పంజాబ్ రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంలో చేసి తీరుతామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా దసరా నాడు ప్రతిన బూనారు. 2029 డిసెంబర్ 31 నాటికి రాష్ట్రంలో మాదకద్రవ్యాల అక్రమ వ్యాపారాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. విజయదశమి సందర్భంగా పంజాబ్‌లోని లూధియానాలో నిర్వహించిన రావణ దహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
మాదకద్రవ్యాల మహమ్మారికి ప్రతీకగా నిలిచే ‘చిట్టా’ అనే మత్తు పదార్థం రూపంలోని రావణుడి ప్రతిమను దహనం చేశారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, మన సంప్రదాయంలో రావణ దహనం చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమలోని అహంకారం, గర్వం, దురాశ వంటి చెడు లక్షణాలను తొలగించుకోవాలని సూచించారు. వేల సంవత్సరాల క్రితం విజయదశమి రోజున శ్రీరాముడు రావణుడిపై విజయం సాధించారని, అప్పటి నుంచి ఈ పండుగను చెడుపై మంచి విజయానికి ప్రతీకగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నామని చెప్పారు.
మాదకద్రవ్యాల వ్యాపారానికి వ్యతిరేకంగా పోరాడుతూ తమ కుమారులను కోల్పోయిన మూడు కుటుంబాలను పంజాబ్‌లోని మూడు ప్రాంతాల్లో తాను కలుసుకున్నానని అమిత్ షా వెల్లడించారు. ఆ కుటుంబ సభ్యుల కళ్లలో కనిపించిన కన్నీళ్లు, వారి ప్రశ్నలు, వారు అనుభవిస్తున్న బాధ ఎవరినైనా కదిలిస్తాయని అన్నారు. మాదకద్రవ్యాల అక్రమ వ్యాపారానికి వ్యతిరేకంగా పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు న్యాయం జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
వీటిలో ఒక హత్య కేసు దర్యాప్తును పంజాబ్ ప్రభుత్వం సీబీఐకి అప్పగించిందని అమిత్ షా తెలిపారు. మిగిలిన రెండు హత్య కేసుల దర్యాప్తును కూడా సీబీఐకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కేసుల్లో బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. దర్యాప్తు సీబీఐకి అప్పగించిన తర్వాత ఈ హత్యల వెనుక ఎంతటి ప్రముఖులు ఉన్నా వారిని గుర్తించి జైలుకు పంపిస్తామని చెప్పారు.
పంజాబ్‌ను మాదకద్రవ్యాల రహిత రాష్ట్రంగా మార్చాలనే సంకల్పాన్ని విజయదశమి సందర్భంగా ప్రతి ఒక్కరూ తీసుకోవాలని అమిత్ షా పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల బారిన పడి ప్రాణాలు కోల్పోయిన ముగ్గురికి అందించే గొప్ప నివాళి ఇదేనని పేర్కొన్నారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలకు సంబంధించిన సమాచారాన్ని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) టోల్ ఫ్రీ నంబర్‌కు అందించాలని ప్రజలను కోరారు. ప్రజల నుంచి అందే సమాచారంపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చిన చరిత్ర కలిగి ఉందని అమిత్ షా అన్నారు. రాజ్యాంగంలోని 370, 35ఏ అధికరణలను రద్దు చేశామని, ఉగ్రవాదాన్ని నిర్మూలించే దిశగా చర్యలు చేపట్టామని, వామపక్ష తీవ్రవాదాన్ని అంతం చేశామని పేర్కొన్నారు. అదే విధంగా దేశంలో మాదకద్రవ్యాల అక్రమ వ్యాపారాన్ని కూడా నిర్మూలించేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.

కట్టుకున్న భార్యల్ని ఎగతాళి చేసేవారే ఎక్కువ