2036లో ఒలింపిక్ క్రీడలు నిర్వహించేందుకు భారత పోటీ పడుతున్న వేళ, ఆ అవకాశం వస్తే ఒలింపిక్స్ నిర్వహణకు అత్యంత అనువైన ప్రదేశంగా అమరావతిలోని ప్రతిపాదిత స్పోర్ట్స్ సిటీని అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రపంచ స్థాయి క్రీడా వేదికగా అమరావతిని తీర్చిదిద్దడంతో పాటు, రాజధాని పరిధిలో మౌలిక వసతులు, విద్యా సంస్థలు, ప్రాజెక్టుల కేటాయింపులపై CRDA సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఈ సమావేశంలో అమరావతిలో భూముల వినియోగంపై సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రైతులకు లేఔట్లు, ప్రధాన మౌలిక వసతులు, ప్రభుత్వ భవనాల నిర్మాణం పోగా CRDA వద్ద ప్రస్తుతం 3,800 ఎకరాలు మాత్రమే అందుబాటులో ఉందని, ఆ భూమిని అత్యంత పొదుపుగా వాడుకోవాలని పేర్కొన్నారు. ఇకపై వివిధ సంస్థలకు భూకేటాయింపులను ఆచితూచి చేయాలని ఆదేశించారు. అమరావతి ఔటర్ రింగ్‌రోడ్డు ORR అందుబాటులోకి వస్తే హైదరాబాద్ తరహాలోనే చుట్టుపక్కల శాటిలైట్ టౌన్‌షిప్‌లు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. ఒకప్పుడు హైటెక్ సిటీ ప్రాంతంలో ఎకరం రూ.లక్షల్లో ఉండేదని, ఇప్పుడు రూ.250 కోట్ల వరకు పలుకుతోందని గుర్తు చేస్తూ.. భవిష్యత్తులో అమరావతి భూములకూ అదే స్థాయిలో విలువ పెరుగుతుందన్నారు చంద్రబాబు.
రాజధాని ప్రాంతంలో మౌలిక వసతుల అభివృద్ధికి CRDA భారీగా నిధులు మంజూరు చేసింది. శాఖమూరు వద్ద రూ.596 కోట్లతో సెంట్రల్ లైబ్రరీ, ఆడిటోరియం, హెచ్‌ఆర్ భవనాల నిర్మాణానికి అనుమతి ఇవ్వగా, రాజధానిలోని 29 గ్రామాల్లో రోడ్లు, డ్రెయిన్లు, యూజీడీ, తాగునీరు, విద్యుత్ వ్యవస్థల కోసం రూ.533 కోట్లు వెచ్చించేందుకు ఆమోదం తెలిపింది. రాజధాని గ్రామాల్లోని ప్రజలకు తలసరి 135 లీటర్ల తాగునీరు అందించేలా కొత్త పైప్‌లైన్లు వేస్తారు.
మరోవైపు అమరావతిలో విద్యా, వాణిజ్య విభాగానికి భూకేటాయింపులు చేపట్టారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డీమ్డ్ వర్సిటీకి 8.5 ఎకరాలు, మిక్స్‌డ్‌యూజ్ ప్రాజెక్టుల కోసం పిచ్చుకలపాలెం, తుళ్లూరు, మందడం, కురగల్లు గ్రామాల్లో మొత్తం 42 ఎకరాల కేటాయింపునకు అనుమతించారు. హోటళ్లు, అంతర్జాతీయ పాఠశాలలు తమ పక్కనున్న చిన్న చిన్న స్థలాలను పొందాలంటే బేసిక్ విలువపై 250 శాతం చెల్లిస్తే భూమి కేటాయించేందుకు అంగీకరించారు. ఇవే కాకుండా ఇన్నర్ రింగ్ రోడ్డు పరిధిలోకి వచ్చే తాడికొండ, కంతేరు భూములను భూసమీకరణ కింద తీసుకునేందుకు, రెండో దశ భూసమీకరణ రైతు కుటుంబాలకు రూ.1.50 లక్షల చొప్పున రుణమాఫీ చేసేందుకు CRDA అనుమతినిచ్చింది.
