వెనిజులా అధ్యక్షుడు నికోలాస్ మదురో అమెరికా అధ్యక్షుడు టార్గెట్ చేయడం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే తప్ప మాదక ద్రవ్యాలకు, శాంతి భద్రతలకు సంబంధించి అంశం కాదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా వెనిజులా వివాదం వెనుక ఉన్నది ఒక లోతైన రాజకీయ శక్తుల పోరు.
లాటిన్ అమెరికాను చారిత్రకంగా తన ప్రభావ పరిధిగా భావించిన అమెరికాకు, వెనిజులా లాంటి దేశం స్వతంత్ర విదేశీ విధానాన్ని అనుసరించడం ఎప్పటినుంచో అసౌకర్యాన్ని కలిగిస్తోంది. హ్యూగో చావేజ్ కాలంలో ప్రారంభమైన అమెరికా వ్యతిరేక రాజకీయ ధోరణి మదురో హయాంలో కొనసాగుతూ వస్తున్నది. అది కేవలం మాటలకే పరిమితం కాకుండా విధానాల రూపంలో కూడా వ్యక్తమవుతోంది.
దాంతో వెనిజులా ను అదుపు చేయడానికి అమెరికా కుట్రలు పన్నుతూ వచ్చింది. దానికితోడు మదురో పాలన ప్రజాస్వామ్య ప్రమాణాలకు అనుగుణంగా లేదన్న విమర్శలు ఉన్నాయి. ఎన్నికల నిర్వహణ, ప్రతిపక్షంపై ఆంక్షలు, ప్రభుత్వ సంస్థలపై నియంత్రణ వంటి అంశాలపై దేశీయంగా, అంతర్జాతీయంగా ప్రశ్నలు తలెత్తాయి. అయితే, ఇవే అంశాలను ప్రస్తావిస్తే అమెరికా చర్యలను సమర్థించే వీలు లేదు. అది ఆ దేశ అంతర్గత వ్యవహారం.
వెనిజులాకు ఉన్న విస్తారమైన చమురు వనరులు, వాటిపై ప్రభుత్వ నియంత్రణ కొనసాగడం, అమెరికా, పశ్చిమ దేశాల కార్పొరేట్ ప్రయోజనాలకు అనుకూలంగా లేకపోవడం ఈ విభేదానికి ప్రధాన రాజకీయ నేపథ్యంగా నిలుస్తోంది. అంతేకాదు, మదురో ప్రభుత్వం రష్యా, చైనా, ఇరాన్‌లతో సన్నిహిత సంబంధాలు పెంచుకోవడం అమెరికా వ్యూహాత్మక ఆందోళనలను మరింత పెంచింది.
అమెరికా తన సమీప ప్రాంతంలో ప్రత్యర్థి శక్తులు పట్టు సాధించడం భద్రతా సమస్యగా చూస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆర్థిక ఆంక్షలు, దౌత్య ఒత్తిళ్లు, ప్రతిపక్షానికి బహిరంగ మద్దతు వంటి చర్యలకు గతంలోనే అమెరికా దిగింది. ఇవి నేరుగా ప్రభుత్వాన్ని కూల్చడంకంటే, వ్యవస్థను బలహీనపరచి మార్పుకు దారితీయాలన్న ఉద్దేశంతో అమలవుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ పరిణామాలను చూస్తే, వెనిజులా సంక్షోభాన్ని ‘నియంత పాలనకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పోరాటం’ అనే సరళమైన కథగా మాత్రమే చూపడం వాస్తవానికి దూరంగా ఉంటుంది. ఇది ఒక దేశ అంతర్గత పాలనా లోపాలకన్నా ఎక్కువగా, ప్రపంచ రాజకీయాల్లో శక్తి సమతుల్యత, ఆర్థిక వనరుల నియంత్రణ, భూభౌగోళిక ప్రభావం వంటి అంశాల మధ్య జరుగుతున్న పోరాటం.
మదురో వ్యక్తి కన్నా, ఆయన ప్రతినిధ్యం వహిస్తున్న రాజకీయ ధోరణి, అనుసరిస్తున్న స్వతంత్ర వైఖరే అమెరికా చర్యల ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. అంతే తప్ప మాదక ద్రవ్యాలు, ఇతర కేసులు అంటూ అమెరికా చెబుతున్నదంతా బూటకమేనని అనుకోవాల్సి వస్తోంది.
