భారతదేశ సమాజం , సంస్కృతిలో డ్రగ్స్, మదక ద్రవ్యాలకు తావు లేదని ప్రస్తుతం విస్తరిస్తున్న డ్రగ్స్ సంస్కృతిని కూకటి వేళ్ళతో పెకిలిద్దామని, డ్రగ్స్ రహిత సమాజాన్ని సాధిద్దామని శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి పిలుపునిచ్చారు.
శుక్రవారం చేవెళ్లలోని డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి వైద్య కళాశాల జనరల్ హాస్పిటల్ లో ఫ్యూచర్ సిటీ పోలీసులు, ఈగల్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఏసీపీ కిషన్ నిర్వహించిన అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం 2026 అవగాహన సదస్సులో ఆయన ప్రసంగించారు. మెడికల్, నర్సింగ్, ఫిజియోథెరపీ విద్యార్థుల తో డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో ప్రభుత్వం డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ఉక్కు పాదం మోపుతూ గట్టి చర్యలు తీసుకుంటుందని వివరించారు. క్షణికానందం కోసం తెలిసి తెలియని వయసులో అవగాహన లేకపోవడంతో, కొందరు గంజాయికి, మద్యానికి, డ్రగ్స్ కు అలవాటు పడుతున్నారని, ఇలాంటివి ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతున్నాయని ఆయన అన్నారు.
చెడు అలవాట్లకు బానిసలై భవిష్యత్తును పాడు చేసుకోవద్దు
ముఖ్యంగా యువత చెడు అలవాట్లకు బానిసలై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఇలాంటి పరిస్థితుల నుండి యువతను రక్షించేందుకు పోలీసులు అవగాహన సదస్సును నిర్వహించడం సంతోషకరమని చెప్పారు. డ్రగ్స్ రహిత తెలంగాణను సాధిద్దామని ఆయన అన్నారు.
వైద్య విద్యార్థులు డ్రగ్స్ కు అలవాటు పడ్డ వారికి మానసికంగా మార్చేందుకు కృషి చేయాలని సూచించారు. డ్రగ్స్ నియంత్రణ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ త్వరలో ప్రతి విద్యా సంస్థలను ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి విద్యార్థులకు యువతకు అవగాహన కల్పిస్తుందని వెల్లడించారు.
ఏసిపి కిషన్ మాట్లాడుతూ డ్రగ్స్ వాడకం నేర ప్రవృత్తిని పెంచుతుందని, ఇది ఉగ్రవాదం కంటే ప్రమాదకరమైందని వివరించారు. గంజాయి డ్రగ్స్ తదితరాల వినియోగించే వారు చట్టపరంగా కఠిన శిక్షలకు గురవుతారని, తమ బంగారు భవిష్యత్తును కోల్పోతారని అన్నారు.
తెలిసి తెలియక డ్రగ్స్ కు అలగాటు వారిని నేరస్తులుగా గుర్తించడం శిక్షించడం అటు ఉంచితే వారి పరివర్తనకు డాక్టర్లు తమ వైద్యం ద్వారా సహకరించాలని సూచించారు. డ్రగ్స్ నియంత్రణకు వాటిని వాడుతూ చికిత్స కోసం ఆసుపత్రి కి వచ్చిన వారి సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలని కోరారు. ప్రతి విద్యాసంస్థలో ప్రభుత్వం డ్రగ్స్ వ్యతిరేక కమిటీలను ఏర్పాటు చేస్తుందని అన్నారు.
మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా సదస్సులు
ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ లో సీపీ తరుణ్ జ్యోషి నేతృత్వంలో డిసిపి యోగేష్ గౌతమ్ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాలు, డ్రగ్స్ కు వ్యతిరేకంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ విస్తరిస్తున్న డ్రగ్స్ ను అరికట్టడంలో వైద్య విద్యార్థులు, డాక్టర్లు పాత్ర ఎంతో ఉంటుందని అన్నారు. చేవెళ్ల సిఐ భూపాల్ శ్రీధర్ మాట్లాడుతూ డ్రగ్స్ చెడు పరిణామాల పట్ల విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. తెలిసి తెలియక తమ బంగారు భవితను నాశనం చేసుకోవాలని స్పష్టం చేశారు.
కళాశాల వైస్ ప్రిన్సిపల్ రాజేశ్వరరావు విద్యార్థులచే డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. ఎస్సై తేజశ్రీ, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ జోయా రాణీ, సీనియర్ సిబ్బంది సీఈఓ అజ్ముల్ హస్సన్, సీనియర్ నాయకులు మాణిక్ రెడ్డి, రఘువీరారెడ్డి, వినోద్ రెడ్డి, మల్లారెడ్డి,అనీల్, తదితరులు పాల్గొన్నారు.
