తీర ప్రాంత మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా అధికారులను ఆదేశించారు.
తుపానులు వచ్చిన ప్రతిసారీ తాత్కాలిక చర్యలకే పరిమితం కాకుండా తీర ప్రాంత ప్రజలకు శాశ్వత రక్షణ కల్పించేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. వేట పడవలకు బీమా సౌకర్యం కల్పించే అంశంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. దీపావళి తర్వాత మత్స్యకార గ్రామాల్లో పర్యటించి వారి సమస్యలను స్వయంగా అధ్యయనం చేస్తానని వెల్లడించారు.
అర్నబ్ తుపాను ప్రభావం, సహాయక చర్యలు, బాధితులకు అందుతున్న సాయం తదితర అంశాలపై కాకినాడ జిల్లా యంత్రాంగం, తీర ప్రాంత గ్రామాల ప్రజలతో క్యాంపు కార్యాలయం నుంచి పవన్ కళ్యాణ్ వర్చువల్ సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌తో పాటు మత్స్యకార గ్రామాల ప్రజలను అడిగి తుపాను నష్టం, సహాయక చర్యల వివరాలు తెలుసుకున్నారు. జిల్లావ్యాప్తంగా చేపట్టిన సహాయక చర్యలను సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఉప్పాడ తీర రక్షణ గోడ పనులు వేగవంతం
ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడకు సంబంధించిన డిజైన్, సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపకల్పన పనులను వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. వీలైనంత త్వరగా నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు సూచించారు. రక్షణ గోడను కోనపాపపేట వరకు పొడిగించే అంశంపై గతంలో రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థకు సమర్పించిన ప్రతిపాదనలకు త్వరితగతిన ఆమోదం లభించేలా చూడాలని తెలిపారు.
ఉప్పాడ–కాకినాడ బీచ్ రోడ్డు పునరుద్ధరణకు ఆదేశాలు
తుపాను అలల తాకిడికి పూర్తిగా దెబ్బతిన్న ఉప్పాడ–కాకినాడ బీచ్ రోడ్డును తక్షణమే పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. తీర ప్రాంత ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని, ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.
10 వేల మందికి పైగా ప్రజలకు పునరావాసం
కాకినాడ జిల్లాలోని 92 తీర ప్రాంత ఆవాసాల నుంచి 10 వేల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, 102 పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం కల్పించిన జిల్లా యంత్రాంగాన్ని పవన్ కళ్యాణ్ అభినందించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు నిరంతరం కొనసాగించాలని సూచించారు.
సూరాడపేట, మాయాపట్నం, కొత్తపట్నం, నాయకర్ కాలనీల్లోకి సముద్రపు నీరు చొచ్చుకురావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. ఈ సమస్యను గుర్తించిన వెంటనే స్పందించి 24 గంటల్లో నీటిని పూర్తిగా తొలగించిన అధికారులను ప్రశంసించారు.
విద్యుత్ సరఫరా పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలి
తుపాను గాలుల కారణంగా పిఠాపురం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. భోగాపురం, నరసింగపురం, చిత్రాడ ఎస్సీ కాలనీ, మల్లం, విరవాడ ప్రాంతాల మధ్య విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో పాటు కొన్ని చోట్ల పునరుద్ధరణ తర్వాత విద్యుత్ వైర్లు కాలిపోయాయని వివరించారు. ఈ సమస్యలను త్వరగా పరిష్కరించి విద్యుత్ సరఫరాను పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని అధికారులకు ఆదేశించారు.
నష్టం అంచనాలను త్వరగా పూర్తి చేయాలి
తుపాను కారణంగా దెబ్బతిన్న ఇళ్లు, పంటలు, వేట పడవలు, వలలు, మగ్గాలకు సంబంధించిన నష్టం అంచనాల ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సమగ్ర నష్టం వివరాలతో ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని సూచించారు. రైతులు, మత్స్యకారులు, ఇతర తుపాను బాధితులకు న్యాయం జరిగేలా పరిహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
ముంపునకు గురైన గ్రామాల ప్రజలకు 25 కిలోల బియ్యం, మత్స్యకారులు, చేనేత కార్మికులకు 50 కిలోల బియ్యంతో పాటు పప్పు, వంటనూనె, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, పంచదార తదితర నిత్యావసర సరుకులను ప్రతి బాధిత కుటుంబానికి అందించాలని ఆదేశించారు. సరుకుల పంపిణీలో ఎలాంటి కొరత లేకుండా చూడాలని స్పష్టం చేశారు.
సహాయక సిబ్బందికి అభినందనలు
తుపాను సమయంలో ప్రాణనష్టం జరగకుండా, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నిరంతరం కృషి చేసిన పోలీసు, రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్, వైద్య ఆరోగ్య శాఖల సిబ్బందిని పవన్ కళ్యాణ్ అభినందించారు. సహాయక, రక్షణ చర్యల్లో పాల్గొన్న 45 ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాల సేవలను ప్రశంసించారు.
గ్రామాల్లో మౌలిక సదుపాయాల పునరుద్ధరణకు కృషి చేస్తున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా విభాగాల సిబ్బందిని అభినందించారు. విపత్కర పరిస్థితుల్లో సమన్వయంతో పనిచేసి ప్రజలకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సమావేశంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణ తేజ, ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా విభాగాల ఇంజినీర్-ఇన్-చీఫ్‌లు తదితరులు పాల్గొన్నారు.
