26.3 C
Hyderabad
September 19, 2026
నల్గొండహోమ్

తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్‌ ప్రభుత్వమే: మంత్రి ఉత్తమ్‌

#UttamkumarReddy

తెలంగాణలో మరోసారి కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖల మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కోదాడలో శనివారం నిర్వహించిన భారీ మెగా జాబ్‌మేళాను ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగిస్తూ ఈ ప్రకటన చేయగానే సభా ప్రాంగణం హర్షధ్వానాలతో మార్మోగింది.

గత లోక్‌సభ ఎన్నికల్లో కోదాడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు లభించిన భారీ ఆధిక్యమే ఈ ప్రాంతంలో పార్టీకి ఉన్న ప్రజాబలానికి నిదర్శనమని ఉత్తమ్‌ పేర్కొన్నారు. లక్షకు పైగా మెజారిటీ సాధించడంలో ఈ రెండు నియోజకవర్గాలు కీలక పాత్ర పోషించాయని గుర్తుచేశారు. ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం మరోసారి ఏర్పడుతుందని స్పష్టం చేశారు.

అనంతరం మెగా జాబ్‌మేళా ప్రాముఖ్యతను వివరిస్తూ, గ్రామీణ యువతకు ఉద్యోగ అవకాశాలను నేరుగా అందుబాటులోకి తీసుకురావడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని చెప్పారు. “పాఠశాలలు, కళాశాలలు నిర్మిస్తాం.. రహదారులు వేస్తాం.. ఎత్తిపోతల పథకాలు, విద్యుత్‌ సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేస్తాం. కానీ మన పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించినప్పుడు కలిగే ఆనందం వీటన్నింటికంటే గొప్పది” అని ఉత్తమ్‌ వ్యాఖ్యానించారు.

మెగా జాబ్‌మేళాకు దాదాపు 365 కంపెనీలను ఆహ్వానించగా, సుమారు 350 కంపెనీలు స్పందించి కోదాడకు వచ్చాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్లను తయారు చేసే తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్‌ వంటి బహుళజాతి సంస్థలు హైదరాబాద్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని, వాటికి పెద్ద సంఖ్యలో ఇంజినీర్లు అవసరమవుతున్నారని చెప్పారు. అయితే కోదాడ, హుజూర్‌నగర్‌, నడిగూడెం, మునగాల వంటి ప్రాంతాలకు చెందిన ఇంజినీరింగ్‌ పట్టభద్రులు ఆ సంస్థలను నేరుగా సంప్రదించే అవకాశం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు.

“మన యువత కంపెనీల వద్దకు వెళ్లలేని పరిస్థితి ఉంటే, కంపెనీలనే యువత వద్దకు తీసుకురావాలి. యువత, పరిశ్రమల మధ్య నేరుగా అనుసంధానం కల్పించాలనే ఆలోచనతోనే ఈ మెగా జాబ్‌మేళాను ఏర్పాటు చేశాం” అని ఉత్తమ్‌ తెలిపారు.

తాను, కోదాడ ఎమ్మెల్యే ఎన్‌.పద్మావతిరెడ్డి దశాబ్దాలుగా ఏర్పరచుకున్న పరిచయాలను ఉపయోగించి వివిధ కంపెనీల ప్రతినిధులతో మాట్లాడామని చెప్పారు. పరిశ్రమల శాఖ, సింగరేణి కాలరీస్‌తోపాటు ఇతర ప్రభుత్వ సంస్థలు కూడా కంపెనీలను కోదాడకు తీసుకురావడంలో సహకరించాయని వివరించారు.

హైదరాబాద్‌కు దూరంగా, ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దుకు సమీపంలో ఉన్న కోదాడకు వందలాది కంపెనీలను రప్పించడం సాధారణ విషయం కాదన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాతోపాటు ఖమ్మం ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు ఈ అవకాశంపై అవగాహన కల్పించేందుకు పత్రికలు, టెలివిజన్‌, సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించామని చెప్పారు. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ కోసం క్యూఆర్‌ కోడ్‌లను పెద్ద ఎత్తున అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు.

జాబ్‌మేళా విజయవంతానికి కృషి చేసిన సూర్యాపేట జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, పరిశ్రమల శాఖ, సింగరేణి అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, వాలంటీర్లు, ప్రతి ఒక్కరికీ మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంతోనే తమ బాధ్యత ముగిసిపోదని ఉత్తమ్‌ స్పష్టం చేశారు. “ఇక్కడ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు నా కార్యాలయంతో నిరంతరం సంప్రదింపులు కొనసాగించాలి. ఈరోజే ఉద్యోగం వచ్చినా, పరిశీలించి తరువాత అవకాశం కల్పిస్తామని కంపెనీ చెప్పినా మేము ఫాలోఅప్‌ చేస్తాం. యువతకు ఉద్యోగం లభించే వరకు అండగా ఉంటాం” అని భరోసా ఇచ్చారు.

కోదాడతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న ఉత్తమ్‌, 32 సంవత్సరాల క్రితం 1994లో తొలిసారిగా ఇక్కడి నుంచే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినట్లు తెలిపారు.

కోదాడలో త్వరలో ‘టాస్క్‌’ కేంద్రం

కోదాడలో త్వరలో తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌—‘టాస్క్‌’ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రకటించారు. స్థానిక యువతకు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ ఇచ్చి, మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ఈ కేంద్రం లక్ష్యమని తెలిపారు.

మెగా జాబ్‌మేళాలో మాట్లాడిన శ్రీధర్‌బాబు, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పనకు ప్రజా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. అనంతరం మంత్రులు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో కలిసి ఎంపికైన అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు.

జాబ్‌మేళాలో పాల్గొన్న 350కి పైగా కంపెనీలు దాదాపు 5,725 మంది అభ్యర్థులను ప్రాథమికంగా ఎంపిక చేయడం గొప్ప విజయమని శ్రీధర్‌బాబు అభినందించారు. ఈ భారీ కార్యక్రమం విజయవంతం కావడానికి వారం రోజులుగా నిరంతరం శ్రమించిన అధికారులు, కంపెనీల ప్రతినిధులు, సుమారు 700 మంది వాలంటీర్ల సేవలను ప్రశంసించారు.

ప్రభుత్వం ఒక్కటే ప్రతి ఒక్కరికీ ఉద్యోగాలు కల్పించడం సాధ్యం కాదని, ప్రైవేటు రంగం కూడా ముందుకొచ్చి ఉపాధి అవకాశాల కల్పనలో కీలక పాత్ర పోషించాలని కోరారు. డిగ్రీ, ఇంజినీరింగ్‌, పీజీ, డిప్లొమా, ఐటీఐ, ఫార్మసీ తదితర విద్యార్హతలు కలిగిన యువతకు పరిశ్రమలు విస్తృత అవకాశాలు కల్పించాలన్నారు.

వందలాది కంపెనీలను గ్రామీణ యువత వద్దకు తీసుకొచ్చిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతిరెడ్డిని శ్రీధర్‌బాబు ప్రత్యేకంగా అభినందించారు. కంపెనీలు జాబ్‌మేళాలో పాల్గొనేలా ఉత్తమ్‌ వ్యక్తిగతంగా పలుమార్లు సంప్రదింపులు జరిపారని చెప్పారు.

ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి విజ్ఞప్తి మేరకు కోదాడలో వీలైనంత త్వరగా ‘టాస్క్‌’ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కేంద్రం స్థానిక యువతకు నైపుణ్య శిక్షణ అందించే ప్రధాన వేదికగా మారడంతోపాటు వారిని పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతుందని తెలిపారు.

ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్న యువత వాటిని తమ జీవిత ప్రయాణంలో తొలి అడుగుగా భావించాలని శ్రీధర్‌బాబు సూచించారు. నిరంతరం కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటూ కష్టపడి పనిచేయాలని కోరారు. ప్రస్తుతం ఉద్యోగాలు పొందిన వారిలో కొందరు భవిష్యత్తులో పారిశ్రామికవేత్తలుగా ఎదిగి, తిరిగి కోదాడకు వచ్చి మరికొందరికి ఉపాధి కల్పించే స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.

Related posts

ఇస్తాంబుల్ లో ఇజ్రాయెల్ కాన్సులేట్ పై దాడి

Satyam News

రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది దుర్మరణం

Satyam News

ఎర్రకాలువ ముంపు సమస్యకు రూ.400 కోట్లతో శాశ్వత పరిష్కారం

Satyam News

రోడ్డును ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం

Satyam News

విశాఖ జిల్లా కలెక్టర్ వీడ్కోలు సభలో భావోద్వేగం

Satyam News

10వ తరగతి కూడా పాస్ కాని ఉన్నతాధికారి….?

Satyam News

Leave a Comment