జాతీయంహోమ్

మహిళా కలెక్టర్ ను వేధించిన ఎమ్మెల్యేపై కేసు

#MadrasHighCourt

ఒక జిల్లా మహిళా కలెక్టర్ ను లైంగికంగా వేధించిన కేసులో అధికార పార్టీ ఎమ్మెల్యేపై తమిళనాడులో కేసు నమోదు అయింది. కల్లకురిచి జిల్లా కలెక్టర్ జె.ఇ. పద్మజా ఇచ్చిన ఫిర్యాదు మేరకు మహిళా పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈ వ్యవహారంపై మద్రాస్ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ప్రజాప్రతినిధి అయినంత మాత్రాన చట్టానికి అతీతులు కారని, మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని న్యాయస్థానం స్పష్టం చేసింది. దాంతో తమిళనాడులో అధికార పార్టీ తమిళగ వెట్రి కళగం (టీవీకే) ఎమ్మెల్యే సి. అరుల్ విఘ్నేష్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

కలెక్టర్‌గా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి జె.ఇ. పద్మజాను ఎమ్మెల్యే అరుల్ విఘ్నేష్ వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆమె మొబైల్ ఫోన్‌కు అసభ్యకరమైన, లైంగిక భావజాలంతో కూడిన సందేశాలు పంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా ఆమె అధికారిక నివాసంలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించినట్లు కూడా ఫిర్యాదుదారులు ఆరోపించారు.

ఈ సంఘటనలు సుమారు మూడు నెలల క్రితం జరిగాయి. జులై 31న ఈ అంశం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినప్పటికీ, తొలుత అధికారికంగా పోలీసు ఫిర్యాదు నమోదు కాలేదు. కలెక్టర్ మౌఖికంగా తన సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అనంతరం ప్రధాన కార్యదర్శి ఈ విషయాన్ని టీవీకే నాయకత్వం దృష్టికి తీసుకెళ్లగా, ఎమ్మెల్యేను పార్టీ పెద్దలు మందలించినట్లు వార్తలు వచ్చాయి.

అయితే అప్పట్లో క్రిమినల్ కేసు నమోదు కాలేదు. ఈ నేపథ్యంలో వ్యవహారం సామాజిక మాధ్యమాల్లోనూ, రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంపై న్యాయవాది ఆర్. త్రిశూలి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. కలెక్టర్‌కు అసభ్యకర సందేశాలు పంపడం, ఆమె అధికారిక నివాసంలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించడం వంటి ఆరోపణలపై ఎమ్మెల్యేపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.

నవంబర్ 23న జస్టిస్ వి. లక్ష్మీనారాయణన్ ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. కలెక్టర్ స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేశారా? ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఏమైనా ఫిర్యాదు అందిందా? అని న్యాయస్థానం ప్రశ్నించింది. అప్పటికి తమకు, ప్రధాన కార్యదర్శికి కలెక్టర్ నుంచి అధికారిక ఫిర్యాదు అందలేదని ప్రభుత్వ న్యాయవాది ఆర్. జాన్ సత్యన్ కోర్టుకు తెలిపారు.

స్పందించిన న్యాయమూర్తి, పత్రికల్లో వచ్చిన వార్తలను మాత్రమే ఆధారంగా చేసుకుని ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించలేమని పేర్కొన్నారు. కలెక్టర్ నుంచి నేరుగా వివరాలు తెలుసుకుని తదుపరి విచారణకు నివేదించాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించారు. దీంతో నవంబర్ 24న మరోసారి విచారణ చేపట్టాలని నిర్ణయించారు. హైకోర్టు విచారణ అనంతరం నవంబర్ 23న కలెక్టర్ పద్మజా కల్లకురిచి పోలీసు సూపరింటెండెంట్‌కు లిఖితపూర్వక ఫిర్యాదు సమర్పించారు. దీంతో కల్లకురిచి మహిళా పోలీస్ స్టేషన్ పోలీసులు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు.

నవంబర్ 24న హైకోర్టులో విచారణ సందర్భంగా ప్రభుత్వ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జాన్ సత్యన్ ఎఫ్‌ఐఆర్ నమోదైన విషయాన్ని ధర్మాసనానికి తెలియజేశారు. ఫిర్యాదు అందిందని, మహిళా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు వివరించారు. మహిళల వేధింపుల నిషేధ చట్టంలోని సెక్షన్ 4(1), భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని సెక్షన్ 294 కింద కేసు నమోదు చేశారు.

ఈ కేసులో ఎమ్మెల్యే ప్రమేయం ఉన్నందున దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగాలని హైకోర్టు స్పష్టం చేసింది. సాధారణ పోలీసు అధికారుల పరిధిలోనే విచారణను వదిలేయకుండా, ఐజీ (ఇన్‌స్పెక్టర్ జనరల్) స్థాయి అధికారితో పర్యవేక్షించాలని ఆదేశించింది. మహిళా కలెక్టర్ అయినా, సాధారణ ఉద్యోగి అయినా, చివరకు పారిశుద్ధ్య కార్మికురాలైనా ప్రతి మహిళకు లైంగిక వేధింపుల నుంచి రక్షణ పొందే హక్కు ఉందని జస్టిస్ లక్ష్మీనారాయణన్ వ్యాఖ్యానించారు.

Related posts

మంత్రాలయం శ్రీ మంచాలమ్మకు ప్రత్యేక అలంకరణ

Satyam News

చర్చలకు మేం సిద్ధం: ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ప్రకటన

Satyam News

సూర్య క్షేత్రంలో రథసప్తమి సందడికి సిద్ధం

Satyam News

అంతర్జాతీయ పెట్టుబడులను భారీగా ఆకర్షించేలా ప్రణాళిక

Satyam News

దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్న మోడీ

Satyam News

నర్సరావుపేట జేఎన్ టీయూకే నూతన హాస్టల్ భవనాలు ప్రారంభం

Satyam News

Leave a Comment