గుంటూరుహోమ్

మే 15 లోపు మెడికల్ కాలేజీ పనులు పూర్తి

పల్నాడు జిల్లా పిడుగురాళ్ల లోని నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరం నుండే 100 ఎంబీబీఎస్ సీట్లతో ప్రవేశాలు ప్రారంభించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మెడికల్ కాలేజీని ఏపీ మెడికల్, హెల్త్ ప్రిన్సిపాల్ సెక్రటరీ సౌరబ్ గౌర్, జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా బుధవారం సందర్శించారు.

ఇప్పటికే నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు ఈ విద్యా సంవ‌త్స‌రంలో 100 ఎంబిబియ‌స్ సీట్ల‌కు ప్ర‌వేశాలు క‌ల్పించే దిశ‌గా అన్ని ప‌నుల‌ను మే 15వ తేదీ లోపు పూర్తి చేయాల‌ని కూటమి ప్రభుత్వం సంకల్పించినట్లు ప్రకటించారు.

అందువల్లనే ఉన్నతాధికారులు పిడుగురాళ్ల‌లోని కొత్త‌ ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాలను సందర్శించారు. వైద్యారోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ కూడా సంబంధిత అధికారుల‌ను తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతేకాకుండా వైద్య శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సౌర‌భ్ గౌర్ నేతృత్వంలోని అధికారుల బృందం పిడుగురాళ్ల మెడికల్ కాలేజీని సంద‌ర్శించాలని ఆదేశించారు.

కేంద్ర ప్రాయోజిత ప‌థ‌కం కింద నిర్మిస్తున్న ఈ కాలేజీ కోసం కేంద్ర ప్ర‌భుత్వం రూ.195 కోట్లు మంజూరు చేసింది. రూ.450 కోట్ల ఆమోదిత‌ వ్య‌యంతో 47 ఎక‌రాల విస్తీర్ణంలో ఈ కాలేజీ నిర్మాణ ప‌నులు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా పిడుగురాళ్ల వైద్య క‌ళాశాల‌లో 100 ఎంబిబియ‌స్ ప్ర‌వేశాల‌కు ఎన్ఎంసి ప్ర‌మాణాల మేర‌కు డాక్ట‌ర్ల‌తో, స‌హా దాదాపు 700 మంది సిబ్బందిని నియ‌మించాల్సి ఉంది.

అందులో భాగంగా బ‌దిలీలు, ప‌దోన్న‌తులు, రీడిప్లాయిమెంట్ ద్వారా దాదాపు 180 మందిని నియ‌మించ‌డానికి మంత్రిత్వ శాఖ ఇప్ప‌టికే నిర్ణ‌యించింది. అద‌నంగా మ‌రో 520 ప్ర‌భుత్వ నియామ‌కాల‌ను వివిధ కేట‌గిరీల్లో చేయాల్సి ఉంది. కొత్త‌గా ప్రొఫెస‌ర్లు, అసోసియేట్ ప్రొఫెస‌ర్లు, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ల‌తో పాటు 45 కేట‌గిరీల్లో స‌హాయ‌క సిబ్బందిని నియ‌మించాల్సి ఉంది.

వైద్య క‌ళాశాల, అనుబంధ బోధానాసుప‌త్రి, న‌ర్సింగ్ క‌ళాశాల, విద్యార్థుల వ‌స‌తి గృహాల నిర్మాణ ప‌నులను మరియు మిగిలిన ప‌నుల‌ను మే 15 క‌ల్లా పూర్తి చేయాల‌ని మంత్రి సత్య కుమార్ యాదవ్ స్ప‌ష్ట‌మైన ఆదేశాలిచ్చారు. అందుకు అనుగుణంగా త్వరలో వైద్య సేవలు కూడా ప్రారంభం కానున్నట్లు తెలిపారు.

పిడుగురాళ్లలోని నూతన ప్రభుత్వ భోధనాసుపత్రిలో ఏప్రిల్ 15 నుంచి ఔట్ పేషెంట్ (ఓ.పి) రోగులకు వైద్య సేవలను ప్రారంభించేందుకు వీలుగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తో చర్చించిన తరువాత అధికారకంగా వైద్య సేవలు ప్రారంభ తేదీని ఖరారు చేస్తామని పేర్కొన్నారు.

క్షేత్రస్థాయిలో బోధన ఆసుపత్రి భవన నిర్మాణాల పురోగతిని అధికారులు స్వయంగా పరిశీలించారు. ఆ సందర్భంగా పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, కార్యదర్శి సౌరబ్ గౌర్ సివిల్ ఇంజనీర్లు, మున్సిపల్ కమీషనర్, ఆర్.డి.ఓ, ఇతర అధికారులతో సమీక్ష జరిపారు. కళాశాల భవన నిర్మాణాల పనులు చురుగ్గా జరగాలి.

సమీక్ష సమావేశంలో సౌరభ్ గౌర్ మాట్లాడుతూ, 2026-27 విద్యా సంవత్సరంలో ఎంబిబిఎస్ లో 100 సీట్ల మంజూరు కోసం ఎన్ఎంసికి దరఖాస్తు చేసామని అన్నారు. దీనికి అనుగుణంగా ఎన్.యమ్.సి నియమించే కమిటీ ఇన్స్పెక్షన్ కోసం వస్తుందని చెప్పారు.

ఈ ఇన్స్పెక్షన్ దృష్టిలో పెట్టుకుని మే నెలాఖరు నాటికి నిర్మాణాలను కాంట్రాక్టర్ తో పూర్తి చేయించాలని ఇంజనీర్లను ఆదేశించారు. ముఖ్యంగా కళాశాల భవన నిర్మాణ పనులు మరింత చురుగ్గా జరగాలని చెప్పారు. ఎన్.యమ్‌.సి మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేలా అందరూ దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు.

ప్రతి వారం పురోగతిని స్వయంగా పర్యవేక్షిస్తానని వెల్లడించారు. మరోవైపు కళాశాల తరగతుల నిర్వహణకు తగ్గట్లు వైద్యులు, పారామెడికల్ సిబ్బంది నియామకాలను డి.యమ్.ఇ, డి.హెచ్ అధికారులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఓ.పి సేవలను ప్రారంభించిన అనంతరం వీలును బట్టి ఐ.పి లో కూడా రోగులకు సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఎంబిబిఎస్ ప్రవేశాలు పొందే విద్యార్థులకు హాస్టల్‌లో అన్ని రకాల సదుపాయాలు ఉండాలాని, ఏ విషయంలోనూ కొరత ఉండకూడదని స్పష్టం చేశారు. మెడికల్ కళాశాల నిర్వహణ కోసం శానిటరీ, సెక్యూరిటీ, డైట్ ఇతర ఏజెన్సీల వారిని కూడా సిద్దం చేయాలని వెల్లడించారు. ఆక్సిజన్ కూడా అందుబాటులో ఉంచాలని తెలిపారు.

సేవల ప్రారంభం పై ఏప్రిల్ 1 తరువాత ట్రైల్ రన్ నిర్వహిస్తామని తెలిపారు. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ, నీరు, విద్యుత్ సౌకర్యాల కల్పనకు మున్సిపల్ కమీషనర్, ఆర్.డి.ఓ సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆసుపత్రి ప్రవేశ మార్గంలో రాష్ట్ర ప్రధాన రహదారికి ఇరువైపులా బస్ స్టాపులు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అన్నారు.

ఈ సమావేశంలో త్వరితగతిన పనులు పూర్తి చేసేలా కార్యదర్శి అధికారులకు లక్ష్యాలను నిర్దేశించారు. బోధన ఆసుపత్రి నిర్మాణాలు, నియామకాలు, వైద్య సేవల పురోగతి సమీక్షించేందుకు డి.యమ్.ఇ కి చెందిన సీనియర్ అధికారులు వెంకటేశ్, రామన్ లను ప్రత్యేక అధికారులుగా నియమించినట్లు చెప్పారు.

ఈ సమావేశంలో డి.యమ్.ఇ రఘునందన్, డి.హెచ్ పద్మావతి, ఏ.పి.ఎం.ఎస్.ఐ.డి.సి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, సి.ఇ నెహ్రూ, గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ సుందరాచార్య, పల్నాడు డి.యం.హెచ్.ఓ రవి, ఇతరులు పాల్గొన్నారు. ఈ సమీక్ష సమావేశం నిర్వహణకు ముందు కార్యదర్శి నిర్మాణాల పురోగతిని నేరుగా సందర్శించిన కార్యదర్శి సౌరబ్ గౌర్ కాంట్రాక్టర్లుకు పలు సూచనలు చేశారు.

మే నెలాఖరు నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్మాణ పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అనంతరం జానపాడు ఉప ఆరోగ్య కేంద్రం పనితీరును కార్యదర్శి, కలెక్టర్ నేరుగా పర్యవేక్షించారు. యాప్ లో రోగుల వివరాల నమోదు గురించి సిబ్బందిని ప్రశ్నించారు. కామేపల్లిలోని హెల్త్ సెంటర్ 104ను పరిశీలించారు.

Related posts

జలం విలువ తెలియని జగన్ చేసిన నష్టం ఇదీ…..

Satyam News

దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్న మోడీ

Satyam News

కవాడీగూడాలో మహిళ దారుణ హత్య

Satyam News

ప్రధాని మోడీ రోడ్ షోతో దద్దరిల్లిన వారణాసి

Satyam News

రుణ మాఫీ చేసి రైతులను ఆదుకోవాలి

Satyam News

సంచలన విషయాలు బయటపెట్టనున్న లేడీ డాన్ అరుణ?

Satyam News

Leave a Comment