నెల్లూరుహోమ్

సాయిబాబా భక్తుల మనోభావాలను గౌరవిస్తాం

#AnamRamanarayanareddy

సాయిబాబా ఆలయాల విషయంలో తాను చేసిన వ్యాఖ్యలను కొంతమంది వక్రీకరించి, సాయిబాబా భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా తప్పుడు ప్రచారం చేయడం బాధాకరం అని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు.

తన వ్యాఖ్యల ఉద్దేశాన్ని పూర్తిగా పక్కనబెట్టి కొన్ని మీడియా సంస్థలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే…

ముందుగా ఒక విషయం చాలా స్పష్టంగా చెబుతున్నాను. నేను వ్యక్తిగతంగా సాయిబాబా భక్తుడిని. ప్రతిరోజూ ఉదయం నా పూజా మందిరంలో వివిధ దేవతామూర్తులతో పాటు గురుపీఠంపై కొలువై ఉన్న శ్రీ షిర్డీ సాయిబాబా స్వామివారిని భక్తిశ్రద్ధలతో పూజించిన తర్వాతే నా దినచర్యను ప్రారంభిస్తాను. సాయిబాబా పట్ల నాకు అత్యంత గౌరవం, భక్తి ఉన్నాయి. నా వ్యాఖ్యల వల్ల ఏ ఒక్క భక్తుని మనోభావాలు దెబ్బతిని ఉంటే, వారిని హృదయపూర్వకంగా మన్నించమని కోరుతున్నాను.

రాష్ట్ర ప్రభుత్వం గానీ, దేవాదాయ శాఖ గానీ, తిరుమల తిరుపతి దేవస్థానాలు గానీ ఎవరిపైనా వివక్ష చూపడం లేదు. అలాగే ఎవరైనా ఆరాధించే మహనీయులను కించపరచే ఉద్దేశం కూడా మాకు లేదు. సాయిబాబా పట్ల కోట్లాది మంది భక్తులకు అపారమైన విశ్వాసం ఉంది. ఆ విశ్వాసాన్ని మేము పూర్తిగా గౌరవిస్తాము. సాయిబాబా ఆలయాల్లో పూజలు హిందూ సంప్రదాయాలకు అనుగుణంగా జరుగుతున్నాయన్న విషయం కూడా అందరికీ తెలిసిందే.

సనాతన ధర్మ పరిరక్షణే టీటీడీ లక్ష్యం

అయితే టీటీడీ ఆధ్వర్యంలో చేపడుతున్న 5,000 భజన మందిరాలు నిర్మాణ కార్యక్రమానికి ఒక నిర్దిష్ట లక్ష్యం ఉంది. సనాతన హిందూ ధర్మ పరిరక్షణ, ప్రచారం, గ్రామీణ ప్రాంతాల్లో సంప్రదాయ హిందూ దేవాలయాల నిర్మాణమే ఆ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఈ కార్యక్రమానికి సంబంధించి నిధుల విడుదల టీటీడీ రూపొందించిన మార్గదర్శకాలు, శ్రీవాణి ట్రస్టు నిబంధనలు మరియు పరిపాలనా విధానాల ప్రకారమే జరుగుతోంది.

ఇది ఎవరి విశ్వాసాన్ని తక్కువ చేసి చూడడం కాదు. నిధుల కేటాయింపు అనేది పూర్తిగా ట్రస్టు లక్ష్యాలు, నిబంధనలు మరియు పరిపాలనా మార్గదర్శకాల ఆధారంగా జరుగుతున్న ప్రక్రియ మాత్రమే. సాయిబాబా ఆలయాలకు ఈ పథకం కింద నిధులు ఇవ్వకపోవడం అంటే సాయిబాబా స్వామివారిని లేదా ఆయన భక్తులను అవమానించడం కాదని మరోసారి స్పష్టం చేస్తున్నాను.

మన సమాజంలో శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, పరమశివుడు, అమ్మవారు, అయ్యప్ప స్వామి, ఆంజనేయస్వామి, సాయిబాబా వంటి అనేక ఆరాధనా రూపాల పట్ల ప్రజలకు అపారమైన విశ్వాసం ఉంది. ప్రభుత్వం ఏ విశ్వాసాన్నీ కించపరచదు. ప్రతి భక్తుని మనోభావాలను గౌరవించడం మా ప్రభుత్వ విధానం.

కాబట్టి ఈ అంశాన్ని అనవసర వివాదంగా మార్చడం సరికాదు. ఇది భక్తి, విశ్వాసాలకు సంబంధించిన అంశం కాదు. ట్రస్టుల లక్ష్యాలు, వాటి నిబంధనలు మరియు పరిపాలనా విధానాలకు సంబంధించిన అంశం మాత్రమే. సనాతన ధర్మ పరిరక్షణతో పాటు ప్రతి భక్తుని విశ్వాసాన్ని గౌరవించడం మా ప్రభుత్వం మరియు దేవాదాయ శాఖ స్పష్టమైన విధానం.

సాయిబాబా భక్తుల విశ్వాసాన్ని మేము గౌరవిస్తాం. అదే సమయంలో సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన ట్రస్టుల లక్ష్యాలను కూడా గౌరవిస్తాం. వాస్తవాలను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను ఎవరూ నమ్మవద్దని కోరుతున్నాను అని అన్నారు.

Related posts

పోలీసులకు చిక్కిన అంతర్ రాష్ట్ర ముఠా

Satyam News

ఇరాన్ తో చర్చలు విఫలం: వెనుతిరిగిన వాన్స్

Satyam News

అసదుద్దీన్ కు కీలక పదవి ఇచ్చిన బీజేపీ

Satyam News

ప్రపంచ మహిళా హాకీ లో భారత్ శుభారంభం

Satyam News

లోడర్ ఎక్సవేటర్ యంత్రాలతో రైతులకు మేలు

Satyam News

రోడ్డు ప్రమాదంలో మరణించిన టీటీడీ కళారులకు సాయం

Satyam News

Leave a Comment