ఏపీలో ప్రతి నెలా ఒకటో తారీఖున పండుగ వాతావరణం నెలకొంటుంది. నెలకోసారి జరిగే ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం.. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పండుగలా సంతోషాన్ని తీసుకొస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా లబ్దిదారులకు అత్యధిక మొత్తాన్ని అందిస్తోంది. వృద్ధులు, వితంతులకు 4 వేలు.. దివ్యాంగులకు నెలకు ఆరు వేలు చొప్పున అందిస్తున్నారు. భారత్‌లో మరే రాష్ట్రంలోనూ ఈ స్థాయిలో పెన్షన్లు ఇవ్వడం లేదు. ఇంకా చెప్పాలంటే ఒకటి రెండు రాష్ట్రాలు మినహా.. మిగిలిన చోట్ల సామాజిక పెన్షన్లు 2 వేల లోపే ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ తర్వాత హర్యానాలో అత్యధికంగా 3 వేల రూపాయల పెన్షన్ ఇస్తున్నారు. ఢిల్లీలో 60 ఏళ్లు దాటిన వారికి 2 వేలు.. 80 సంవత్సరాలు పైబడిన వారికి 2 వేల 500 రూపాయల వరకు ఇస్తున్నారు. రాజస్థాన్‌లో వెయ్యి నుంచి పదిహేనువందలు.. మధ్యప్రదేశ్‌లో 600 నుంచి 1200 వరకు పంచుతున్నారు. ఇక కేరళలో 1600, తమిళనాడులో 1200, పశ్చిమ బెంగాల్‌లో వెయ్యి రూపాయలను సామాజిక పెన్షన్ల పథకం ద్వారా అందిస్తున్నారు. మన పొరుగు రాష్ట్రం తెలంగాణలో ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ మొత్తం 2 వేల రూపాయలు. అక్కడ పెన్షన్లను 3 వేలకు పెంచుతామని హామీ ఇచ్చినా.. ఇంకా అమల్లోకి రాలేదు.
గతంలో ఏదైనా కారణంతో ఒక నెల పెన్షన్ తీసుకోవడం మిస్ అయితే.. తర్వాత ఇచ్చే వారు కాదు. కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో.. 3 నెలల వరకు ఒకేసారి పెన్షన్ తీసుకొనే సౌలభ్యం కల్పిస్తున్నారు. గ్రామ సచివాలయం సిబ్బంది ద్వారా.. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు వారి ఇంటి వద్దనే పెన్షన్లు అందించే ఏర్పాటు చేశారు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన 19 నెలల్లోనే సామాజిక పెన్షన్ల రూపంలో.. రాష్ట్రం ప్రభుత్వం సుమారు 51 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా ప్రతి ఏడాది వృద్ధులకు 48 వేలు, డయాలసిస్ రోగులకు ఒక లక్షా 20 వేలు, మంచానికే పరిమితమైన దీర్ఘకాలిక రోగులకు ఒక లక్షా 80 వేల రూపాయలు అందిస్తున్నారు. అందుకే ఎన్టీఆర్ భరోసా పథకం దేశంలోనే అతి పెద్ద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ స్కీమ్‌గా రికార్డు సృష్టించింది.
