నల్గొండహోమ్

రైతు మహాప్రదర్శనతో దద్దరిల్లిన నల్లగొండ

#Nalgonda

నల్లగొండ జిల్లా విప్లవాల ఖిల్లాగా వేరుగాంచిన నల్లగొండ జిల్లా కేంద్రం మరోమారు ఎర్రజెండాల రెపరెపలతో, రైతు నినాదాలతో ఎరుపెక్కింది. ఎన్నో ఉద్యమాలకు ఊపిరిపోసిన ఖిల్లా… చరిత్రలో ఎన్నో ప్రజా పోరాటాలకు వేదికైన నల్లగొండ మరోసారి ఎర్రజెండాల రెపరెపలతో పులకించిపోయింది.

అడుగడుగునా రైతాంగ ఉత్సాహం.. వీధివీధినా విప్లవ నినాదాల హోరు.. ఎటుచూసినా ఎర్రజెండాల సందడితో జిల్లా కేంద్రం అట్టుడికిపోయింది. అఖిల భారత రైతు సంఘం 36వ జాతీయ మహాసభల సందర్భంగా నల్లగొండ పట్టణంలో అదివారం నిర్వహించిన రైతుల మహాప్రదర్శన అట్టహాసంగా సాగింది. వేలాది మంది రైతులు, వ్యవసాయ కార్మికులు, ప్రజాసంఘాల ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొని తమ ఐక్యతను చాటుకున్నారు.

ఈ మహాప్రదర్శనతో పట్టణ వీధులన్ని ఎర్రజెండాల రెపరెపలతో ఎరుపెక్కాయి. రైతాంగ ఐక్యతను చాటుతూ సాగిన ఈ మహాప్రదర్శనలో సంప్రదాయ కళారూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆదివాసీల సంప్రదాయ దింసా నృత్యాలు అడుగడుగునా ఉత్సాహాన్ని నింపగా, కోలాటాల లయబద్ధమైన అడుగులు, చెక్కభజనల హోరు, డీజే సప్పుల దరువులతో పట్టణ వీధులు మారుమోగాయి.

ఎర్రజెండాలు చేతబూనిన రైతులు, కార్మికులు, ప్రజాసంఘాల ప్రతినిధుల వినాదాలతో నల్లగొండ పురవీధులు ఉద్యమ గీతాన్ని ఆలపించాయి. ముఖ్యంగా కార్పొరేట్ శక్తుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా రూపొందించిన వినూత్న ప్రదర్శనలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

వ్యవసాయ రంగంపై కార్పొరేట్ పెత్తనాన్ని ప్రశ్నిస్తూ రూపొందించిన ప్రదర్శనలు రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను కళ్లకు కట్టినట్లు చూపించాయి. మొత్తంగా రైతు మహాప్రదర్శనతో నల్లగొండ పట్టణం పండుగ వాతావరణాన్ని తలపించగా, ఎర్రజెండాల నినాదాలు, కళారూపాలు, రైతాంగ ఐక్యత అభిల భారత రైతు సంఘం మహాసభలకు ప్రత్యేక ఉత్సాహాన్ని తీసుకొచ్చాయి.

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి పురిటిగడ్డగా, భూమి కోసం భుక్తి కోసం సాగిన మహత్తర పోరాట చరిత్రకు సాక్షిగా నిలిచిన నల్లగొండ జిల్లా మరోసారి రైతాంగ ఉద్యమానికి నాంది. పలికేందుకు సిద్ధమైంది. ఒకప్పుడు పది లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిన వీర తెలంగాణ రైతాంగ పోరాట స్ఫూర్తిని చాటుతూ నల్లగొండ పట్టణంలో నిర్వహించిన రైతాంగ మహాప్రదర్శన చరిత్రలో నిలిచిపోయేలా సాగింది.

మర్రిగూడ బైపాస్ నుంచి ఎన్జీ కళాశాల వరకు సాగిన ఈ భారీ ప్రదర్శన రైతాంగ ఐక్యతను, పోరాట స్పూర్తిని చాటిచెప్పింది. సుమారు నాలుగు కిలోమీటర్ల మేర రెండు గంటలకు పైగా సాగిన ఈ ప్రదర్శన పట్టణ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. ఆదివాసీ, గిరిజనుల సంప్రదాయ నృత్యాలు, మహిళల కోలాటాలు, పురుషుల చిరుత భజనలు, డీజే సప్పులు, డప్పు చప్పుళ్లతో నల్లగొండ పట్టణం మార్మోగిపోయింది.

ప్రదర్శనకు ముందు వరుసలో రెడ్ షర్ట్ వాలంటీర్లు నిర్వహించిన కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. క్రమశిక్షణతో సాగిన వారి కవాతు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. ఎడ్ల బండ్ల ప్రదర్శన గ్రామీణ రైతాంగ సంస్కృతిని ప్రతిబింబిస్తూ పట్టణ ప్రజల హృదయాలను దోచుకుంది.

మరోవైపు కార్పొరేట్ శక్తులకు, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన గళం వినిపిస్తూ అంబానీ, అదానీ, మోదీ పేర్లతో ఏర్పాటు చేసిన భారీ దిష్టిబొమ్మను రైతులు దగ్ధం చేశారు. రైతుల సమస్యలు, కార్పొరేట్ ఆదిపత్యం, వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లపై తమ నిరసనను ఈ సందర్భంగా చాటిచెప్పారు.

ఆదివాసీ దింసా నృత్యాలు, కోలాటాలు, ఎడ్లబండ్ల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణ….

అఖిల భారత రైతు సంఘం మహాసభల సందర్భంగా నిర్వహించిన రైతుల మహాప్రదర్శన నల్లగొండ పట్టణంలో కనువిందు చేసింది. ఈ మహాప్రదర్శనలో ఆదివాసీల సంప్రదాయ దింసా నృత్యాలు, కోలాటాలు, చెక్కభజనలు, డీజీ సప్పులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఎర్రజెండాలు చేతబూని రైతులు చేసిన నినాదాలతో నల్లగొండ పట్టణ వీధులు మారుమోగాయి. ఇక గ్రామీణ వ్యవసాయ సంస్కృతికి అద్దం పట్టిన ఎడ్లబండ్ల ప్రదర్శన సంప్రదాయ కళారూపాలు, రైతాంగ పోరాట స్ఫూర్తి కలగలిసి మహాప్రదర్శనకు ప్రత్యేక శోభను తీసుకొచ్చింది.

సంప్రదాయాన్ని, రైతుల సంస్కృతి, గ్రామీణ జీవన విధానం, వ్యవసాయ వారసత్వాన్ని ప్రతిబింబిస్తూ అలంకరించిన ఎడ్లబండ్లు వీధుల్లో సాగుతుంటే చూపరులు ఆసక్తిగా తిలకించారు. ఆధునిక ప్రదర్శనల నడుమ పల్లె జీవన పరిమళాలను గుర్తుచేసిన ఎడ్లబండ్ల సందడి. అందరినీ ఆకట్టుకుంది.

ఒకవైపు ఆదివాసీ కళా వైభవం.. మరోవైపు రైతాంగ పోరాట స్ఫూర్తి.. ఇంకోవైపు ఎర్రజెండాల రెపరెపలు.. వీటన్నింటి కలయికతో నల్లగొండలో రైతు మహాప్రదర్శన అద్భుత దృశ్యంగా ఆవిష్కృతమైంది. పోరాటాల ఖిల్లా నల్లగొండలో రైతాంగ ఐక్యతను చాటిన ఈ మహాప్రదర్శన అఖిల భారత రైతు సంఘం మహాసభలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ప్రదర్శన కేవలం ఊరేగింపుగా కాకుండా, రైతాంగ హక్కుల కోసం భవిష్యత్తులో సాగబోయే ఉద్యమాలకు సంకేతంగా నిలిచింది.

మహా ప్రదర్శనకు ఘన స్వాగతం….

రైతాంగ అగ్రనాయకులు ముందుండి నడిపించగా, వేలాదిగా తరలివచ్చిన రైతులు, వ్యవసాయ కార్మికులు, ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు ప్రదర్శనలో ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ రైతాంగ మహా పాదర్శనకు నల్లగొండ పట్టణంలోని పలు ప్రజాసంఘాలు ఘన స్వాగతం పలికాయి. యుటీఎఫ్, సీఐటీయు, ఎస్ఎఫ్ఎ, డీవైఎఫ్బిలాంటి ప్రజా సంఘాలు రోడ్డు వెంట నిలబడి ప్రదర్శనకు స్వాగతం లుకుతూ వారిపై పూలవర్షం కురిపించారు.

Related posts

మరో పెద్ద తప్పు చేస్తున్న కేసీఆర్

Satyam News

మే 15న థియేటర్లలోకి ‘రాక్షసపురం’

Satyam News

వెలిగొండతో రూపురేఖలు మారనున్న మార్కాపురం

Satyam News

త్రిమూర్తుల కలయిక వల్లే రాష్ట్రం అభివృద్ధి

Satyam News

తప్పుడు ప్రచారంపై వివరణ కోరిన ప్రభుత్వం

Satyam News

చక్కెరతో ఇథనాల్‌ ఉత్పత్తిపై నిషేధం!

Satyam News

Leave a Comment