కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి కొడాలి నాని ఇలాకాగా పేరొందిన గుడివాడలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కృష్ణా జిల్లా వైసీపీ మైనార్టీ సెల్ మాజీ అధ్యక్షుడు మహ్మద్ ఖాసిం అలియాస్ అబూ ఆదివారం తన అనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నెల 23వ తేదీన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో, ఎన్నికలకు సరిగ్గా కొద్ది రోజుల ముందు జరిగిన ఈ పరిణామం స్థానిక రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం వైసీపీ నుంచి వలసల పరంపర కొనసాగుతుండగా, తాజాగా అబూతో పాటు సుమారు 250 మంది కార్యకర్తలు, అనుచరులు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ గూటికి చేరారు. గుడివాడలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, మాజీ మంత్రి పిన్నమనేని వేంకటేశ్వరరావు వీరందరికీ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. మైనార్టీ వర్గాల్లో పట్టున్న నేత పార్టీ వీడటం మున్సిపల్ ఎన్నికల వేళ వైసీపీకి బిగ్ షాక్ అనే చెప్పాలి.
ఈ సందర్భంగా మహ్మద్ ఖాసిం మాట్లాడుతూ, గుడివాడ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసే తాము టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ముఖ్యంగా మైనార్టీల చిరకాల వాంఛ అయిన షాదీఖానా నిర్మాణానికి రూ. 2 కోట్లు మంజూరు చేయించినందుకు ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వ హయాంలోనే గుడివాడ మరింతగా అభివృద్ధి చెందుతుందనే నమ్మకంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు.
అనంతరం ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ, గుడివాడ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనుకునే ప్రతి ఒక్కరినీ తమ పార్టీలోకి ఆహ్వానిస్తామన్నారు. నియోజకవర్గంలోని అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న తరుణంలో జరిగిన ఈ చేరికలు టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి.
