మెదక్హోమ్

సిట్ నోటీసులు చిల్లర రాజకీయాలే

#HarishRao

సిట్ విచారణ ముగిసిన అనంతరం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభా ఉపనేత హరీశ్ రావు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తనకు నైతిక మద్దతు తెలిపిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, పార్టీ నాయకులు, కార్యకర్తలకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలిపారు.

రేవంత్ రెడ్డి జారీ చేసిన సిట్ నోటీసులు పూర్తిగా “ట్రాష్” అని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. అవి నిరాధార ఆరోపణలతో, అడిగిందే అడుగుతూ సొల్లు పురాణంలా ఉన్నాయన్నారు. విచారణ సమయంలో గంట అడగగానే బయట నుంచి ఫోన్లు వస్తున్నాయని, అధికారులు మధ్యలో బయటికి వెళ్లి మళ్లీ అదే ప్రశ్నలు వేస్తున్నారని ఆరోపించారు. కొత్తగా ఏమీ లేదని, రేవంత్ రెడ్డి ఫోన్ చేశాడా? సజ్జనర్ చేశాడా? అనే ప్రశ్నలే తప్ప మరేమీ లేదన్నారు.

ఉదయం తన బామ్మర్ది అవినీతి బాగోతాన్ని బయటపెడితే, సాయంత్రానికి తనకు సిట్ నోటీసులు ఇచ్చారని హరీశ్ రావు విమర్శించారు. నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని సవాల్ విసిరారు. బామ్మర్దే మొదటి దోషి అని, అన్ని ఆధారాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. టెండర్ల కోసం జరుగుతున్న బాగోతాన్ని డైవర్ట్ చేయడానికే ఈ సిట్ డ్రామా అని ఆరోపించారు.

ఉద్యమాలు చేసిన మాకు అరెస్టులు కొత్త కాదు

ఉద్యమాలు, పోరాటాలు, అరెస్టులు తమకు కొత్తకాదని, కేసీఆర్ నాయకత్వంలో వందల కేసులు ఎదుర్కొని తెలంగాణ కోసం పోరాడిన సైనికులమని హరీశ్ రావు గుర్తు చేశారు. కాంగ్రెస్ నాయకుల్లా నోటీసులు రాగానే పారిపోయే వాళ్లం కాదన్నారు. తనపై వేసే నోటీసులను ప్రజా పోరాటానికి దక్కిన గౌరవంగా భావిస్తున్నానన్నారు. ప్రైవేట్ కేసుల్లో కోట్ల రూపాయలు ఖర్చు చేసి తనను ఇరికించేందుకు ప్రయత్నించారని, ఆ కేసులను సుప్రీంకోర్టు, హైకోర్టు కొట్టివేశాయని చెప్పారు.

రుణమాఫీ, వరద బాధితుల పరామర్శ వంటి ప్రతి అంశంపై కేసులు పెట్టారని ఆరోపించారు. ఘోష్ కమిషన్ డొల్ల అని అసెంబ్లీ సాక్షిగా ఆధారాలతో సహా వెల్లడించానని గుర్తుచేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు పక్కన పెట్టి స్కాంలు, దోపిడీల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మునిగిపోయిందని విమర్శించారు.

పోలీసుల వెనుక దాక్కొని నోటీసులు పంపడం కాకుండా రాజకీయంగా ఎదుర్కోవాలని రేవంత్ రెడ్డికి హరీశ్ రావు సవాల్ విసిరారు. ఎంతమంది కుట్రలు పన్నినా, ఎన్ని కేసులు పెట్టినా తన గొంతు సింహంలా గర్జిస్తూనే ఉంటుందని అన్నారు. నోటీసులకు సమాధానం ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధమేనని, కానీ రేపు ప్రజా కోర్టులో సమాధానం ఇవ్వడానికి రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. చట్టంపై గౌరవం ఉందని, కానీ చిల్లర రాజకీయాలపై అసహ్యం ఉందని చెప్పారు.

సిట్ పేరిట నాటకాలు కాకుండా, విచారణ మొత్తం రికార్డును బయట పెట్టాలని డిమాండ్ చేశారు. రైతుబంధు, రుణమాఫీ, ఉద్యోగాలు, పెన్షన్లపై ప్రభుత్వం మాట్లాడాలని సూచించారు. నోటీసులు తమను భయపెట్టవని, అవే ప్రభుత్వ పతనానికి నాంది పలుకుతాయని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. సింగరేణి బొగ్గు కుంభకోణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని మరోసారి డిమాండ్ చేస్తూ, లేదంటే బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని అవినీతులను బయటపెడతామని హెచ్చరించారు.

Related posts

రోడ్డెక్కిన దస్తావేజుల లేఖరులు

Satyam News

మరో వ్యక్తిపై ఉపా చట్టం కింద కేసు నమోదు

Satyam News

సహజనటి జయసుధ “లక్ష్మణరేఖ” కు 50 సంవత్సరాలు

Satyam News

మంగళగిరిని మంత్రి లోకేష్‌ ఏం చేయబోతున్నారు?

Satyam News

జీఎస్టీ సంస్కరణలతో రాష్ట్ర ప్రజలకు రూ.8 వేల కోట్ల లబ్ది

Satyam News

రాజాం జీఎంఆర్ ఇలాకా లో రెండు చోట్ల భారీ చోరీలు

Satyam News

Leave a Comment