30.9 C
Hyderabad
September 10, 2026
ప్రత్యేకంహోమ్

రివ్యూలు కాదు… రిజల్ట్స్ కావాలి

#Collectors

శాఖలు, అంశాలపై గంటల తరబడి రివ్యూలు చేయడం కాదు… రిజల్ట్స్ కావాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లను.. అధికారులను నిర్దేశించారు. రాష్ట్ర సచివాలయంలో 8వ జిల్లా కలెక్టర్ల సమావేశం సీఎం చంద్రబాబు అధ్యక్షతన ప్రారంభమైంది.

గురువారం తొలిరోజు సమావేశంలో జిల్లా కలెక్టర్లకు… అధికారులకు వివిధ అంశాలపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ప్రజా సేవకులుగా ఉందాం… ఈగోలు వద్దు అంటూ కలెక్టర్లకు సూచించారు. గత సమావేశంలో నిర్ణయాలపై యాక్షన్ టేకెన్ రిపోర్టులు ఇక నుంచి తప్పనిసరి కావాలన్నారు.

ఓనర్షిప్ తీసుకోగలిగితేనే… లీడర్షిప్ ఇవ్వగలరంటూ అంటూ మంత్రులకు, అధికారులకు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…”27 నెలల్లో అనేక వ్యవస్థాగత మార్పులు చేశాం. ఆ ఫలితాలు కనిపిస్తున్నాయి. 28 కొత్త పాలసీలతో అవకాశాలను అన్ లాక్ చేశాం. రియాక్టివ్ గవర్నెన్స్ నుంచి ప్రో యాక్టీవ్ గవర్నెన్స్‌కు వెళ్లాలి.

ఫైల్ పెండింగ్ అంటే అభివృద్ధి పెండింగే. ఫిర్యాదు పెండింగ్ అంటే ప్రజలకు న్యాయం పెండింగ్. విజన్ ఉన్నా.. దాన్ని అమలు చేయకుంటే… అవి నెరవేరని ఆశలుగానే మిగిలిపోతాయి. ఇప్పుడు కాలం మారింది… పనిచేస్తేనే సరిపోదు.. ఫేక్ ప్రచారాలకు కౌంటర్ కూడా ఇవ్వాలి.

ఫేక్ ప్రచారం చేస్తుంటే లీడ్ తీసుకుని రియాక్ట్ అవ్వాలి. ప్రభుత్వాన్ని మభ్యపెట్టే నివేదికలు వద్దు…వాస్తవాలు చెప్పాలి. రెండు రోజుల కలెక్టర్ల కాన్ఫరెన్స్ మొత్తంగా 12 గంటలు జరుగుతుంది… ఇది చాలా కీలకం. సమస్యను దాచిపెడితే పెద్దది అవుతుంది… ఓపెన్‌గా చర్చిస్తే పరిష్కారం లభిస్తుంది. సాధారణ పరిపాలన కాదు… ప్రజలు మెచ్చే సుపరిపాలన కావాలి. శాఖలు పోటీ పడాలి.

జిల్లాలు పోటీ పడాలి. సెక్రటరీలు పోటీ పడాలి, కలెక్టర్లు పోటీ పడాలి. బెస్ట్ ప్రాక్టీసెస్ షేర్ చేసుకుందాం…బెస్ట్ పాలసీలు అమలు చేద్దాం. వన్ స్టేట్-వన్ విజన్-వన్ టీమ్-వన్ మిషన్… అదే స్వర్ణాంధ్ర.”అని ముఖ్యమంత్రి అన్నారు.

టీమ్ సక్సెస్‌తోనే అభివృద్ధి

“ఈసారి లీడర్షిప్ అంశంపై కలెక్టర్ల సదస్సులో ప్రత్యేకంగా చర్చించాలి. కొన్ని చోట్ల లీడర్షిప్ లోపం ఉంది. ఉద్యోగుల సామర్ధ్యం పెంపు కోసం వివిధ కోర్సులు కూడా నిర్వహిస్తున్నాం. ఇప్పటి వరకూ 1.50 కోట్ల కోర్సులను సామర్ధ్యాలను పెంచేందుకు నిర్వహించాం.

డీప్ టెక్ గవర్నెన్స్ ఉంటే అనూహ్యమైన ఫలితాలను సాధించేందుకు అవకాశం ఉంది. టెక్నాలజీని వినియోగించడం ద్వారా డేటా లేక్, అవేర్ లాంటి వ్యవస్థలతో నిర్ణయాల్లో వేగం పెరగాలి… సేవల్లో నాణ్యత పెంచాలి. గతంలో 50 ఏళ్లలో చేసే అభివృద్ధిని ఇప్పుడు 10-15 ఏళ్లలోనే సాధించేందుకు ఆస్కారం ఉంది. మనకు వనరులు ఉన్నాయి.

టెక్నాలజీ  అందుబాటులో ఉంది. రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగంగా 27 నెలల్లో రాష్ట్ర ఆర్ధికవ్యవస్థను గాడిన పెట్టాం. రూ.1.40 లక్షల కోట్లు సంక్షేమానికి, రూ.1.50 లక్షల కోట్లు అభివృద్ధికి ఖర్చు చేశాం. రాయలసీమ రైజింగ్, కోస్తాంధ్ర భవిష్యత్ కొత్త పుంతలు, ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు పేరిట ప్రగతి కార్యక్రమాలు చేపట్టాం. హంద్రీనీవా, వెలిగొండ ఫేజ్ -1, పోలవరం ఎడమ కాలువ, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టులు పూర్తిచేశాం.

పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికల్లా పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డును పూర్తి చేసి గుంటూరు, విజయవాడకు రాజధానిని కనెక్ట్ చేశాం. ఎకనామిక్ టైమ్స్ పత్రిక సీఈఓ టూ వాటర్‌మాన్ అంటూ కథనం రాసింది. సంతోషం కలిగింది.

గ్లోబల్ డ్రీమ్ కేబినెట్లో నా పేరు వచ్చినప్పుడు, సీఈఓ సీఎం అన్నప్పుడు కూడా నేను ఇంత ఆనందించలేదు. రాష్ట్రంలోని భౌగోళిక అసమానతల కారణంగా కొన్ని ప్రాంతాల్లో నీటి ఒత్తిడి ఉంది… దానిని సరిచేస్తూ నీటిని ఆయా ప్రాంతాలకు నీటిని ఇవ్వగలిగితే కలిగే సంతోషం వేరు. గోదావరి- కావేరీ- మహానది- గంగా లాంటి నదులు అనుసంధానమై వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేస్తే భారత అభివృద్ధి అన్ స్టాపబుల్.

ఈ నీటి భద్రత, సంరక్షణా చర్యల్ని గుర్తించి వాటర్ మాన్ గా పేరు పెట్టినందుకు సంతోషంగా ఉంది. 36 ప్రాజెక్టులు చేపట్టేందుకు క్యాలెండర్ కూడా ఇచ్చాం. వాటిని పూర్తి చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ప్రధాని మోదీ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహకారం అధికారుల తోడ్పాటుతో ఈ విజయాలను సాధించగలిగాం. ఇప్పటి దాకా సాధించిన ఏ ఒక్కరి వల్లో సాధ్యం కాలేదు.. మంత్రులు, అధికారులు, ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు.. ఇలా అందరి వల్ల సాధ్యమైంది.. ఈ విజయం టీమ్ సక్సెస్.” అని సీఎం చంద్రబాబు చెప్పారు.

అవకాశాలను అన్ లాక్ చేయండి… అభివృద్ధి సాధించండి

“మనకు ఉన్న అవకాశాలను అన్‌లాక్ చేయగలిగాం. ప్రతి శాఖలోనూ సంస్కరణలు తీసుకువచ్చాం. ప్రతి జిల్లాలోనూ 25 టాప్ ప్రాజెక్టులను గుర్తించాలి… నియోజకవర్గానికి 10-15 ప్రాజెక్టులను ప్రాధాన్యతగా గుర్తించి అభివృద్ధి చేయాలి. జిల్లాల్లో గ్రోత్ ఇంజన్లను గుర్తించి దానికి అనుగుణంగా సంపద, ఆదాయాన్ని పెంచేలా చర్యలు చేపట్టాలి.

కోనసీమ కొబ్బరికి, వరికి ఫేమస్ కానీ ఇప్పుడు ఆదాయంలో వెనుకపడింది. నూతన ఆదాయ మార్గాల్ని అన్వేషించాలి. కొత్త అవకాశాలను అందిపుచ్చుకుని ఏలూరు జిల్లా ఇప్పుడు అత్యుత్తమ జిల్లాగా మారింది. అందుకే అవకాశాలను అన్ లాక్ చేయాలని పదేపదే చెబుతున్నాను. ప్రతిస్పందించే పాలన ద్వారా సుపరిపాలన అందించాలి.

క్షేత్రస్థాయిలో ప్రజలను కలవాలి. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్య పరిష్కారంపై సత్వరం స్పందించాలి. జిల్లా కలెక్టర్లుగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి… మంచి జ్ఞాపకాలను మిగుల్చుకోవాలి. మా హయాంలో పలానా జిల్లాలో ఈ పని చేశామని ప్రతి కలెక్టర్ గర్వంగా చెప్పుకునేలా పనిచేయాలి. రియాక్టివ్ గవర్నెన్స్ కంటే ప్రో యాక్టివ్ గవర్నెన్స్ ఉండాలి.

ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయంటే అంటే అభివృద్ధి-పాలన పెండింగ్ లో ఉన్నట్టే. ప్రభుత్వ సేవలు సక్రమంగా అందినప్పుడే ప్రజల నుంచి సానుకూల స్పందన ఉంటుంది. నాకు పరిపాలన కంటే సుపరిపాలన ముఖ్యం. మంత్రులు, అధికారులు, కలెక్టర్లు ప్రభుత్వ సేవలు అందించే విషయంలో.. అభివృద్ధి సాధించే విషయంలో పోటీ పడాలి.”అని ముఖ్యమంత్రి వివరించారు.

నెలవారీ నివేదికలతో అభివృద్ధి ప్రయాణం

“ప్రతి నెలా ఆర్దిక నివేదికను విడుదల చేసి ఎప్పటికప్పుడు లక్ష్యాలను బేరీజు వేసుకుంటున్నాం. ప్రతి మూడు నెలలకూ జీఎస్డీపీని కూడా లెక్కించి ప్రగతిలో ఎక్కడ ఉన్నామో చూస్తున్నాం. 2022-23 బేస్ ఇయర్ గా ప్రస్తుత ధరలకు అనుగుణంగా 13.44 శాతం వృద్ధి రేటు నమోదైంది. తయారీ రంగంలోనూ అభివృద్ధి నమోదు అయ్యింది. జీఎస్టీ వసూళ్లు కూడా గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రూ.25,450 కోట్ల మేర పెరిగాయి.

రెవెన్యూ శాఖలో సంస్కరణల్ని అమలు చేస్తున్నాం. 120 ఏళ్ల నాటి భూ సమస్యల్ని కూడా పరిష్కరిస్తున్నాం. 1908 నుంచి అమలాపురంలో గ్రౌండ్ రెంట్ భూముల విషయంలో నిర్ణయం తీసుకుని 1,416 మందికి పట్టాలు ఇచ్చాం. 2027 నాటికి భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీని తయారు చేసే బాధ్యత మనందరిది. పాలన అంటే గుడ్డిగా పనిచేయటం కాదు. వినూత్న ఆలోచనలు చేయాలి.

బెస్ట్ ప్రాక్టీసెస్ అనుసరించాలి. బెస్ట్ పాలసీలు తెచ్చి ప్రభుత్వ సేవలను సులభతరం చేయాలి. కొత్త ఆలోచన- కొత్త ఆవిష్కరణలతో అంతా కలిసి పనిచేద్దాం. ప్రస్తుతం 13.44 శాతం వృద్ధి నమోదైంది. దీనిని 15 శాతం దిశగా తీసుకెళ్దాం.” అని ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు.

ఇద్దరు మహిళా అధికారులకు సీఎం ప్రశంసలు

“కొందరు వ్యక్తులు ఫేక్ ప్రచారంతో సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. వేగంగా స్పందిస్తే దానికి కౌంటర్ ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. సరైన సమయంలో స్పందించకపోతే ఆ శిక్ష ప్రభుత్వానికి పడుతుంది. కొందరు రాజకీయాలు చేస్తూ తప్పు దోవ పట్టించే ప్రయత్నం జరుగుతోంది. డీఎస్సీ-2025లో ఎక్కడా తప్పు జరగలేదు. స్పోర్ట్స్ కోటాలో నిబంధనల ప్రకారమే ఉద్యోగాలిచ్చాం.

కానీ కొందరు అదే పనిగా ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు. దీనిపై ఇద్దరు మహిళా అధికారులు చక్కగా స్పందించి కౌంటర్ ఇచ్చారు… వారిని అభినందిస్తున్నా. ఉద్యోగాలు వచ్చిన ఉపాధ్యాయులు కొండారెడ్డి బురుజు, విజయవాడ అంబేద్కర్ విగ్రహం, విశాఖ బీచ్ రోడ్డులో ఆరోపణలకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. దుష్ప్రచారం ఆపకపోతే వారి పార్టీని బంగాళాఖాతంలో కలుపుతామని నినదించారు.

గత ప్రభుత్వం నిర్వాకంతో మార్కెట్టులోకి వచ్చిన జే బ్రాండ్ మద్యం వల్ల 30 వేల మంది చనిపోయారు. వారి ఆరోగ్యం కూడా దెబ్బతింది. కల్తీ బ్రాండ్లన్నీ రద్దు చేసి పారదర్శకంగా విక్రయాలు జరిగేలా చూస్తున్నాం. విద్యుత్ టారిఫ్ పెంచకుండా నాణ్యమైన విద్యుత్ పంపిణీ చేస్తున్నాం. ఈ ఏడాది తీవ్రమైన ఎల్ నినో కారణంగా నీటి భద్రత ఓ సవాలుగా మారింది.

54 శాతం లోటు వర్షపాతం ఈసారి రాష్ట్రంలో నమోదైంది. గతేడాది ఇదే సమయానికి రిజర్వాయర్లలో 85 శాతం నీటి నిల్వలు ఉంటే ఈసారి మాత్రం 57 శాతం మాత్రమే ఉన్నాయి. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా పోలవరం లాంటి ప్రాజెక్టులు పూర్తి కాలేదు. కేంద్ర ప్రాయోజిత పథకాలైన జల్ జీవన్ లాంటి మిషన్ను గత ప్రభుత్వం సరిగ్గా వినియోగించుకోలేదు.

అవి చేసి ఉంటే నీటి భద్రతకు ఆస్కారం ఉండేది. ప్రతీ ఇంటికీ కుళాయి ద్వారా నీరివ్వగలిగే వాళ్లం. తాగు నీటి సరఫరా విషయంలో ఎలాంటి రాజీ లేదు. పీఎండీఎస్, ప్రకృతి సేద్యం ద్వారా ప్రతీ ఎకరానూ సాగులోకి తీసుకురావాలి. సంక్షోభంలోనే కలెక్టర్ల నాయకత్వం వెలుగు చూడాలి.”అని సీఎం చంద్రబాబు అన్నారు.

సీఈఓ టు వాటర్ మ్యాన్

ఎకనమిక్ టైమ్స్ లో వచ్చిన వాటర్ మ్యాన్ ఆర్టికల్ గురించి కలెక్టర్ల కాన్ఫరెన్సులో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రస్తావించారు. సాగునీటి రంగంలో సీఎం చంద్రబాబు చేస్తున్న కృషిని అభినందిస్తూ కలెక్టర్ల కాన్ఫరెన్సులో స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ…”నీటి వనరుల రంగంలో సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం సాధించిన విజయాలను దేశం గుర్తించింది. వెలిగొండ, పోలవరం ఎడమ కాలువల ద్వారా నీటి విడుదల గురించి వివిధ రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది. ఈ నిశ్శబ్ద పురోగతి వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారు.

మొదటి కలెక్టర్ల కాన్ఫరెన్సులోనే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు నీళ్లు ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు. అందుకే హంద్రీనీవా, వెలిగొండ, పోలవరం ఎడమ కాలువ ద్వారా నీళ్లు ఇవ్వగలిగాం. ఉమ్మడి రాష్ట్రంలో ఇజ్రాయెల్ నుంచి డ్రిప్ టెక్నాలజీని తీసుకువచ్చి రాష్ట్రంలో అమలు చేశాం. గతంలో రూ.16 మీటరు డ్రిప్ పైప్ ఖరీదు. ఇప్పుడు 30 ఏళ్ల ద్రవ్యోల్బణం తర్వాత రూ.1.60 పైసలకే దొరుకుతోంది.

రాయలసీమ జిల్లాల్లో డ్రిప్ ద్వారా చేసిన సాగు, సృష్టించిన సంపదే దీనికి ఉదాహరణ. పట్టిసీమ ప్రాజెక్టును కొందరు వ్యతిరేకించారు. కానీ ఆదే ప్రాజెక్టు నుంచి ఇప్పటి వరకూ 500 టీఎంసీల నీటిని తరలించగలిగాం. ప్రకాశం బ్యారేజీని 200 సార్లు ఇప్పటి వరకూ నింపగలిగాం. డెల్టా ప్రాంతానికి నీరు ఇచ్చాం. ముఖ్యమంత్రి చంద్రబాబు సృష్టించిన నిశ్శబ్ద నీటి ప్రయాణాన్ని రాష్ట్ర ప్రజలు, దేశం కూడా గుర్తించింది.

రైతుల గురించి సీఎం పడుతున్న నిరంతర తపనను ఎకనమిక్ టైమ్స్ పత్రిక వాటర్ మాన్ గా ఆయన్ను కీర్తిస్తూ కథనం రాసింది. ఇది సీఎం సాధించిన విజయం.. ముఖ్యమంత్రి విజయంలో ఏపీ అభివృద్ధి ఉంది.” అని మంత్రి అన్నారు. కలెక్టర్ల కాన్ఫరెన్సులో మంత్రులు, సీఎస్ సాయి ప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Related posts

దేశంలోనే మొదటి డిజిటల్‌.. ఏఐ ప్లస్ క్యాంపస్..

Satyam News

నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ అభ్యర్ధులు

Satyam News

తెలంగాణ రైజింగ్‌ లక్ష్యాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయండి

Satyam News

తెలంగాణలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ కొరత లేదు

Satyam News

మీరాలం ట్యాంక్ సస్పెన్షన్ బ్రిడ్జి పనులు పర్యవేక్షించిన సీఎం

Satyam News

అలంపూర్ జోగులాంబ శక్తిపీఠంలో శ్రీచక్ర స్థిర ప్రతిష్ఠ

Satyam News

Leave a Comment