మునుగోడు నియోజకవర్గ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని, రాజకీయాల్లో ఉన్నంతకాలం ఎలాంటి తప్పు చేయనని, అవినీతికి తావివ్వనని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. రాబోయే రెండేళ్లలో గట్టుప్పల్ మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని గట్టుప్పల్ మండల కేంద్రంలో కురుమ సంఘానికి చెందిన శ్రీ బీరప్ప గొర్రెల పెంపకందారుల సహకార సంఘం నూతన భవనాన్ని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం భవన ప్రాంగణంలో మొక్కను నాటారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, మంచి పేరు సంపాదించుకున్న వారికి శత్రువులు ఎక్కువవుతున్నారని, ప్రస్తుత సమాజంలో ఇతరుల మంచితనాన్ని కూడా ఓర్చుకోలేని పరిస్థితులు నెలకొన్నాయని వ్యాఖ్యానించారు. తాను కూడా ఒక సామాన్య కార్యకర్తగానే ఉంటూ ప్రజలతో కలిసి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
వయసు పైబడిన వారికి సమాజం అండగా నిలవాలని పేర్కొన్న ఆయన, కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వృద్ధుల కోసం ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కురుమ సంఘానికి సంబంధించిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
నియోజకవర్గ అభివృద్ధి కోసం అధికార పార్టీలో ఉన్నప్పటికీ ప్రతిపక్ష ఎమ్మెల్యే మాదిరిగా పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని రాజగోపాల్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి, ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిందని విమర్శించారు. ఆ ప్రభుత్వం చేసిన అప్పుల భారాన్ని ప్రస్తుత ప్రభుత్వం మోయాల్సి వస్తోందని అన్నారు. అభివృద్ధి చేయాలంటే నిధులు అవసరమని, ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో సహకారం అందకపోవడంతో కొన్ని అభివృద్ధి పనులు వెనుకబడుతున్నాయని వివరించారు.
తాను ఎమ్మెల్యేగా ఎన్నికైంది నియోజకవర్గ అభివృద్ధి కోసమేనని, ఎవరికి తలవంచేది లేదని, ఎలాంటి ప్రలోభాలకు లొంగేది లేదని స్పష్టం చేశారు. తాను రాజకీయాల్లో ఉన్నంతకాలం అవినీతికి పాల్పడబోనని, తన చుట్టూ కూడా అవినీతికి అవకాశం ఇవ్వనని అన్నారు. పేద ప్రజలకు న్యాయం జరగాలంటే వ్యవస్థలో అవినీతి అంతం కావాలని అభిప్రాయపడ్డారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వరకు లంచాలు ఇవ్వనిదే పనులు జరగడం లేదని విమర్శించారు.
గ్రామాల్లో మద్యపాన సంస్కృతి పెరిగిపోవడం వల్ల అనేక కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం తాగి కుటుంబాలను నాశనం చేసుకుంటున్న పరిస్థితులను మార్చాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు మునుగోడు నియోజకవర్గంలో బెల్టు దుకాణాల నిర్మూలనకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. రాజకీయాలు, నాయకులు, పాలనా వ్యవస్థలో మార్పు వచ్చినప్పుడే పేదలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.
మునుగోడు నియోజకవర్గంలో సాగునీటి సమస్యపై గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నియోజకవర్గానికి డిండి నుంచి నీటిని తీసుకురావడంలో విఫలమయ్యారని ఆరోపించారు. శివన్నగూడెం ప్రాజెక్టుకు నీటిని ఎక్కడి నుంచి తీసుకురావాలనే అంశంపై కూడా గత ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో చర్చించి, మంత్రివర్గంలోనూ ఈ అంశాన్ని ప్రస్తావించి నీటి సరఫరాపై కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు.
గట్టుప్పల్‌ను మండలంగా ఏర్పాటు చేయడంలోనూ గత పాలకులు విఫలమయ్యారని విమర్శించిన రాజగోపాల్ రెడ్డి, తన రాజీనామా పోరాటం ఫలితంగానే గట్టుప్పల్ మండలంగా ఏర్పడిందని, చండూరు రెవెన్యూ డివిజన్‌గా అవతరించిందని పేర్కొన్నారు. ప్రజల కోసం పనిచేసే వారే రాజకీయాల్లో ఉండాలని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను నిరంతరం పోరాడుతానని, గట్టుప్పల్ మండలాన్ని రాబోయే రెండేళ్లలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.
