
రాజకీయం అంటే అధికారం చెలాయించడం కాదు, ప్రజలకు జవాబు దారీగా ఉండటం అని నేర్పించ గలిగితేనే మన ప్రజాస్వామ్యం పరిణతి చెందుతుంది. ఆయుధాలు లేని సైనికుడు యుద్ధంలో ఎలా ఓడిపోతాడో, విషయ పరిజ్ఞానం లేని నాయకుడు కూడా పాలనలో విఫలమవుతాడు. అందుకే… రాజకీయాలకు ‘క్లాస్’ కావాలి, అప్పుడే పాలనలో ‘క్వాలిటీ’ పెరుగుతుంది. దేశప్రగతికి అది బలమైన పునాది అవుతుంది.
ఎస్ పి సాహెబ్, టీడీపీ అధికార ప్రతినిధి
