పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తిరుపతి నియోజకవర్గంలో మొదటి విడత రెండో రోజు నామినేషన్ల ప్రక్రియ ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోంది.
తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు నామినేషన్ల ప్రక్రియ సజావుగా, శాంతియుతంగా జరిగేలా పోలీసు అధికారులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. అన్ని నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి, కేంద్రాల పరిసరాల్లో నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారు.
నామినేషన్ కేంద్రాల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి, నిబంధనల ప్రకారం నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చే అభ్యర్థితో పాటు ఆయనకు మద్దతుగా మరో ఇద్దరికి మాత్రమే కేంద్రంలోకి ప్రవేశం కల్పిస్తున్నారు. అనవసరమైన జనసమీకరణకు అవకాశం లేకుండా ప్రవేశ, నిష్క్రమణ మార్గాలపై ప్రత్యేక పర్యవేక్షణ చేపడుతున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో భాగంగా నిబంధనలను ఉల్లంఘించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలకు పాల్పడినా, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినా ఉపేక్షించేది లేదని, బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉందని తెలిపారు. అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజలు ఎన్నికల నిబంధనలను గౌరవిస్తూ పోలీసులకు సహకరించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
