జాతీయంహోమ్

పెళ్లి చేయబోయిన పెద్దల్ని ఎదిరించిన 17ఏళ్ల బాలిక

#Hemaninama

తనకు బాల్య వివాహం చేయబోయిన పెద్దలను 17 ఏళ్ల బాలిక ఎదిరించి ఆదర్శంగా నిలిచింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని ఝబువా జిల్లా బర్ఖేడా గ్రామంలో జరిగింది. హీమా నినామా అనే 17 ఏళ్ల బాలిక ప్రస్తుతం కల్యాణ్‌పురాలోని సందీపని విద్యాలయంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది.

రెండేళ్ల క్రితం ఆమెకు కుటుంబ సభ్యులు బాల్యవివాహం చేయాలని నిర్ణయించారు. అయితే చిన్న వయసులోనే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని హీమా ధైర్యంగా తన పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని ఆశ్రయించింది. తనకు చదువుకోవాలని ఉందని, బాల్యవివాహాన్ని ఆపేందుకు సహాయం చేయాలని కోరింది.

స్పందించిన ప్రధానోపాధ్యాయుడు హీమా తండ్రిని పిలిపించి మాట్లాడారు. 18 ఏళ్లు నిండకముందే బాలికకు వివాహం చేయడం చట్టవిరుద్ధమని, చదువులో ప్రతిభ కనబరుస్తున్న హీమాకు మంచి భవిష్యత్తు ఉందని వివరించారు. తొలుత ఆమె వైకల్యంతో ఉన్నందున త్వరగా వివాహం చేయాలని భావించినట్లు తండ్రి చెప్పినప్పటికీ, ప్రధానోపాధ్యాయుడి కౌన్సెలింగ్‌తో తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. దీంతో హీమా బాల్యవివాహం ఆగిపోవడమే కాకుండా, ఉన్నత చదువులు కొనసాగించేందుకు కుటుంబ సభ్యుల నుంచి అనుమతి లభించింది.

బాల్యవివాహం జరగబోతున్న విషయం తెలుసుకున్న వెంటనే ప్రధానోపాధ్యాయుడిని కలిసి సహాయం కోరానని హీమా తెలిపింది. ఆయన తన కుటుంబ సభ్యులతో మాట్లాడి బాల్యవివాహం చట్టవిరుద్ధమని వివరించడంతో వారు అంగీకరించారని చెప్పింది. ప్రస్తుతం చదువుతో పాటు క్రీడల్లోనూ పాల్గొంటున్నానని, పరుగుపందెం, షాట్‌పుట్‌ వంటి పోటీల్లో ప్రతిభ కనబరుస్తున్నానని వివరించింది.

బాలిక హీమా ధైర్యం, పట్టుదల గురించి తెలుసుకున్న ఐక్యరాజ్యసమితి బాలల నిధి (యునిసెఫ్‌) ప్రతినిధులు ఆమెకు అండగా నిలిచారు. ఆమె సాధించిన విజయాలు, బాల్యవివాహానికి వ్యతిరేకంగా చేసిన పోరాటం గురించి ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అంతర్జాతీయ ఫుట్‌బాల్ దిగ్గజం డేవిడ్ బెక్‌హామ్ కూడా తన సామాజిక మాధ్యమ ఖాతాల్లో హీమా గురించి ప్రస్తావించారు. ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ వేదికలపై ఆమె కథకు ప్రాధాన్యం లభించడంతో అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చింది. తన కథ ప్రపంచవ్యాప్తంగా తెలిసిందని, ఎంతోమంది నుంచి మద్దతు లభిస్తుండటం ఆనందంగా ఉందని హీమా పేర్కొంది.

చదువుతో పాటు క్రీడలు, వ్యాసరచన, చిత్రలేఖనం, ప్రసంగ పోటీల్లోనూ హీమా ప్రతిభ కనబరుస్తోందని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తెలిపారు. ముఖ్యంగా షాట్‌పుట్‌లో జిల్లా స్థాయి పురస్కారాలు సాధించిందని, ఇతర పోటీల్లోనూ బహుమతులు గెలుచుకుందని చెప్పారు. భవిష్యత్తులో ఉపాధ్యాయురాలిగా ఎదగాలన్నది ఆమె లక్ష్యమని వివరించారు.

యునిసెఫ్‌ నిర్వచనం ప్రకారం 18 ఏళ్లలోపు బాలిక లేదా బాలుడికి జరిగే అధికారిక వివాహం లేదా అనధికారిక వైవాహిక బంధం బాల్యవివాహం కిందకు వస్తుంది. గత దశాబ్ద కాలంలో ప్రపంచవ్యాప్తంగా బాల్యవివాహాల సంఖ్య తగ్గుతున్నప్పటికీ, ఇప్పటికీ ప్రతి ఐదుగురు బాలికల్లో ఒకరు బాల్యంలోనే వివాహ బంధంలోకి వెళ్తున్నట్లు అంచనాలు వెల్లడిస్తున్నాయి. యుద్ధాలు, వాతావరణ మార్పుల ప్రభావం, కొవిడ్‌ పరిణామాలు వంటి సంక్షోభాలు ఈ సమస్యను మరింత తీవ్రతరం చేసే ప్రమాదం ఉంది. 2030 నాటికి బాల్యవివాహాలను పూర్తిగా నిర్మూలించాలని ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు నిర్దేశించాయి.

తన భవిష్యత్తు ప్రణాళికల గురించి హీమా మాట్లాడుతూ.. ఉపాధ్యాయురాలిగా మారేందుకు ప్రస్తుతం సన్నద్ధమవుతున్నానని తెలిపింది. ప్రతి బాలిక బాల్యవివాహానికి దూరంగా ఉండాలని, చిన్న వయసులో పెళ్లి గురించి ఆలోచించకుండా చదువు, ఉద్యోగం, భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని సూచించింది. ఆర్థికంగా స్వతంత్రంగా ఎదిగి సొంత కాళ్లపై నిలబడాలని పిలుపునిచ్చింది.

Related posts

వల్లభనేని వంశీపై మరో కేసు..మళ్లీ అరెస్టు..?

Satyam News

అరకు లోయ లో కనిపించిన భూమి

Satyam News

ఆంజనేయ స్వామి దేవాలయం కూల్చివేతపై అసత్య ప్రచారం

Satyam News

వైసీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుక ఆస్తుల వేలం

Satyam News

ధర్మం మంటగలిస్తే… ఆ త్రికూటేశ్వరుడు కన్నెర్ర చేయడా?

Satyam News

మాట నిలబెట్టుకున్న లోకేష్…. పేద ముస్లిం ఫ్యామిలీకి రంజాన్‌ కానుక…!!

Satyam News

Leave a Comment