భారత స్వాతంత్య్ర సంగ్రామంలో తెల్లదొరలను ఎదిరించిన విప్లవకారుడు అల్లూరి సీతారామరాజు పేరు భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు పెట్టడంతో ఆయన త్యాగం దేశ చరిత్రలో చిరస్మరణనీయంగా నిలిచిపోతోందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.
ఈ నెల 1న భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవం నేపథ్యంలో శనివారం జిల్లాకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి ఎయిర్‌పోర్ట్‌ను పరిశీలించిన మంత్రి అనంతరం అక్కడ విలేకర్ల సమావేశంలో ఎయిర్‌పోర్ట్ గురించి పలు విషయాలు వెల్లడించారు. ఉత్తరాంధ్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన భోగాపురం అల్లూరి సీతారామరాజు విమానాశ్రయాన్ని ఆగస్టు 1 పీఎం మోడీ ఆవిష్కరిస్తున్నారని తెలిపారు.
ఈ సభలో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ , కేంద్ర పౌరవిమానయాన శాఖా మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు గారు పాల్గొంటున్నట్టు మంత్రి తెలిపారు. అరకు ప్రాంతానికి చెందిన సుమారు 13,000 మంది బాలికలతో ప్రత్యేక దింసా నృత్య ప్రదర్శనతో ప్రధానమంత్రికి స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
బీచ్ కారిడార్ కోసం రు. 8 వేల కోట్లతో మాస్టర్ ప్లాన్ :
ఈ బహిరంగ సభకు ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాల నుంచి 5 వేల బస్సులతో భారీ ఎత్తున జనసమీకరణ చేస్తున్నట్టు మంత్రి చెప్పారు. ఇక విశాఖపట్నం నుంచి విమానాశ్రయానికి ప్రతిపాదించిన 7 కనెక్టివిటీ రహదారులలో ఇప్పటికే 4 పూర్తయ్యాయని.. మిగిలిన 3 రహదారుల పనులు శరవేగంగా జరుగుతున్నట్టు తెలిపారు.
అలాగే కోస్టల్ కారిడార్‌గా 6 లైన్ల బీచ్ రహదారిని రు. 8000 కోట్లతో అనుసంధానించే మాస్టర్ ప్లాన్ కూడా రెడీ అవుతోందన్నారు. విశాఖ నగరం నుంచి విమానాశ్రాయానికి వచ్చే ప్రయాణికుల కోసం జీఎంఆర్ సంస్థకు 69 మెట్రో బస్సులను కూడా కేటాయించినట్టు మంత్రి కొండపల్లి స్పష్టం చేశారు.
ఎర్రబస్సు .. ఎయిర్‌పోర్ట్ అన్న వైసీపీ నేతలు ఇప్పుడేమంటారో.. ?
గతంలో ఎయిర్‌పోర్ట్ నిర్మాణంపై ఎర్రబస్సు వెళ్లని చోట ఎయిర్‌పోర్ట్ ఎందుకని వైసీపీ నేతలు వెటకారం చేశారని.. ఇప్పుడు చంద్రబాబు ఎంతో కష్టపడి ఈ ప్రాజెక్టు పూర్తయ్యేలా చేయడంతో వైసీపీ వాళ్ల వద్ద సమాధానం లేకుండా పోయిందని మంత్రి ఎద్దేవా చేశారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు చూసి వైసీపీ నేతలు కళ్లు తెరవాలన్నారు.
ఈ విమానాశ్రయ నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు, స్థానిక యువతకు ఉపాధి కల్పించేందుకు ఇప్పటికే జాబ్ మేళాలు నిర్వహించి బ్లూ కాలర్, వైట్ కాలర్ ఉద్యోగాలు కూడా వారికి ఇచ్చామన్నారు. ఉత్తరాంధ్ర మామిడి, మత్స్య ఉత్పత్తులు ప్రపంచస్థాయికి ఎగుమతి అయ్యేలా కార్గో సదుపాయం కూడా త్వరలోనే రాబోతోందని తెలిపారు. దీనివల్ల అనేక పరిశ్రమలు ఇక్కడకు వచ్చి ఉత్తరాంధ్ర నుంచి వలసలు తగ్గుతాయన్న ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు.
ఆగస్టు 17 నుంచి పూర్తి సేవలు : మంత్రి కొండపల్లి
వచ్చే నెల17నుంచీ ఏటీఎస్ఆర్ భోగాపురం ఏర్ పోర్ట్ నుంచీ విమాన సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. శంషాబాద్ విమానాశ్రయం ఏర్పాటు తర్వాత హైదరాబాద్ ఎలా అభివృద్ధి చెందిందో భోగాపురం ఎయిర్‌పోర్ట్ తర్వాత విజయనగరం జిల్లా కూడా అలాగే అభివృద్ధి చెందుతుందని మంత్రి కొండపల్లి అన్నారు. ఈ సందర్భంగా మంత్రి భూములు ఇచ్చిన రైతులతో పాటు ప్రాజెక్టు త్వరగా పూర్తి చేసిన జీఎంఆర్ యాజమాన్యానికి, ప్రతి నెలా సమీక్షలు చేసి పనులు వేగంగా పూర్తయ్యేలా చేసిన కేంద్ర పౌరవిమానయాన శాఖా మంత్రి కింజారపు రామ్మెహన్ నాయుడుకు, మోడీ, చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
అలాగే 2015లో నాడు కేంద్ర విమానయాన శాఖా మంత్రిగా ఉన్న పూసపాటి అశోక్‌గజపతిరాజు ఈ ఎయిర్‌పోర్ట్ నిర్మాణం కోసం ఎంతో కృషి చేశారని.. ఇప్పుడు ఇది పూర్తి కావడంతో ఆయన కల నెరవేరిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.
రు. 4592 కోట్లతో ఎయిర్‌పోర్ట్ నిర్మాణం : కలెక్టర్ రాం సుందర్ రెడ్డి
2017లో నాడు ముఖ్యమంత్రి హోదాలోనే చంద్రబాబు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తే 2026 ఆగస్టు 1న మళ్లీ చంద్రబాబు గారు సీఎంగా ఉండగానే ప్రారంభోత్సవం జరుపుకోవడం అభినందనీయమన్నారు. రు. 4592 వేల కోట్లతో నిర్మితమైన ఈ ఎయిర్‌పోర్ట్ ప్రస్తుతం యేడాదికి 60 లక్షల ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసే సామర్థ్యంతో పనిచేస్తుందని.. భవిష్యత్తులో యేడాదికి 4 కోట్ల మంది ప్రయాణికులకు కూడా సేవలు అందించేలా తీర్చిదిద్దినట్టు తెలిపారు.
ఈ ఎయిర్‌పోర్ట్‌కు 3800 మీటర్ల పొడవైన రన్‌వే ఉండడంతో ఎలాంటి పెద్ద విమానం అయినా సులువుగానే ల్యాండ్ అవుతుందని కలెక్టర్ తెలిపారు. అత్యాధునికమైన ప్యాసింజర్ టెర్మినల్‌తో పాటు త్వరలోనే కార్గో టెర్మినల్ కూడా అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేశారు.
క్వాలిఫైడ్ సిబ్బందితో విమానయాన సేవలు అందించాలన్న ఉద్దేశంతో పక్కనే జీఎంఆర్ ఏవియేషన్ యూనివర్సిటీ కూడా అందుబాటులోకి వస్తోందని.. ఏపీలోనే మొదటిసారిగా ఒక ఎంఆర్‌ఓ (MRO – ఫ్లైట్ మెయింటెనెన్స్) ఫెసిలిటీ కూడా ఇక్కడ ఏర్పాటు అవుతోందన్నారు. ఈ విమానాశ్రయం ఏర్పాటుతో ప్రత్యక్షంగా 15 వేల మందికి, పరోక్షంగా 5.85 లక్షల మందికి ఉపాధి దొరుకుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ ప్రాంతం అంతా భవిష్యత్తులో హోటళ్లు, వర్తకం, రెస్టారెంట్లు, కమ్యూనికేషన్, ఐటీ మరియు రియల్ ఎస్టేట్ రంగాలకు ఒక ప్రధాన కేంద్రంగా (హబ్) మారబోతోందని కూడా కలెక్టర్ పేర్కొన్నారు.
20 ఏళ్ల నాడు బాబు మదిలో బీజం: చీపురుపల్లి ఎమ్మెల్యే కళా వెంకట్రావు
2002-03లో అప్పుడు సమైక్యాంధ్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు మలేషియా వెళ్లి అక్కడ ఎయిర్‌పోర్ట్ చూసిన వెంటనే భోగాపురంలోనూ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించాలనుకున్నారని ఎమ్మెల్యే కళా వెంకటరావు గుర్తు చేశారు.ఇన్నేళ్లకు భోగాపురం ఎయిర్‌పోర్ట్ పూర్తి కావడంతో ఉత్తరాంధ్ర వాసులకు ఆ గొప్ప అదృష్టం దక్కిందన్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్రకు రైల్వేజోన్ ఏర్పాటు కావడం, ఉద్యోగ కల్పనలో దేశంలోనే వైజాగ్‌కు 5వ స్థానం దక్కడం.. మోడీ డబుల్ ఇంజన్ సర్కార్‌లో ఈ ప్రాంతంలో అభివృద్ధి పరుగులు పెట్టడం చూస్తుంటే భవిష్యత్తులో ఉత్తరాంధ్రకు మహర్దశ పట్టనుందని జోస్యం చెప్పారు.
జీఎంఆర్‌కు కృతజ్ఞతలు:ఎంపీ కలిశెట్టి
ప్రపంచంలో ఎన్నో ఎయిర్‌పోర్ట్‌లు ఉన్న జీఎంఆర్ తన సొంత ప్రాంతమైన రాజాం, విజయనగరం జిల్లాకు గొప్ప ఎయిర్‌పోర్ట్ ఉండాలన్న సంకల్పంతోనే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూర్తి చేశారని కొనియాడారు. కూటమి ప్రభుత్వాల్లోని నేతలు, భూములు ఇచ్చిన రైతులు, జీఎంఆర్‌కు ఎంపీ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
నా నియోజకవర్గ ప్రజల అదృష్టం: ఎమ్మెల్యే లోకం నాగ మాధవి
నా నియోజకవర్గంలో ఇంత గొప్ప అంతర్జాతీయ విమానాశ్రయం రావడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమన్నారు. ఎన్డీయే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పూర్తి చేసిన ఈ ప్రాజెక్టును ప్రపంచంలోనే గొప్ప పవర్ ఫుల్ నాయకుడు పీఎం మోడీ చేతుల మీదుగా జాతికి అంకితం కావడం గర్వకారణమని తెలిపారు. అలాగే రుషికొండ నుండి భోగాపురం వరకు ఒక మంచి కారిడార్‌గా ఐటీ, పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయని తాను విశ్వసిస్తున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా టీడీపీ అధ్యక్షులు, డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున, కూటమి నేతలు పాల్గొన్నారు.
