వరంగల్హోమ్

రెండో అతిపెద్ద మెడికల్ హబ్‌ గా వరంగల్‌

#KondaSurekha

వరంగల్‌ను తెలంగాణలోనే రెండో అతిపెద్ద మెడికల్ హబ్‌ (Medical Hub) గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తున్నదని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని సూపర్ స్పెషాలిటి హాస్పిటల్ పురోగతి, ఇతర ప్రభుత్వ హాస్పిటల్స్, వాటి అనుబంధ సంస్థల అభివృద్ధి, అత్యాధునిక సాంకేతికత వినియోగం, మౌలిక వసతుల కల్పన, వైద్య సేవల విస్తరణ, ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలను అందిచడం మొదలైన అంశాల పై  రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తో  కలిసి వారి కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి సురేఖ పాల్గొన్నారు.

ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్ రెడ్డి, కడియం శ్రీహరి, నాగరాజు, నాయిని రాజేందర్ రెడ్డి, వైద్యరోగ్య శాఖ సెక్రటరీ క్రిస్టినా చోంగ్తూ, పలువురు వైద్యారోగ్య శాఖ అధికారులు  తదితరులు ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.

సిబ్బంది రిక్రూట్ మెంట్ పై సమీక్ష

వరంగల్ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి పనుల పురోగతి, ఎంజిఎం హాస్పిటల్, సికెఎం ప్రభుత్వ మెటర్నిటి హాస్పిటల్, ప్రభుత్వ ఆయుర్వేదిక్ టీచింగ్ హాస్పిటల్, నర్సంపేట గవర్నమెంట్  జనరల్ హాస్పిటల్,  ప్రభుత్వ ప్రాంతీయ కంటి హాస్పిటల్, కాకతీయ మెడికల్ కాలేజీ తదితర ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వైద్య సంస్థలు, వాటి అనుబంధ కార్యాలయాల అభివృద్ధి పనులు, సిబ్బంది భర్తీ, వీటికి సంబంధించి ఎమ్మెల్యేలు చేసిన ప్రతిపాదనల పై తదితర అంశాల పై మంత్రులిద్దరూ సమగ్రంగా సమీక్షించారు.

సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యవసర విభాగం, డయాలసిస్, క్యాథ్‌ల్యాబ్, ఆక్సిజన్ సదుపాయాలు, ఆధునిక వైద్య పరికరాలు అమర్చడంతో పాటు అవసరమైన సిబ్బంది నియామకంపై ప్రత్యేక దృష్టి సారించాలని, పనులను త్వరితగిన పూర్తి చేసి ఎంజిఎం హాస్పిటల్ పై ఒత్తిడిని తగ్గించాలని మంత్రులు అధికారులకు సూచించారు.

ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్ రెడ్డి, కడియం శ్రీహరి, నాగరాజు, నాయిని రాజేందర్ రెడ్డి చేసిన పలు ప్రతిపాదనలను, సూచనలను పరిగణలోకి తీసుకుని ఉమ్మడి వరంగల్ జిల్లాలో వైద్యారోగ్య సౌకర్యాల బలోపేతమే లక్ష్యంగా కార్యాచరణను అమలుచేయాలని మంత్రులు అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా ఎంజిఎం, సికెఎం హాస్పిటల్స్, హనుమకొండ ప్రభుత్వ మెటర్నిటి హాస్పిటల్ లో ఐపి, ఓపి, సిబ్బంది, సౌకర్యాలు, ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రి దామోదర రాజనర్సింహా సంబంధిత అధికారులను ఆరా తీశారు. వరంగల్ సూపర్ స్పెషాలిటి హాస్పిటల్ భవన నిర్మాణం ఇప్పటికే దాదాపు పూర్తికావడంతో, ఆధునిక పరికరాల అమరిక, ల్యాండ్‌స్కేపింగ్, హాస్పిటల్ అంతర్గత రహదారుల నిర్మాణాన్ని నిర్ణీత గడువులోగా పూర్తి చేసి ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రులు వైద్యారోగ్య శాఖ సెక్రటరీ క్రిస్టినా చోంగ్తూను ఆదేశించారు.

సమస్యల పరిష్కారానికి మంత్రుల సూచనలు

ఉమ్మడి వరంగల్ జిల్లా వైద్యారోగ్య వ్యవస్థ బలోపేతమే లక్ష్యంగా ఇరువురు మంత్రులు వైద్యారోగ్యశాఖ అధికారులకు పలు సూచనలు చేశారు. హాస్పిటల్స్  అవసరాలు, సమస్యలు, అభివృద్ధి పనుల పురోగతిపై మంత్రులు వైద్యారోగ్య శాఖ అధికారులను ఆరా తీశారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని పలు సూచనలు చేశారు.

ఎంజీఎం ఆసుపత్రిలో రోజురోజుకూ పెరుగుతున్న రోగుల సంఖ్యకు అనుగుణంగా వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని, ఉద్యోగుల ప్రమోషన్ల పై చర్యలు చేపట్టాలని మంత్రి కొండా సురేఖ వైద్యారోగ్య శాఖ మంత్రిని కోరారు. పాత భవనాల మరమ్మతులు, విద్యుత్, ప్లంబింగ్, భద్రతా వ్యవస్థల బలోపేతంతో పాటు కొత్త వైద్య పరికరాల కొనుగోలుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని విజ్ఞప్తి చేశారు.

అలాగే ప్రాంతీయ కంటి ఆసుపత్రిలో ఖాళీ పోస్టుల భర్తీ, ఆధునిక నేత్ర వైద్య పరికరాల సమకూర్పు, శిక్షణా సదుపాయాలకు సంబంధించిన కార్యాచరణను వేగవంతం చేయాలన్నారు. అదే విధంగా కాకతీయ మెడికల్ కాలేజ్ లో పెరిగిన ఎంబిబిఎస్, పీజీ సీట్లకు తగినట్లుగా విద్యార్థుల హాస్టళ్లు, అకాడమిక్ భవనాలు, ఆడిటోరియంను తీర్చిదిద్దాలని, ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని మంత్రి సురేఖ కోరారు.

వీటితో పాటు నర్సంపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, మెడికల్ కాలేజీ, సీకేఎం ప్రసూతి ఆసుపత్రి, వర్ధన్నపేట ఏరియా హాస్పిటల్, అనంత లక్ష్మీ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, ప్రభుత్వ ఆయుర్వేదిక్ టీచింగ్ హాస్పిటల్, జిల్లాలోని పీహెచ్‌సిలు, అర్బన్ హెల్త్ సెంటర్లలో నిధుల కేటాయింపు, మౌలిక వసతులు, సిబ్బంది కొరతపై సమావేశంలో ప్రస్తావించారు.

ఆధునిక వైద్య పరికరాలను సమకూర్చాలి

ఈ మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కళాశాలల మౌలిక వసతుల అభివృద్ధి, సిబ్బంది భర్తీ, ఆధునిక వైద్య పరికరాల సమీకరణ తదితర అంశాలపై ప్రతిపాదనలను మంత్రి కొండా సురేఖ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గారికి సమర్పించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద మెడికల్ హబ్ గా ఆవిర్భవిస్తున్నందున వైద్యారోగ్య సేవల పర్యవేక్షణ, సమన్వయం కోసం స్పెషల్ ఆఫీసర్ ను నియమించే దిశగా చర్యలు చేపట్టాలని  మంత్రి కొండా సురేఖ కోరారు.

‘గ్రీన్ హాస్పిటల్స్’ లక్ష్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించి, పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను అమలు చేయాలని మంత్రి కొండా సురేఖ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ని కోరారు. సీకేఎం ఆసుపత్రిలో పేరుకుపోయిన స్క్రాప్‌ (వ్యర్థ సామగ్రి) ను పూర్తిగా తొలగించి, అందుబాటులోకి వచ్చే స్థలాన్ని ఆసుపత్రి అవసరాలకు వినియోగించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కొండా సురేఖ విన్నవించారు.

ఎంజిఎం, సికెఎం హాస్పిటల్స్ కు వున్న చారిత్రక ప్రాధాన్యత దృష్ట్యా వాటి ఉద్ధరణకు సమగ్ర చర్యలు చేపట్టాలని కోరారు. సికెఎం హాస్పిటల్ కు అనుబంధంగా పనిచేస్తున్న ఉర్సు మెటర్నిటి హాస్పిటల్ లో సౌకర్యాల పెంపు పై దృష్టి పెట్టాలని మంత్రి సురేఖ అధికారులకు సూచించారు.

వరంగల్ జిల్లాలోని ప్రతీ ప్రభుత్వ వైద్య సంస్థ ప్రజలకు ఒక నమ్మకమైన ఆరోగ్య కేంద్రంగా మారాలని మంత్రి కొండా సురేఖ వైద్యారోగ్య శాఖ అధికారులకు సూచించారు. వైద్య సేవల నాణ్యత పెంచడంలో గానీ, అవసరమైన మౌలిక వసతులు, సిబ్బంది, ఆధునిక పరికరాల కల్పనలో గానీ ఎలాంటి లోటు ఉండకూడదని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన ఉచిత వైద్యం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని, సీఎం రేవంత్ రెడ్డి ఆశయాల మేరకు ప్రజల ఆరోగ్య అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆ మేరకు చిత్తశుద్ధితో కార్యాచరణను అమలుచేయాలని మంత్రి సురేఖ అధికారులకు నిర్దేశించారు.

Related posts

భద్రాచల శ్రీ రాముడి దేవాలయ పునర్నిర్మాణం మొదలు

Satyam News

యువత గొంతు నొక్కితే బీజేపీ రాజకీయ పతనం తప్పదు

Satyam News

తహసీల్దార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు

Satyam News

ట్రంప్ విధానాలపై అమెరికా లో నిరసనల హోరు

Satyam News

‘ఆత్మరక్షణ’ పేరుతో మళ్లీ అమెరికా దాడులు

Satyam News

రాజమండ్రి జైలు నుంచి అంబటి రాంబాబు తరలింపు

Satyam News

Leave a Comment