కాలువలు, డ్రెయిన్లు, రిజర్వాయర్ల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం) పనులకు సంబంధించి రూ.160 కోట్ల బిల్లులు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
గత ఐదేళ్ల పాలనలో నిర్లక్ష్యానికి గురై, దెబ్బతిన్న సాగునీటి వ్యవస్థను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి గాడిలో పెడుతోందని మంత్రి తెలిపారు.
రైతుల భాగస్వామ్యంతో సాగునీటి నిర్వహణకు పెద్దపీట
గత ప్రభుత్వం రద్దు చేసిన సాగునీటి సంఘాల వ్యవస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునరుద్ధరించి రైతులకు కొండంత భరోసా కల్పించారని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఎల్‌నినో వంటి క్లిష్ట పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న పరిమిత జల వనరులను సమర్థవంతంగా వినియోగించడంలో సాగునీటి సంఘాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని తెలిపారు.
రైతుల భాగస్వామ్యంతోనే సాగునీటి నిర్వహణ మరింత సమర్థవంతంగా జరుగుతుందనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనకు క్షేత్రస్థాయిలో మంచి ఫలితాలు వస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు.
ఐదేళ్లలో రూ.200 కోట్లు – రెండేళ్లలో రూ.1,320 కోట్లు
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఓఅండ్ఎం పనులకు కేవలం రూ.200 కోట్లు మాత్రమే కేటాయించారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. దీనివల్ల సాగునీటి వ్యవస్థ నిర్వహణ తీవ్రంగా దెబ్బతిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలోనే ఓఅండ్ఎం పనుల కోసం రూ.1,320 కోట్లు మంజూరు చేశామని వెల్లడించారు.
కాలువల్లో పూడికతీత, లాకులు, షట్టర్లు, రోప్‌ల మరమ్మతులు వంటి అత్యవసర పనులకు గత ప్రభుత్వంలో నిధులు కేటాయించలేదని మంత్రి విమర్శించారు. చివరకు సాగునీటి వ్యవస్థలో అవసరమైన గ్రీజు పెట్టడం వంటి చిన్నపాటి నిర్వహణ పనులకు కూడా నిధులు అందని పరిస్థితి నెలకొందని తెలిపారు.
కాలువలు, డ్రెయిన్లు, రిజర్వాయర్ల నిర్వహణకు అవసరమైన నిధులను అందుబాటులో ఉంచుతూ, సాగునీటి వ్యవస్థను నిరంతరం సమర్థవంతంగా నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. రైతుల ప్రయోజనాలు, సాగునీటి భద్రతే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.
