నిడదవోలు సమగ్రాభివృద్ధే తన లక్ష్యమని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు.శనివారం నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం కాల్దరిలో పర్యటించిన మంత్రి కందుల దుర్గేష్ వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కాల్దరిలో స్వర్ణ గ్రామ సచివాలయ భవనాన్ని, చిల్ట్రన్స్ పార్క్ ను, అంతర్గత సీసీ రోడ్లను, డ్రైన్లను, మినీ గోకులం షెడ్డును ప్రారంభించారు. గ్రామంలో పర్యటించి అనేక అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. అనంతరం అచ్చిపాలెం గ్రామంలో పర్యటించి స్థానిక సమస్యలపై ఆరా తీశారు. గ్రామస్థులను మంత్రి దుర్గేష్ ఆప్యాయంగా పలకరించారు.
ఈ సందర్భంగా కాల్దరిలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ స్థానిక ఇందిరమ్మ కాలనీలో రూ.13 లక్షలతో డ్రైన్లు, రూ.29.50 లక్షలతో అంతర్గత సీసీ రోడ్లు పూర్తి చేశామన్నారు.రూ.53.70 లక్షలతో స్వర్ణ గ్రామ సచివాలయ భవనం, జీపీ గ్రాంట్ల ద్వారా అసంపూర్ణంగా ఉన్న అదనపు పనులు, మరుగుదొడ్డిని పూర్తి చేసి ప్రారంభించామని వెల్లడించారు.
జీపీ గ్రాంట్ ద్వారా రూ.4 లక్షల నిధులతో గ్రామంలో వినియోగంలో ఉన్న 90 వేల మరియు లక్షా 50 వేల సామర్థ్యం కలిగిన మంచి నీటి ట్యాంక్ లను అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. జేజేఎం గ్రాంట్ ద్వారా రూ.90 లక్షల నిధులతో 40 వేల లీటర్ల సామర్థ్యంతో కూడిన ట్యాంక్ నిర్మాణం పూర్తి చేశామన్నారు. దాదాపు 3 కిలోమీటర్ల పైప్ లైన్ వేశామని, త్వరలోనే ఇంటిం టికి కుళాయిలు వేసే ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు.
రూ.5 లక్షల ఎంపీల్యాడ్స్ నిధులతో మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ ను నిర్మిస్తున్నామన్నారు. పనులు పురోగతిలో ఉన్నాయని పేర్కొన్నారు. 6 మినీ గోకులం షెడ్డుల నిర్మాణానికి రూ.12.90 లక్షలు ఖర్చు చేశామన్నారు. సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల సహకారంతో పల్లె పండుగ 1.0, 2.0 ల క్రింద దాదాపుగా రూ.2.18 కోట్లతో కాల్దారి గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టామని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా స్థానిక గ్రామస్థులు, నాయకులు కోరినట్లుగా రైతు సేవా కేంద్రానికి అవసరమైన నిధులను సమీకరిస్తానని మంత్రి దుర్గేష్ హామీ ఇచ్చారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడల్లా ఎర్రకాలువ ముంపుకు గురవుతుందని ఈ క్రమంలో ఎంపీ పురందేశ్వరీ, తాను, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెనాయుడు కలిసి సీఎం చంద్రబాబునాయుడును కలిసి ఎర్రకాలువ ముంపుకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని కోరామన్నారు.
అందుకు రూ.300-రూ.400 కోట్లు ఖర్చువుతుందని చెప్పగా అందుకు సీఎం సానుకూలంగా స్పందించినట్లు మంత్రి దుర్గేష్ వివరించారు. త్వరలోనే ఆ దిశగా చర్యలు చేపడతామన్నారు. ఇప్పటికే దెబ్బతిన్న రెండు గేట్ల మరమ్మతులకు జలవనరుల శాఖ ద్వారా నిధులు మంజూరై పనులు జరుగుతున్నాయని వెల్లడించారు.అదే విధంగా తాను, స్థానిక టీడీపీ ఇంచార్జ్ బూరుగుపల్లి శేషారావు కలిసి రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ అందించేందుకు కృషి చేశామన్నారు. ఈ అంశాన్ని తాను ప్రతి కేబినెట్ సమావేశంలో గుర్తుచేసినట్లు మంత్రి వివరించారు.
ఎమ్మెల్యేగా ఉంటే నియోజకవర్గంలో పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేందుకు అవకాశం ఉండేదని మంత్రిగా ఉండటం వల్ల రాష్ట్రం మొత్తం పర్యటిస్తున్నానని, తనకు కేటాయించిన పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల్లో పురోగతికి పాటుపడుతున్నానన్నారు. ప్రత్యేకించి మంత్రిగా లభించిన అవకాశంతో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టులో నిడదవోలును అంతర్భాగం చేశానని, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నానని తెలిపారు.
మంత్రి గా ఉంటూనే అన్ని సమయాల్లో నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్నానన్నారు. ప్రజలకు ఏ సమస్య ఉన్నా నిడదవోలు కార్యాలయంలో అందించాలని, తానే స్వయంగా మండల కేంద్రాలకు వచ్చి ప్రజల నుండి నేరుగా అర్జీలు స్వీకరిస్తానని తెలిపారు.
కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చీపుళ్ల కుమారి, ఉప సర్పంచ్ ఈర్పిన సత్యనారాయణ, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, అధికారులు, కాల్దరి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
