ఆంధ్రప్రదేశ్ బ్యూరోక్రసీలో అత్యంత సంచలన, వివాదాస్పద అధికారిణిగా పేరున్న 1988 బ్యాచ్ సీనియర్ IAS వై. శ్రీలక్ష్మికి కూటమి ప్రభుత్వం సర్‌ప్రైజ్ ఇచ్చింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎలాంటి బాధ్యతలు లేకుండా వెయిటింగ్‌లో ఉన్న ఆమెను, సచివాలయంలో అత్యంత కీలకమైన సాధారణ పరిపాలన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
రిటైర్మెంట్‌కు కేవలం 4 రోజుల ముందు ఆమెకు ఇంతటి ప్రతిష్టాత్మక పోస్టింగ్ దక్కడం పొలిటికల్, బ్యూరోక్రాటిక్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ నిర్ణయం వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ మానవతా దృక్పథం, పెద్ద మనసు స్పష్టంగా కనిపిస్తోంది.
అధికారిక నిబంధనల ప్రకారం..వై.శ్రీలక్ష్మి ఈ జూన్ 30న సర్వీసు నుండి రిటైర్ కానున్నారు. ఒకవేళ ఎలాంటి పోస్టింగ్ లేకుండా లేదా సస్పెన్షన్ వంటి చర్యల మధ్య ఆమె రిటైర్ అయి ఉంటే, ఆ ప్రభావం ఆమె కెరీర్ రికార్డుతో పాటు పెన్షన్, గ్రాట్యుటీ వంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్‌పై తీవ్రంగా పడే అవకాశం ఉండేది.
కానీ, ఒక సీనియర్ మహిళా అధికారిణి సుదీర్ఘ సర్వీసును దృష్టిలో ఉంచుకుని, ఆమెకు గౌరవప్రదమైన వీడ్కోలు లభించాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు సర్కార్ రాజకీయ వైరాన్ని పక్కన పెట్టి ఈ నిర్ణయం తీసుకుంది. తప్పు చేసిన వారిపై చట్టప్రకారం విచారణలు జరుగుతున్నప్పటికీ, రిటైర్మెంట్ వయసులో అధికారిణికి కక్షసాధింపులు లేకుండా గౌరవాన్ని ఇవ్వాలనే ఉన్నతమైన సంప్రదాయానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
శ్రీలక్ష్మి సుదీర్ఘ కెరీర్‌ను పరిశీలిస్తే ప్రశంసల కంటే వివాదాలు, చట్టపరమైన ఇబ్బందులే ఎక్కువగా కనిపిస్తాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పరిశ్రమల శాఖ కార్యదర్శిగా ఉన్న సమయంలో ఆమె చుట్టూ ఉన్నత స్థాయి అవినీతి వివాదాలు ముసురుకున్నాయి.
గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ లీజుల కేటాయింపుల్లో నిబంధనలను తుంగలో తొక్కి, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే తీవ్ర ఆరోపణలు ఆమెపై వచ్చాయి. ఈ కేసులో CBI ఆమెను నిందితురాలిగా చేర్చడంతో అరెస్ట్ అయి, చంచల్‌గూడ జైల్లో సుదీర్ఘ కాలం రిమాండ్ ఖైదీగా జైలు జీవితం గడపాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆమె IAS సర్వీస్ నుండి సస్పెండ్ కూడా అయ్యారు.
జగన్ అక్రమాస్తుల కేసులో కూడా…
కేవలం ఓబుళాపురం మైనింగ్ కేసు మాత్రమే కాకుండా, YSR హయాంలోనే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జగన్ అక్రమాస్తుల కేసు, దాల్మియా సిమెంట్స్ వివాదంలోనూ శ్రీలక్ష్మి పేరు ప్రముఖంగా వినిపించింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్విడ్ ప్రో కో వ్యవహారాలకు సంబంధించి దాల్మియా సిమెంట్స్ సంస్థకు కడప జిల్లాలో అక్రమంగా సున్నపురాయి గనుల కేటాయింపులు చేశారనే ఆరోపణలపై CBI దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో ఆమెను నిందితురాలిగా పేర్కొన్నారు.
మైనింగ్ పరిమితులను దాటి సదరు సంస్థకు లబ్ధి చేకూర్చడం వెనుక ఆమె పాత్ర ఉందంటూ కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఇలా YSR హయాంలో జరిగిన అతిపెద్ద స్క్యామ్‌లలో కీలక అధికారిణిగా శ్రీలక్ష్మి తీవ్ర లీగల్ ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
రాష్ట్ర విభజన అనంతరం క్యాట్ ఆదేశాలతో తెలంగాణ నుండి ఏపీ కేడర్‌కు వచ్చిన శ్రీలక్ష్మికి, గత వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో అపారమైన ప్రాధాన్యత లభించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ ఆమెకు వరుస ప్రమోషన్లు లభించడంతో పాటు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బ్యూరోక్రసీలోనే టాప్ పొజిషన్‌ను అనుభవించారు.
అయితే 2024 ఎన్నికల తర్వాత సీన్ మారడంతో ఆమె మళ్లీ లూప్‌లైన్‌లోకి వెళ్లాల్సి వచ్చింది. ఎన్నో లీగల్ ఇబ్బందులు, తీవ్రమైన ఆరోపణలు, గతం నాటి జైలు రికార్డులు ఉన్నప్పటికీ.. చివరి క్షణంలో ఆమె సీనియారిటీని గౌరవిస్తూ GAD స్పెషల్ సీఎస్‌గా గౌరవప్రదమైన ముగింపునివ్వడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం….రాజకీయాలకు అతీతంగా మానవత్వాన్ని చాటుకుంది.
