కృష్ణా జిల్లా ఉయ్యూరు పట్టణంలో శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం ఆదివారం అత్యంత భక్తి శ్రద్ధలతో, వైభవంగా జరిగింది. స్వామివారి కళ్యాణ వేడుకలను దర్శించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.
జిల్లాలోని గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు మహాక్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ కళ్యాణం నిర్వహించారు. డోకిపర్రు మహాక్షేత్రం వెలుపల స్వామి వారి కళ్యాణం నిర్వహించటం ఇదే తొలిసారి. అందుకు ఉయ్యూరు పట్టణం వేదిక ఐంది.
పట్టణంలోని రిలయన్స్ స్మార్ట్ పక్కన ఉన్న గ్రౌండ్ లో శ్రీ భూసమేత శ్రీనివాస స్వామి వారి భక్తానుగ్రహ విశేష కళ్యాణ మహోత్సవం ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు, మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రుక్చర్స్ లిమిటెడ్ (ఎం ఈ ఐ ఎల్ ) మేనేజింగ్ డైరెక్టర్ పీ వీ కృష్ణా రెడ్డి, డైరెక్టర్ సుధా రెడ్డి ఆధ్వర్యంలో కొమ్మారెడ్డి బాపిరెడ్డి, విజయ భాస్కరమ్మ పర్యవేక్షణలో జరిగింది.
కళ్యాణం సందర్భంగా భారీ వేదికను ఏర్పాటు చేశారు. వేదికను పుష్పాలతో అలంకరించి అందంగా తీర్చి దిద్దారు. వేదికపై శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవ మూర్తులను ఉంచి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. కళ్యాణం జరిపించారు. అంతకు ముందు కళ్యాణం జరిగే ప్రాంగణంలో కళ్యాణ మూర్తులను ఊరేగించారు.
మంగళవాయిద్య నాదాల మధ్య, వేద పండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారి కళ్యాణోత్సవం ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా జరిగింది. ప్రత్యేక అలంకరణ చేసిన శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య మూర్తులు భక్తులను ఆకట్టుకున్నాయి. పుష్పాలంకరణలు, దీపాల వెలుగులు, నాద స్వరాల మధ్య కళ్యాణ వేడుక తిరుమల కళ్యాణాన్ని తలపించేలా ఆలయ ధర్మకర్తలు నిర్వహించారు.
ఈ మహోత్సవానికి ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త సుధా రెడ్డి, ప్రసన్నలతో పాటు కొమ్మారెడ్డి బాపిరెడ్డి, విజయభాస్కరమ్మ దంపతులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి కల్యాణంలో భాగస్వాములు అయ్యి స్వామి వారి సేవలో తరించారు. స్వామివారి కటాక్షం అందరిపై ఉండాలని వారు ఆకాంక్షించారు.
వేలాది మంది భక్తులు స్వామివారి ఆశీర్వాదాలు పొందుతూ, కుటుంబ సమేతంగా కళ్యాణ మహోత్సవంలో పాల్గొని పుణ్యఫలాన్ని సొంతం చేసుకున్నారు.
ఈ దివ్య కళ్యాణ మహోత్సవం ఉయ్యూరు పట్టణానికి ఆధ్యాత్మిక శోభను తెచ్చి, భక్తి భావాలను మరింతగా పెంపొందించింది. శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపా కటాక్షాలు సర్వ లోకాలకు శాంతి, సమృద్ధి కలిగించాలని భక్తులు ప్రార్థించారు. కళ్యాణం అనంతరం అన్న ప్రసాద వితరణ చేశారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
శ్రీ భూ సమేత శ్రీనివాస స్వామి వారి భక్తానుగ్రహ విశేష కళ్యాణ మహోత్సవం సందర్భంగా వేదికపై అన్నమాచర్య కీర్తనలు ఆలపించారు. శ్రీనివాస వైభవాన్ని, కళ్యాణం విశేషాలను భక్తులకు తెలిపేలా భాగవతుల వెంకట్రామ శర్మ శిష్యులు చేసిన నృత్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కేరళ వాయిద్య బృందం వారి ప్రదర్శనలు, మహిళా భక్తుల కోలాటం భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తాయి.
