ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు. ధాన్యం కొనుగోలు పైసలన్నీ కేంద్రమే ఇస్తున్నప్పటికీ, వడ్ల కొనుగోలు చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి చేతగావడం లేదని మండిపడ్డారు. వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడుతున్న బాధలను ప్రభుత్వం ద్రుష్టికి తీసుకొచ్చేందుకే ‘‘రైతు గోస బీజేపీ భరోసా’’ పేరుతో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఆధ్వర్యంలో యాత్ర చేపట్టినట్లు తెలిపారు.
ఈరోజు 1 కోటి 39 లక్షల రూపాయల అంచనా వ్యయంతో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ భవనం రెండో అంతస్తు నిర్మాణ పనులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. వీటితోపాటు కార్మిక ఆరోగ్య సంక్షేమ భవన పునరుద్దరణ, షెడ్ల మరమ్మతు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్లతో కలిసి కేంద్ర మంత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. వడ్ల కొనుగోలు అంశంపై మీడియా అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి బండి సంజయ్ పై విధంగా స్పందించారు.
ధాన్యం కొనుగోలు పైసలన్నీ కేంద్రానివా? రాష్ట్రానివా? సమాధానం చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సుతిలీతాడు మొదలు రవాణా ఖర్చులన్నీ కేంద్రమే ఇస్తోందన్నారు. ‘‘వడ్ల కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేవలం మధ్యవర్తి మాత్రమే. మధ్యవర్తిత్వం చేసినందుకు కేంద్రం రాష్ట్రానికి కమీషన్ కూడా ఇస్తోంది. అయినా ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి విఫలమవుతోంది.’’అని విమర్శించారు.
ఇకనైనా బేషజాలకు పోకుండా యుద్ద ప్రాతిపదికన ధాన్యం కొనుగోలును పూర్తి చేయాలని సూచించారు. ‘‘ఇచ్చిన మాట ప్రకారం ప్రతి గింజను కొనుగోలు చేయండి. అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వండి. పొరపాట్లు జరిగిన చోట గుర్తించి వెంటనే సరి చేసుకుని వడ్లను కొనుగోలు చేయాలి. రైతుల సమస్యలను ప్రభుత్వం ద్రుష్టికి తీసుకొచ్చేందుకు బీజేపీ రైతు గోస బీజేపీ భరోసా పేరుతో యాత్రలు చేస్తున్నాం.’’అని తెలిపారు.
