ఇద్దరు ప్రేమించుకుని ఆ తర్వాత విడిపోయి అత్యాచారం కేసు పెడితే చెల్లదని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మనస్పర్థల కారణంగా ఇద్దరి మధ్య సంబంధం విచ్ఛిన్నమైన తరువాత, క్రిమినల్ చట్టాలను ప్రతీకారం తీర్చుకునే సాధనంగా ఉపయోగించడాన్ని సమాజంతో పాటు న్యాయస్థానాలు కూడా నిరుత్సాహపరచాలని సుప్రీంకోర్టు సూచించింది.
జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఆర్. మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. కేరళకు చెందిన ఒక వ్యక్తిపై అత్యాచారం, రెండో వివాహం, మోసం ఆరోపణలతో నమోదైన కేసులో కేరళ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన అప్పీలును విచారించిన సుప్రీంకోర్టు, అతడిపై ఉన్న ఆరోపణల నుంచి విముక్తి కల్పించింది.
ప్రేమ సంబంధాలు విఫలమైనప్పుడు న్యాయవ్యవస్థను ప్రతీకారం తీర్చుకునే సాధనంగా మార్చకూడదని జస్టిస్ నాగరత్న పేర్కొన్నారు. పరస్పర అంగీకారంతో కొనసాగుతున్న సంబంధంలో జరిగిన శారీరక సాన్నిహిత్యాన్ని, ఆ సంబంధం తరువాత చెడిపోయిందనే కారణంతో వెనుకటి తేదీ నుంచి అత్యాచారంగా ముద్ర వేయడం సమంజసం కాదని స్పష్టం చేశారు.
అత్యాచారం అత్యంత తీవ్రమైన నేరమని, దానికి సంబంధించిన కేసులను ఆయా సందర్భాలలోనే పెట్టాలని సుప్రీంకోర్టు సూచించింది. పరస్పర అంగీకారంతో ఏర్పడిన ప్రతి సంబంధం విఫలమైనప్పుడు దానిని అత్యాచార ఆరోపణగా మార్చడం వల్ల ఆ నేరం తీవ్రత పలుచబడటమే కాకుండా, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి కోలుకోలేని అపకీర్తి, వేధింపులు, అన్యాయానికి గురవుతారని వ్యాఖ్యానించింది.
ఇది కేవలం వ్యక్తిగత వివాదానికి సంబంధించిన విషయం మాత్రమే కాదని, ఇలాంటి సందర్భాల్లో న్యాయ ప్రక్రియ దుర్వినియోగం కావడం తీవ్రమైన ఆందోళన కలిగించే అంశమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఒక సంబంధం ఎలా ముగిసిందనే కోణం నుంచే కాకుండా, ఆ సంబంధం మొత్తం స్వరూపాన్ని సమగ్రంగా పరిశీలించిన తరువాతే న్యాయస్థానాలు నిర్ణయానికి రావాలని సూచించింది.
సంబంధం కొనసాగుతున్న సమయంలో పురుషుడు, మహిళ ఇద్దరికీ తమ నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఉంటుందని, ఒక దశలో పరస్పర అంగీకారంతో సంబంధంలో ఉన్నాడనే కారణంతో ఆ పురుషుడు జీవితాంతం అదే సంబంధంలో కొనసాగాల్సిన పరిస్థితి ఉండకూడదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఒక వ్యక్తి సంబంధం నుంచి వైదొలగాలని నిర్ణయించుకోవడాన్ని మోసం లేదా వంచనగా పరిగణించలేమని స్పష్టం చేసింది.
పరస్పర ప్రేమాభిమానాలతో కొనసాగిన సంబంధంలో వయోజనుల మధ్య జరిగిన అంగీకారపూర్వక శారీరక సంబంధాలను, ఆ తరువాత సంబంధం ముగిసిందనే కారణంతో నేరంగా మార్చాలని చట్టం ఎప్పుడూ ఉద్దేశించలేదని సుప్రీంకోర్టు పేర్కొంది. న్యాయస్థానాలు గతంలో పలుమార్లు హెచ్చరించినప్పటికీ ఈ ధోరణి పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోందని తెలిపింది. కొన్ని సందర్భాల్లో కేసుల పరిష్కారం పేరుతో పురుషులపై భారీ మొత్తాల్లో ఆర్థిక భారం మోపుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించింది.
తప్పుడు కేసులు నమోదవుతున్నాయని చెబుతూ నిజమైన అత్యాచార బాధితుల సమస్యలను విస్మరించకూడదని స్పష్టం చేసింది. అత్యాచారానికి సంబంధించిన చట్ట నిబంధనలు దుర్వినియోగమవుతున్న ప్రతి ఒక్క కేసు వెనుక, వెలుగులోకి రాని అనేక నిజమైన కేసులు ఉండే అవకాశం ఉందని పేర్కొంది. వాస్తవాలు స్పష్టంగా లైంగిక దాడి, హింస జరిగినట్లు వెల్లడిస్తే అటువంటి కేసులను అత్యంత తీవ్రంగా పరిగణించి న్యాయం జరిగేలా చూడాలని ధర్మాసనం స్పష్టం చేసింది.
